బాలకృష్ణ – బోయపాటి శ్రీనులది తిరుగులేని కాంబినేషన్. సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి మరోటి విజయాల్ని నమోదు చేసుకొన్నాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రాబోతోంది. జూన్లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 2024 ఎన్నికల ముందు ఈ సినిమాని విడుదల చేయాలన్నది ప్లాన్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే… నిర్మాతల నుంచి కూడా తాకిడి ఎక్కువవుతోంది. ఈ సినిమా ఏ బ్యానర్లో చేయాలన్నది ప్రధానమైన ప్రశ్న.
ఏకే ఎంటర్టైన్మెంట్స్లో.. బోయపాటి ఓ సినిమా చేయాలి. ఈ సినిమాని ఆ బ్యానర్లోనే చేయాలన్నది బోయపాటి ఆలోచన. అయితే దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా బాలయ్యకు అడ్వాన్స్ ఇచ్చాడని టాక్. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్స్లో ఓ సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పాడు. ఇప్పుడు ఈ ముగ్గురు నిర్మాతలూ.. బాలయ్య – బోయపాటి కాంబో మాకే కావాలని గట్టిగా పట్టుపడుతున్నారు. ఈ మూడు సంస్థలూ కలిపి ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు నిర్మాతలు ఉంటే కష్టం అనుకొంటే… రెండు బ్యానర్లు కలిసి కట్టుగా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. జూన్ మొదటి వారంలో ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.