“కోవర్ట్” అనే పదం మొదటగా ఉలిక్కి పడేది జనసేన ఫ్యాన్స్ కమ్ కార్యకర్తలే. ఎందుకంటే.. “ప్రజారాజ్యం” పతనానికి ఈ కోవర్టులే కారణమని… పవన్ కల్యాణ్ కూడా పదే పదే చెబుతూంటారు. ఇటీవల సభల్లోనూ అదే చెబుతున్నారు. వారినెవర్నీ వదిలి పెట్టనని.. రాసి పెట్టుకున్నానని కూడా హెచ్చరికలు జారీ చేస్తూంటారు. అయితే ఇప్పుడు కొత్తగా జనసేనలోనూ ఈ “కోవర్ట్” పదం కలకలం రేపుతోంది. జనసేన కార్యకర్తల వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా చర్చనీయాంశమవుతోమది.
జనసేన పార్టీకి, అధినేత పవన్ కల్యాణ్‌కు ఇటీవల ఓ సినీ నిర్మాత దగ్గరయ్యారు. ఆయన తీసిన ఓ సినిమా ఈ వారంలో విడుదల కాబోతోంది. ఆ సినిమా వేడుకకు పవన్ కూడా హాజరయ్యారు. హీరోతో ఉన్న దోస్తీ కారణంగా పవన్ హాజరయ్యారేమో అనుకున్నారు కానీ.. అసలు విషయం మాత్రం నిర్మాతతో సాన్నిహిత్యమట. ప్రస్తుతం ఆ నిర్మాత జనసేన ..సోషల్ మీడియా టీంకు ఫండింగ్ చేస్తూ.. డామినేటింగ్‌గా వ్యవహరిస్తున్నారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన నిజంగా జనసేనపై అభిమానంతో రాలేదని.. కోవర్ట్ అంటూ ఫ్యాన్స్ అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. దానికి ఆయన చేస్తున్న వ్యవహారాలను సాక్ష్యంగా వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారు.
శతఘ్ని టీం వ్యవహారాల్లో ఈ నిర్మాత ఇప్పుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారట. తన నచ్చని వ్యక్తులపై ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తూ… జనసేన ఇమేజ్‌కు దెబ్బతీస్తున్నారనేది.. ఫ్యాన్స్ ఆరోపణ. జనసేనకు శత్రువులను పెంచుతూ పోతున్నారని.. ఈ సమయంలో.. ఇలా వ్యతిరేకుల్ని పెంచుకోడం సమంజసం కాదని.. జనసేన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. పార్టీ అధినేతను సదరు నిర్మాత మభ్యపెడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఈ నిర్మాత ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్ అయ్యారు. ఇది పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లిందో లేదో కానీ… ఫ్యాన్స్ మాత్రం… సదరు నిర్మాతను…జనసేన నుంచి దూరం చేయాలన్న పట్టుదలతో ..సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ చేస్తున్నారు.