దర్శకరత్నగా తెలుగు చలనచిత్ర ప్రముఖుల ప్రశంసలు, ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న వ్యక్తి దాసరి నారాయణరావు. ఆయన దర్శకుడిగా పరిచయమైన చిత్రం ‘తాత మనవడు’. ఆ చిత్రాన్ని నిర్మించింది ఎవరో తెలుసా? కె. రాఘవ. ఈతారం ప్రేక్షకులకు ఆయన పెద్దగా తెలియకపోవచ్చు. ఓ యాభై ఏళ్లు వెనక్కి వెళితే… అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన, గొప్ప ప్రతిభావంతులను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాత మన కళ్లకు కనిపిస్తారు. ఆయనే ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ అధినేత కె. రాఘవ. ఆయన ఇకలేరు. ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 105 సంవత్సరాలు.
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ పతాకంపై దాసరిని దర్శకుడిగా పరిచయం చేసిన ‘తాత మనవడు’ చిత్రంతో పాటు ఆయన శిష్యుడు కోడి రామకృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిరంజీవి హీరోగా ‘ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య’ చిత్రం నిర్మించారు. దర్శకులుగా ఇద్దరూ వంద చిత్రాలకు పైగా పూర్తి చేసుకున్నారు. ఇంకా ‘సుఖదుఃఖాలు’, ‘జగత్ కిలాడీలు’, ‘చదువు సంస్కారం’, ‘అంతులేని వింతకథ’, ‘అంకితం’, ‘ఈ ప్రశ్నకు బదులేదీ’ తదితర చిత్రాలను రాఘవ నిర్మించారు.
1972లో ‘తాతమనవడు’ చిత్రానికి, 1973లో ‘సంసారం సాగరం’ చిత్రానికి నిర్మాతగా నంది పురస్కారాలు అందుకున్నారు. అలాగే, 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర పురస్కారం ఆయన్ను వరించింది. గురుశిష్యులు దాసరి, కోడి రామకృష్ణలతో పాటు రావుగోపాల్రావు, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుమన్, భానుచందర్ తదితరులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.