కరోనా పుణ్యమా అని… నిర్మాతల ప్లానింగ్ అంతా అస్తవ్యస్తమైపోయింది. బతుకులు బాగుంటే చాలు,.. అనుకుంటున్నారు జనాలు. ఇక.. సినిమాలు, షికార్లకు టైమ్ ఎక్కడిది? నిర్మాతల పరిస్థితి కూడా అలానే ఉంది. `రేపు ఏం జరుగుతుందో` అనే భయాలే తప్ప.. సినిమాల్ని ముగించాలి, ఏదో ఓ రేటుకి అమ్ముకోవాలి… అనే తొందర ఉండడం లేదు. ఏవో కొన్ని సినిమాలు షూటింగులు జరుపుకుంటున్నాయి. అది కూడా ఓటీటీని టార్గెట్ చేసుకున్న సినిమాలు. అంతే. మిగిలినవన్నీ `హోల్డ్` మోడ్ లోకి వెళ్లిపోయాయి.
షూటింగులకు వెసులు బాటు కల్పించినా.. ఇప్పటికిప్పుడు మళ్లీ ఆ హడావుడి మొదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ వేసవి షెడ్యూల్ అంతా.. కలగాపులగం అయిపోయింది. మార్చి, ఏప్రిల్, మేలలో రావల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. ఒకవేళ.. కరోనా భయాలు తగ్గి, జనాలు సాధారణ జీవనానికి అలవాటు పడినా – షూటింగులు మొదలెట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే… ఏప్రిల్, మేలలో సినిమాలు వచ్చే పరిస్థితి లేదు. జూన్ నుంచి అంతా ఓకే అనుకున్నా… ఏప్రిల్, మేలో రావాల్సిన లవ్ స్టోరీ, సిటీమార్, ఆచార్య, నారప్ప, అఖండ లాంటి సినిమాలకు ముందుగా దారి ఇచ్చేయాలి. అంటే.. ఏప్రిల్, మేలో రావల్సిన సినిమాలకు జూన్లో థియేటర్లు ఇవ్వగలగాలి. అలానే జూన్ లో ఫిక్సయిన సినిమాలు జులై, ఆగస్టులకు వెళ్తాయి. అలా… అనుకున్న సమయానికి, వాస్తవ పరిస్థితులకూ మధ్య ఒకట్రెండు నెలల గ్యాప్ ఉందన్నమాట. ఎప్పుడో సెప్టెంబరు, అక్టోబరున రావల్సిన సినిమాలు ఇప్పటికిప్పుడు షూటింగులు ముగించుకున్నా లాభం ఉండదు. పైగా… సినిమా పూర్తయి, విడుదల లేటయితే.. దానికిపై అవుట్ డేటెడ్ అనే ముద్ర పడిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా వడ్డీల భారం ఎక్కువ అవుతుంది. ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది. అందుకే నిర్మాతలెవరూ.. ఇప్పుడు షూటింగుల గురించి ఆలోచించడం లేదు.
ఫిల్మ్ ఛాంబర్, రచయితల సంఘంలో ఎప్పుడూ టైటిళ్లు, కథల రిజిస్ట్రేషన్ల హడావుడి కనిపిస్తుంటుంది. స్లంప్లో కూడా… ఆ జోరు ఎప్పుడూ ఆగలేదు. అలాంటిది ఇప్పుడు ఆ ధ్యాసే లేదు ఎవరికీ. దాన్ని బట్టి… నిర్మాతలు ఎంత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారో అర్థమవుతోంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే… చిత్రసీమ, దాన్ని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులు మళ్లీ రోడ్డున పడాల్సిన పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.