థియేటర్లు లేకపోవడంతో నిర్మాతల కష్టాలు రెట్టింపయిన మాట వాస్తవం. థియేటర్లు తెరిచే వరకూ ఎదురు చూడాలా? లేదంటే – ఓటీటీలకు ఇచ్చేయాలా? అనే విషయంలో తర్జన భర్జనలుపడుతూ, దినమొక యుగంలా గడుపుతున్నారు. అయితే ఓటీటీ వల్ల ఏ నిర్మాతలకూ అన్యాయం అయితే జరగలేదు. ఓ రకంగా చూస్తే – లాభమే దక్కింది. ఇంకా మాట్లాడాలంటే – ఆయా సినిమాల్ని కొని ఓటీటీలే నష్టపోయాయి.
చిన్న సినిమాల్ని, పేరు లేని సినిమాల్ని ఎవ్వరూకొనరు. వాటికి మార్కెట్ లేకపోవడం వల్ల వాటి జోలికి ఎవరూ వెళ్లరు. పోస్టర్ పై పేరున్న నటీనటులు కనిపిస్తే – ఓటీటీలు బేరాలు మొదలెట్టేస్తున్నాయి. ఇక కాస్తో కూస్తో పేరున్న వాళ్లుంటే చెప్పక్కర్లెద్దు. ఇప్పటి వరకూ ఓటీటీలో విడుదలైన పెద్ద సినిమాల లిస్టు చూస్తే `వి`,`నిశ్శబ్దం`,నారప్ప` లాంటి సినిమాలు కనిపిస్తాయి. వీటి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాబట్టే.. ఓటీటీలు మంచి రేటు పెట్టి కొన్నాయి. అయితే.. వీటి రిజల్ట్ చూస్తే ఓటీటీకి అమ్ముకోవడమే మంచిదనిపించింది. ఓటీటీ వల్ల ఆయా సినిమాలు ఒడ్డున పడ్డాయి. లాభాలు మూటగట్టుకున్నాయి. వాటినే థియేటర్ లో విడుదల చేస్తే నిర్మాతలు, బయ్యర్లు భారీ ఎత్తున నష్టాలు మోయాల్సివచ్చేదన్నది నిజం. `డియర్ బ్రదర్`,`ఏక్ మినీకథ`, `అర్థ శతాబ్దం`, `పచ్చీస్` లాంటి సినిమాల్ని ఓటీటీలు మంచి రేటు పెట్టి కొన్నాయి. ఆయా సినిమాలతో నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ దక్కించుకున్నారు. ఇవే సినిమాలు థియేటర్లో విడుదల కావాలంటే కచ్చితంగా రెండు మూడు నెలలు ఎదురు చూడాలి. థియేటర్లోకి వచ్చినా జనం చూస్తారా? అనేది అతి పెద్ద డౌటు. ఆ రకంగా… ఈ సినిమాల నిర్మాతలపై ఓటీటీలు పాలు పోసినట్టే.