సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా – ఆ సినిమాని చివరి వరకూ మోయడమే పనిగా పెట్టుకుంటుంది చిత్రబృందం. తప్పదు మరి. థియేటర్లలో ఉన్నంత సేపూ… ఆక్సిజన్ అందించేలా ప్రమోషన్లు గట్టిగా చేయాలి. సినిమా రిజల్ట్ తెలిసినా సరే.. ‘బాగానే ఉంది.. హిట్టవుతుంది’ అంటూ పైకి చెబుతూ ఉండాలి. కానీ ఈమధ్య హీరోలు బయటపడిపోతున్నారు. `అనుకున్న రిజల్ట్ రాలేదనో`, ‘కథ విషయంలో తప్పు చేశాన’నో ముందే ఒప్పేసుకుంటున్నారు. అంత్య నిష్టూరం కంటే, ఆది నిష్టూరం మేలు కదా. అందుకు.
కానీ ఇలాంటి కామెంట్లే దర్శక నిర్మాతలకు తలనొప్పులు తీసుకొస్తున్నాయి. థియేటర్లో సినిమా ఆడుతుండగా… ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మంచిది కాదని వాళ్ల ఫీలింగ్. అదీ నిజమే. తాజాగా శర్వానంద్ కూడా ఇలా నిజాల్ని ఒప్పేసుకుని, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. శర్వా కథానాయకుడిగా నటించిన ‘రణరంగం’ ఇటీవలే విడుదలైంది. రివ్యూలు బిలో ఏవరేజ్‌గా తేల్చేశాయి.వసూళ్లూ అలానే ఉన్నాయి. `ఈ సినిమాలో కథ లేదు. ఈ విషయం నాకు తెలుసు. స్క్రీన్ ప్లే నచ్చి ఒప్పుకున్నా. ఇప్పుడు అనుకున్న రిజల్ట్ రాలేదు’ అని శర్వా రెండో రోజే బయటపడిపోయాడు. శర్వా నిజాయతీగా తన మనసులో మాట చెప్పినా – అది దర్శక నిర్మాతలకు రుచించడం లేదు. థియేటర్లో సినిమా ఉండగా ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చాడంటూ తలలు బాదుకుంటున్నారు. శర్వా స్టేట్మెంట్లు వసూళ్లపై ప్రభావం తీసుకొస్తాయన్నది నిజం. ఇప్పుడు అదే జరిగింది. ఆదివారం `రణరంగం` వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అందుకే శర్వాపై సదరు దర్శక నిర్మాతలు అలిగారని, శర్వా కూడా ఇప్పుడు `రణరంగం` సినిమాని పూర్తిగా వదిలేసి, తన కొత్త సినిమా పనుల్లో పడిపోయాడని తెలుస్తోంది.