నిర్మాత నాగ వంశీ ఓ కొత్త విషయం చెప్పారు. ప్రీమియర్ల నుంచి వచ్చిన టాక్ వల్ల సినిమా ఫలితంలో తేడా రాదని. బాగుందని వచ్చినా, బాలేదని వచ్చినా, మిక్డ్స్ రిపోర్ట్ వచ్చినా, అవి సినిమా ఫలితాన్ని మార్చలేవని.
‘గుంటూరు కారం’ విషయంలో నాగ వంశీ తెగ బాధ పడిపోయారు. అర్థరాత్రి షోల (ప్రీమియర్లు ఒంటి గంటకు వేశారు)తో డివైడ్ టాక్ వచ్చిందని, నిద్ర మత్తులో సినిమా చూశారని, అంచనాలకు తగ్గట్టుగా లేదన్న కామెంట్లు, రివ్యూలూ వచ్చాయని, నిజానికి సినిమా బాగుందని, కానీ ప్రీమియర్ల వల్ల ఫలితం తేడా వచ్చిందని, ఇక మీదట ప్రీమియర్ షోలు వేయకూడదని.. ఇలా చాలా చాలా చెప్పారు.
‘దేవర’ విషయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. దేవరకు కూడా అర్థరాత్రి ఒంటిగంటకే ప్రీమియర్లు వేశారు. అయితే మంచి టాక్ వచ్చింది. అది సినిమా ఓపెనింగ్స్ కి బాగా హెల్ప్ అయ్యింది. ఇంతకీ ఈ ప్రీమియర్ షోల వల్ల ఏం నేర్చుకొన్నారు? ప్రీమియర్లు వేయాలా, వద్దా? అని వంశీని అడిగితే.. ”ప్రీమియర్ షోల వల్ల టాక్ ఏం మారిపోదు. సినిమా బాగుంటే ఆడుతుంది లేదంటే లేదు” అంటూ నిజం ఒప్పుకొన్నారు. అంటే.. ‘గుంటూరు కారం’ బాగాలేదని పరోక్షంగా అంగీకరించినట్టే. దానికి తోడు ఆయన కొత్త సినిమా ‘లక్కీ భాస్కర్’ని ఒక రోజు ముందే (అక్టోబరు 30న) రాత్రి 7 గంటల షోల నుంచే విడుదల చేసేస్తున్నారు. ఇది ప్రీమియర్ షో కాదు. ఏపీ, తెలంగాణలలో అన్ని చోట్లా ఒక రోజు ముందే షోలు పడిపోతాయి. ఇది ఓరకంగా కొత్త స్ట్రాటజీ అనుకోవొచ్చు.
‘దేవర’ ప్రీమియర్ల వల్ల నిర్మాతకు లాభమే చేకూరింది. ప్రీమియర్ షోలకు టికెట్ రూ.1000 అమ్మారు. ఆ డబ్బంతా నిర్మాత, బయ్యర్ ఖాతాలోకి వెళ్తుంది. దాంతో మంచి లాభాలు కనిపించాయి. అయితే ఈ టెక్నిక్ పెద్ద సినిమాలకే వర్తిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలకు వర్తించే సూత్రమిది. దాన్ని ‘దేవర’ విషయంలో వర్కవుట్ చేశారు. మిగిలిన భారీ సినిమాలూ ఇదే ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో నిర్మాతలకు ‘దేవర’ ఓ మార్గం చూపించినట్టే.