సినీ పరిశ్రమలో హీరోలు ఎంత ముసలివాళ్ళపోయినా, మునిమనుమలు పుట్టేస్తున్నా వారికి ఇంకా అవకాశాలు వస్తూనే ఉంటాయి కానీ హీరోయిన్లకి మాత్రం ఆ “షెల్ఫ్ లైఫ్” చాలా తక్కువుంటుంది. పైగా వారు సినిమాలలో ఉన్నంతకాలం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. తప్పనిసరిగా ఫిగర్ మెయిన్ టెయిన్ చేయాల్సి ఉంటుంది. అయినా ఓ పదేళ్ళు చేసిన తరువాత ఇంకా వారికి కూడా అవకాశాలు తగ్గిపోవడం మొదలవుతాయి లేదా ప్రియమణిలాగ అసలు అవకాశాలే రాకపోవచ్చును. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని మన కొత్త హీరోయిన్లు చాలా చక్కగా పాటిస్తూ చేతిలో అవకాశాలున్నప్పుడే వీలయినన్ని సినిమాలలో నటించేస్తూ వీలయినంత డబ్బు సంపాదించుకొంటూ జాగ్రత్తపడుతుంటారు. ప్రియమణి కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలో చాలానే సినిమాలు చేసారు. కానీ మన హీరోలు, దర్శకులు కొత్త హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు కనుక ఆమె కూడా మెల్లగా సినీ పరిశ్రమ నుండి కనుమరుగయిపోయింది. కన్నడంలో మూడు సినిమాలు చేశానని చెప్పుకొన్నారు. సినీ పరిశ్రమలో ఆదరణ తగ్గిపోయిన తరువాత వారిని టీవీ చానల్స్ లోకి వస్తుంటారు. ప్రియమణి కూడా అలాగే టీవీ చానల్స్ లో యాంకర్ గా ప్రోగ్రామ్స్ చేయడానికి వస్తున్నారు.
అదే విషయం గురించి ఆమెని అడిగినప్పుడు “అందుకు నేను సంతోషించాలో బాధపడాలో తెలియడం లేదు. ఇప్పుడు చాలా మంది కొత్త దర్శకులు వస్తున్నారు. కానీ వారివారి కళ్ళకి నేను కనిపించడం లేదు. నా నటన ప్రతిభ, దానికి నేను అందుకొన్న అవార్డులు వారికి కనబడం లేదు. ఎక్కడెక్కడి నుంచో కొత్త హీరోయిన్లని వెతికి తెచ్చుకొంటున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ నన్ను పూర్తిగా మరిచిపోయినట్లే ఉంది. కన్నడంలో నేను చేసిన మూడు సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. మరొక సినిమా చేతిలో ఉంది. ఇప్పుడు టీవీ షోలు కూడా చేయబోతున్నాను,” అని చెప్పారు.
ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించినప్పుడు “నా పెళ్లి గురించి ఇదివరకే కొన్ని వివరాలు చెప్పేను. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ముంబైకి చెందిన ఒక వ్యక్తిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అతను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు. మా పెళ్లికి మరికొంత సమయం పట్టవచ్చును. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేను,” అని ప్రియమణి ఇంటర్వూ ముగించారు.