ఏపీలో థియేటర్లు తీసుకోవడానికి అనుమతులు ఇచ్చినా – టాలీవుడ్ కి జోష్ రాలేదు. దానికి కారణం.. టికెట్ రేట్ల గొడవే. `వకీల్ సాబ్`ని తొక్కిపెట్టాలనో, ప్రేక్షకులకు సినిమాని అందుబాటులో తేవాలనో తెలీదు గానీ టికెట్ రేట్ల విషయంలో జగన్ ప్రభుత్వం అర్థాంతరంగా ఓ జీవోని తీసుకొచ్చింది. టికెట్ రేట్లని ఎడా పెడా పెంచుకునే వీలు లేకుండా, నిర్దిష్టమైన రేట్లని నిర్ణయించింది. ఏ,బీ సెంటర్ల వరకూ ఫర్వాలేదు గానీ, సీ సెంటర్లో ఇచ్చిన టికెట్ రేట్లు చూసి నిర్మాతలు గగ్గోలు పెట్టారు. పెద్ద సినిమాలకు, ముఖ్యంగా తొలి మూడు రోజుల్లోనే పెట్టుబడి అంతా రాబట్టని చూసే వాళ్లకు.. ఈ రేట్లు ఏమాత్రం రుచించలేదు. అందుకే ఏపీలో థియేటర్లు తెరచుకునేందుకు అనుమతులు ఇచ్చినా – ఒక్కరిలోనూ స్పందన లేదు.
ఈ విషయమై… నిర్మాతలంతా ఏపీ ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. దాంతో ఏపీ ప్రభుత్వం మరోమారు ఆలోచించి – కొత్త సినిమాలు విడుదలయ్యేటప్పుడు రేట్లు పెంచుకునే విషయంలో కాస్త వెసులుబాటు ఇచ్చింది. కాకపోతే అది కూడా కాస్త గందరగోళంగానే ఉంది. అందుకే ఈ విషయమై.. ఇప్పుడు నిర్మాతలంతా అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ లో కీలకమైన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతలంతా హాజరయ్యారు. టికెట్ రేట్ల విషయంలో వాడీ వేడీ చర్చలు జరుగుతున్నాయి. సినిమా విడుదల విషయంలో, టికెట్ రేట్ల విషయంలో ఈ సాయింత్రానికల్లా.. నిర్మాతలు ఓ ప్రకటన చేయబోతున్నారు. మరి వాళ్లంతా ఏ నిర్ణయానికి వచ్చారో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాలి.