బుల్లి తెర నటి శ్రావణి ఆత్మ హత్య కేసు రోజుకో మలపు తిరుగుతోంది. ఈ కేసులో ముందుగా దేవరాజు రెడ్డి పేరు వినిపించింది. దేవరాజు వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, శ్రావణి కుటుంబ సభ్యులు ఆరోపించారు. హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో దేవరాజు పై కేసు నమోదయ్యింది. ఆ తరవాత.. దేవరాజు ఓ సెల్పీ వీడియో లో సాయి అనే మరో వ్యక్తి పేరు బయటపెట్టాడు. సాయి శ్రావణిని వేధించాడని, అందుకే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, తనకెలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు.
ఈరోజు కాసేపటి క్రితం దేవరాజు ఎస్.ఆర్.నగర్ పోలీసులకు లొంగిపోయాడు కూడా. ప్రస్తుతం దేవరాజుని పోలీసులు విచారిస్తున్నారు. ఈలోగా.. ఆర్.ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పేరు ఈ వ్యవహారంలో బయటకు వచ్చింది. కొన్ని ఆడియో టేపులు కూడా లీకయ్యాయి. శ్రావణి – అశోక్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ అది. `రాజీకి రాకపోతే… దేవరాజు మన వ్యవహారం బయటపెడతానన్నాడు` అంటూ.. ఆ ఆడియో టేపులో వినిపించింది. దాంతో శ్రావణికీ – అశోక్ రెడ్డి కీ మధ్య ఏదో ఉందన్న విషయం అర్థం అవుతోంది.
శ్రావణి – దేవరాజు ప్రేమించుకున్నారని, అయితే.. శ్రావణి అశోక్ రెడ్డితో సన్నిహితంగా ఉండడం వల్లే శ్రావణికీ, దేవరాజుకీ మధ్య గొడవలు మొదలయ్యాయని మరో వాదన వినిపిస్తోంది. దేవరాజు, సాయితో పాటు… ఇప్పుడు అశోక్ రెడ్డిని సైతం పోలీసులు విచారించే అవకాశం ఉంది.