సినిమా పరిశ్రమకు ప్రభుత్వం ఇచ్చే అవార్డులు దాదాపు కనుమరుగయ్యాయి. ఇప్పటి యువ నటీనటులు అసలు ‘నంది అవార్డు’ని చూసి కూడా వుండరు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అసలు అవార్డులు ఊసే లేకుండా పోయింది. ఇప్పటి ఏపీ ప్రభుత్వం అయితే చిత్ర పరిశ్రమతోఎలాంటి ఆటలు ఆడిందో అందరికీ తెలిసిందే. రెండు దఫాలు అధికారం చేపట్టిన కేసీఆర్ కూడా చిత్ర పరిశ్రమకు ఇచ్చే ప్రభుత్వ అవార్డుల విషయంలో చొరవ తీసుకోలేదు.
ఇక్కడ ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించారు. నిజానికి పరిశ్రమ స్వాగతించాల్సిన పరిణామం ఇది. కళాకారులని వార్డులతో సత్కరించాలనేది మంచి విషయం. కానీ దీనిపై అనుకున్నంత స్పందన పరిశ్రమ నుంచి రావడం లేదు. ఈ మాట పరిశ్రమలోని ప్రముఖులే చెబుతున్నారు.
”అసలు గద్దర్ అవార్డులపై పరిశ్రమకి ఇష్టం, ఆసక్తి రెండూ లేవు. వుంటే.. అందరూ స్వాగతించాలి. ఏ ఒక్క పెద్ద హీరో దీనిపై మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం”అని నిర్మాత నట్టి కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆయన మాటలో వాస్తవం కనిపిస్తూనే వుంది. నిజంగా పరిశ్రమ నుంచి గద్దర్ అవార్డుల ప్రకటనకు ఊహించిన స్పందన రాలేదనే చెప్పాలి. మోహన్ బాబు లాంటి సీనియర్ హీరో స్వాగతించినట్లు వున్నారు. ఆయన తర్వాత మరో పెద్ద హీరో దిని గురించి మాట్లాడలేదు.
ఒక వేళ చిరంజీవి లాంటి అగ్ర హీరోలు ఈ విషయంలో స్పందన తెలియజేస్తే మిగతా అందరూ కదులుతారేమో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించే కార్యక్రమం చేపడుతోంది. బహుసా ఈ సన్మాన కార్యక్రమంలో చిరు, గద్దర్ అవార్డులపై తన మనసులో మాట చెబుతారేమో చూడాలి.