ఎంతటి వారికైనా అప్ అండ్ డౌన్స్ తప్పవు. నిర్మాతగా సక్సెస్ లు కొడుతున్న దిల్ రాజు పంపిణీదారుగా మాత్రం 2017లో చాలా గట్టి దెబ్బలు తిన్నారు. అయితే సినిమాల నిర్మాణం, థియేటర్లు, ఇలా అన్నీ కలిపి రొటేషన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ 2018 విషయంలో మాత్రం దిల్ రాజు చాలా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన సన్నిహితుల దగ్గర పిచ్చాపాటీగా ఓపెన్ అయినట్లు వినిపిస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు. ఇప్పుడు దిల్ రాజు సినిమాలు కొనడం మానేసారు.కేవలం పంపిణీ మాత్రమే చేస్తున్నారు. అందువల్ల అక్కడ మరీ ఎక్కువ సంపాదించేసేంత లేదు. ఎందుకంటే మార్జిన్ల మీదే నడుస్తుంది వ్యవహారం. దీనికి తోడు 2017లో దిల్ రాజు నిర్మాణంలో అన్నీ క్రేజీ ప్రాజెక్టులు వచ్చాయి. కానీ ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు.
2018లో తొలి సినిమాగా లవర్ విడుదలవుతోంది. రాజ్ తరుణ్ హీరో, హర్షిత్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా మీద అంత బజ్ ఏమీలేదు. పైగా రాజ్ తరుణ్ డౌన్ ఫాల్ లో వున్నాడు. దీని తరువాత శ్రీనివాసకళ్యాణం సినిమా వుంది. నితిన్ హీరో. అతగాడి పరిస్థితి అంతంత మాత్రమే.ఈ సినిమా మీద మాత్రం దిల్ రాజు చాలా ఆశలతో వున్నారు.
ఇక మరో ఫ్లాపుల హీరో రామ్ తో నక్కిన త్రినాధరావు సినిమా ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా వుంది. దీనికి ఏ మాత్రం బజ్ వస్తుందో చూడాలి. ఈ మూడు సినిమాల పరిస్థితి ఇలా వుంటే, మహేష్ బాబుతో సినిమా రెడీ అవుతోంది. కానీ దాంట్లో దిల్ రాజుకు మిగిలేది తక్కువ. ఎందుకంటే అటు పివిపి ఇటు అశ్వనీదత్ తో వాటాలు పంచుకోవాలి. ఇక మిగిలిన ఆశ అల్లా F2 సినిమా మీదే. మంచి ప్రాజెక్టు అనుకొవాలి. అనిల్ రావిపూడి దర్శకుడు, వెంకీ, వరుణ్ తేజ్ హీరోలు.
ప్రస్తుతానికి ఇవే దిల్ రాజు ప్రాజెక్టులు. అయిదింటిలో రెండు మూడింటి మీదే హోప్ వుంది. అదృష్టం బాగుండి అన్నీ ఓకె అయితే సరే, లేదూ అంటే గత ఏడాది డిస్ట్రిబ్యూటర్ గా ఇబ్బందుల చవిచూసిన దిల్ రాజు ఈ ఏడాది నిర్మాతగా ఇబ్బందులు చూడాలి. ఇదే టెన్షన్ ను దిల్ రాజు సన్నిహితుల దగ్గర షేర్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.