గొడవ ముగిసింది! ఏప్రిల్ వీకెండ్ రిలీజ్ డేట్ కోసం పట్టుబట్టిన మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమా పెద్దల సమక్షంలో సర్దుబాట్లు చేసుకున్నారు. ఇందులో ఏది ఏమైనా ఏప్రిల్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న మహేశ్ పట్టుదల నెగ్గింది. కాకపోతే ముందుగా అనుకున్న డేట్ కంటే వారం రోజులు ముందుకు ఆయన వచ్చారు. అల్లు అర్జున్ ఒక వారం వెనక్కి వెళ్లారు. మొత్తానికి ఏప్రిల్ 26న రెండు సినిమాలూ రావడం లేదు. తెరపైన దిల్ రాజు, కె.ఎల్. నారాయణ కనిపిస్తున్నా… తెర వెనుక అల్లు అరవింద్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ ‘జెమిని’ కిరణ్, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు తదితరుల సమక్షంలో జరిగిన రాజీ చర్చలు ఫలించాయి.
చర్చల అనంతరం మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాను ఏప్రిల్ 20న, అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాను మే 4న విడుదల చేయాలని నిర్ణయించారు. నిజానికి ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది అల్లు అర్జున్ సినిమావాళ్ళే. కానీ, వెనక్కి తగ్గక తప్పలేదు. హీరోల ఈగోలు, నిర్మాతల మధ్య సమన్వయ లోపంతో ఇంతదూరం వచ్చిన ఈ గొడవ అభిమానుల మధ్య చిచ్చు, పంపిణీదారులు గుండెల్లో ఆందోళన రేపిన మాట వాస్తవం! ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పడినట్లే!