నిర్మాతల బంద్… ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. నిర్మాతలే షూటింగులు వద్దు…అని స్డూడియోలకు తాళాలు వేస్తే.. ఇక చెప్పుకొనేదేముంది? ఇన్నాళ్లూ షూటింగులు బంద్ చేస్తామని.. నిర్మాతల్ని 24 విభాగాల వాళ్లూ బెదిరించారు. ఇప్పుడు నిర్మాతలే… సమ్మెకు దిగారు. అంతే తేడా. ఓరకంగా నిర్మాతలది ధర్మాగ్రహమే.
తెలుగు సినిమాల ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ బాగా పెరిగిపోతోంది. బడ్జెట్లు అవధులు దాటుతున్నాయి. హీరోలు, దర్శకులు పారితోషికాల పేరుతో బాదేస్తున్నారు. దర్శకుడు పర్ఫెక్షన్ పేరుతో తీసిందే తీసి.. మరింత భారం పెంచుతున్నాడు. ఇంతా చేసి సినిమా హిట్టయితే.. నిర్మాతకు మిగిలేది చిల్లరే. ఒక్కోసారి అది కూడా ఉండడం లేదు. అదే ఫ్లాపయితే మాత్రం ఆస్తుల్ని అమ్ముకోవాల్సివస్తోంది. నిర్మాత రూ.20 కోట్లు, రూ.30 కోట్లు పెట్టి సినిమా తీస్తే… బాగుపడేది హీరోలు, టెక్నీషియన్లు. వీళ్ల కోసం నిర్మాతలెందుకు సినిమాలు తీయాలి? నటీనటులు, సాంకేతిక నిపుణులు… కష్టకాలంలో నిర్మాతలకు అండగా నిలబడకపోతే… వాళ్ల కోసం ఆస్తులు అమ్ముకొని త్యాగాలు చేయాల్సిన అవసరం నిర్మాతలకెందుకు? ఇదీ.. ప్రస్తుతం నిర్మాతల మాట.
ప్రొడక్షన్ విషయంలో పూర్తిగా ప్రక్షాళన చేస్తే తప్ప నిర్మాత బాగుపడడన్న సంగతి.. అందరికీ అర్థమవుతోంది. అందుకే `బాలీవుడ్ స్టైల్`ని టాలీవుడ్ కీ తీసుకొద్దామనుకుంటున్నారు. బాలీవుడ్ లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఒక కాల్షీట్ గా లెక్కగడతారు. మన దగ్గర అలా కాదు ఉదయం 6 గంటల నుంచి సాయింత్రం 6 గంటల వరకూ ఓ కాల్షీట్. టైమ్ దాటితే ఎగస్ట్రా కాల్షీట్ భారం నిర్మాత మోయాలి. ఉదయం ఆరు గంటలకు షూటింగ్ అంటే హీరో తాయితీగా ఏ 9 గంటలకో వస్తాడు. అనుకున్న టైమ్ లో షూటింగ్ పూర్తి కాదు. దాంతో.. ఎగస్ట్రా కాల్షీట్లు తీసుకోవాల్సి వస్తోంది. ఇలా బడ్జెట్ పెరుగుతూ వెళ్తుంది. అలా కాకుండా బాలీవుడ్ స్టైల్లో 9 నుంచి 9 వరకూ ఓ కాల్షీట్ పెట్టుకొని, ఎగస్ట్రా కాల్షీట్ల భారం పెరక్కుండా జాగ్రత్త పడాలని నిర్మాతలు భావిస్తున్నారు.
బాలీవుడ్ లో లంచ్ టైమ్ అంటే లంచ్ టైమే. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకూ లంచ్. అక్కడ బఫే సిస్టమ్ ఉంటుంది. హీరో అయినా, హీరోయిన్ అయినా లైట్ బాయ్ అయినా అందరికీ ఒకే భోజనం. అది ఇష్టం లేకపోతే… ఇంటి దగ్గర్నుంచో, హోటెల్ నుంచో సొంత డబ్బులతో తెచ్చుకోవాలి. దానికీ నిర్మాతకూ ఎలాంటి సంబంధం ఉండదు. ఇక్కడ అలా కాదు. హీరో, హీరోయిన్, దర్శకుడు… వీళ్లకు ఓ స్పెషల్ మెనూ ఉంటుంది. లేదంటే.. స్టార్ హోటళ్ల నుంచి భోజనాలు తెప్పించుకొంటారు. బిల్లు నిర్మాతపై పడేస్తారు. అలా.. కేవలం ఓ సినిమాకి తిండి ఖర్చే లక్షలకు లక్షలు అవుతోంది. ఈ పద్ధతి కూడా మార్చాలన్నది నిర్మాతల డిమాండ్.
అన్నింటికంటే ముఖ్యంగా హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాలి. కనీసం 25 శాతం తగ్గింపు ఇస్తే తప్ప… వర్కవుట్ కాదని గట్టిగా చెబుతున్నార్ట. ఓ దర్శకుడు సినిమా ఒప్పుకొన్న తరవాత వంద రోజుల్లో పూర్తి చేస్తానని ఎగ్రిమెంట్ రాసిస్తే.. ఆ వందలోనే సినిమా పూర్తి చేయాలి. బడ్జెట్ కూడా దాటకూడదు. ఇలాంటి సహేతుకమైన డిమాండ్లని హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్ల ముందు పెట్టాలని నిర్మాతలంతా నిర్ణయించుకొన్నారు. వీటికి అందరూ ఒప్పుకొంటారా లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.