నిర్మాతల సమ్మె మూడో రోజుకి చేరుకుంది. ఈ సమ్మెకాలంలో రోజుకో సమస్య గురించి నిర్మాతలు వివిధ క్రాఫ్టుల ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ఈరోజు అత్యంత కీలకమైన `మా` తో భేటీ జరగబోతోంది. అన్నపూర్ణ స్టూడియోలో ప్రొడ్యూసర్స్ గిల్డ్, `మా` సభ్యులు సమావేశం అవుతున్నారు. ఈ మీటింగ్లో పారితోషికాలపైనే చర్చ జరగబోతోంది. హీరోల పారితోషికాలు మరీ ఎక్కువైపోయాయి, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవాల్సిందే అనేది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. వీటి సాధ్యాసాధ్యాలపై ఈరోజు చర్చ జరగబోతోంది. అయితే…`మా` మీటింగులో పెద్ద హీరోలెవరూ హాజరయ్యే సూచనలు కనిపించడం లేదు. కేవలం `మా`లోని కీలక సభ్యులు హాజరవుతారంతే. వీళ్లంతా కూర్చుని హీరోల పారితోషికం డిసైడ్ చేయగలరా? `మా` చెబితే హీరోలు వింటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అలాకాకుండా హీరోలందరితోనూ ఓ మీటింగ్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. బహుశా.. రానున్న రోజుల్లో అది కూడా జరగొచ్చు.
క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికాలపై కూడా నిర్మాతలు అసంతృప్తితో ఉన్నారు.రోజువారీ పారితోషికం తీసుకుంటూ, తమ అసిస్టెంట్ల జీత భత్యాలూ నిర్మాతలపై మోపడం సరికాదన్నది గిల్డ్ వాదన. ఎవరి కారు వాళ్లే తెచ్చుకోవాలి, ఎవరి క్యార్ వాన్ ఖర్చు వాళ్లే భరించాలి, ఎవరి సిబ్బంది జీతాలు వాళ్లే చెల్లించుకోవాలి.. అనే నిబంధనలు గిల్డ్ `మా` ముందు పెట్టే అవకాశం ఉంది. దీనిపై చర్చ జరిగి, సానుకూల ఫలితాలు వస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్టుల బాదుడు నుంచి నిర్మాతలకు కాస్త ఊరట లభించొచ్చు.