చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’కి రామ్‌చరణ్ నిర్మాత అనే సంగతి అందరికీ తెలిసిందే. చిరు తొమ్మిదేళ్ల తరవాత రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం.150’కీ చరణే నిర్మాత. ఆ సినిమాలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన చరణ్‌కి బాగానే గిట్టుబాటు అయ్యింది. అందుకే ‘సైరా’ బాధ్యతనీ తానే తీసుకున్నాడు. ఈ సినిమా మొదలెట్టేటప్పుడు బడ్జెట్ వంద కోట్లే అనుకున్నారు. కానీ అంచనాలతో పాటు అంకెలూ పెరిగాయి. పేరున్న టెక్నీషియన్లు, నటులు వచ్చి చేరడం, చిత్రీకరణ ఆలస్యం అవుతుండడం, వర్కింగ్ డేస్ పెరుగుతుండడంతో బడ్జెట్ కూడా పెరుగుతూ పోయింది. ఇప్పుడు ‘సైరా’ బడ్జెట్ రూ.200 కోట్ల దగ్గర ఆగింది. రూ.200 కోట్లు పెట్టగలిగే సత్తా చరణ్‌లో ఉంది. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే.. ఇప్పుడు చరణ్ మరో నిర్మాత సహకారం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఆయనే డి.వి.వి. దానయ్య. చరణ్ – బోయపాటి చిత్రానికి దానయ్య నిర్మాత. ఆయన సైడ్ నుంచి ‘సైరా’కి పెట్టుబడి పెడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ‘సైరా’ బిజినెస్ మొదలయ్యాక ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తారా, లేదంటే… పెట్టుబడిలో భాగంగా చూస్తున్నారా?? అనేది మాత్రం ఇంకా తేలాల్సివుంది. చరణ్ అనుకోవాలే గానీ… ‘సైరా’ బిజినెస్ క్షణాల్లో పూర్తవుతుంది. ఆ డబ్బుతో సినిమాని ఆడుతూ పాడుతూ లాగించేయొచ్చు. కానీ చరణ్ ఉద్దేశం వేరు. సినిమా పూర్తయ్యాక… పాటలూ, ట్రైలరూ బయటకు వస్తే.. ఈసినిమా రేంజు అర్థమైతే.. రేట్లు పెరుగుతాయి. అప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తానికే ఈసినిమాని అమ్ముకోవచ్చు. అందుకే బిజినెస్ విషయంలో చరణ్ తొందరపడడం లేదు. కానీ డబ్బులు మాత్రం మరో నిర్మాతతో ఎందుకు పెట్టించాడన్నదే లెక్క తేలడం లేదు. చరణ్ మనసులో ఏముందో మరి..!