ప్రముఖ నిర్మాత, ఆర్.ఆర్ మూవీ మేకర్స్ అధినేత ఆర్.ఆర్ వెంకట్ కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు.
కొన్నేళ్ల క్రితం ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ ఓ వెలుగు వెలిగింది. ఆంధ్రావాలా, కిక్, ప్రేమ కావాలి, డాన్ శీను, మిరపకాయ్ బిజినెస్ మేన్, డమరుకం, పైసా… ఇలా వరుస పెట్టి సినిమాలు తెరకెక్కించారు. ఈ సినమాలన్నింటికీ నిర్మాత ఆర్.ఆర్. వెంకట్నే. ఎస్.వి కృష్ణారెడ్డితో వెంకట్ ఓ హాలీవుడ్ సినిమా కూడా తీశారు. అయితే.. వరుస ఫ్లాపులతో వెంకట్ కొంతకాలంగా చిత్రసీమకు దూరంగా ఉన్నారు.
నిజానికి ఆర్.ఆర్ వెంకట్ పేరు సుపరిచితమే అయినా, ఆయన్ని చూసిన వాళ్లు చాలా తక్కువ మంది. ఆయన సినిమాలకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ ఆయన వచ్చేవారు కాదు. ఆయన బాధ్యతలన్నీ అచ్చిరెడ్డి చూసుకునేవారు. వెంకట్ కి ప్రచారం అంటే పడదని, అందుకే ఆయన మీడియాకు దూరంగా ఉంటారని అప్పట్లో అనుకునేవారు. అయితే.. వెంకట్ ఓ బినామీ అని, ఆయన వెనుక కొంతమంది బడా బాబులు ఉన్నారని, వాళ్లే ఈ సినిమాలకు పెట్టుబడి పెట్టేవారని కూడా అనేవారు. ఏదేమైనా కొంతకాలం నుంచి ఆయన నుంచి సినిమాలురావడం లేదు. ఆ వెంకట్ కూడా ఇక శాశ్వతంగా కనిపించరు.