రన్ టైమ్ అనేది ఏ సినిమాకైనా చాలా కీలకంగా మారిపోయింది. నిడివి పెరిగిపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే, బోర్ కొట్టేస్తుంటుంది. ఆ రోజుల్లో మూడు గంటల సినిమాలు ఉండేవి. అయినా అందరూ హ్యాపీగా చూసేస్తున్నారు. ఇప్పుడు రెండున్నర గంటలంటేనే `పెద్ద సినిమా` అనేస్తున్నారు. దర్శకులు, నిర్మాతలు కూడా 2 గంటల 20 నిమిషాల సినిమాలపై మొగ్గు చూపిస్తున్నారు. అంతకంటే రన్ టైమ్ ఎక్కువైతే నిర్మాతలే కంగారు పడి కత్తెర వేస్తున్నారు.
శుక్రవారం `అంటే.. సుందరానికీ..` విడుదల అవుతోంది. ఈసినిమాపై మంచి బజ్ ఉంది. టీజర్లు, ట్రైలర్లు బాగున్నాయి. కాకపోతే సినిమా నిడివే దాదాపు 3 గంటలు. ఇంత పెద్ద సినిమాని, ఈ రోజుల్లో భరాయించడం చాలా కష్టం. కానీ నిర్మాతలు మాత్రం `కత్తెర వేయకూడదంతే..` అని పట్టుపడుతున్నార్ట. ఎక్కడైనా దర్శకులకు, రచయితలకు, హీరోలకు సినిమాపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రతీ సీన్నీ వాళ్లు ఇష్టపడతారు. కత్తెర వేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నా, దర్శకులు, హీరోలు అడ్డు పడుతుంటారు. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఈ సినిమాలోని కొన్ని సీన్లుట్రిమ్ చేసి, కనీసం 10 నిమిషాల నిడివైనా తగ్గిద్దాం అని దర్శకుడు ఫీలైనా… మైత్రీ మూవీస్ నిర్మాతలు మాత్రం `అలాంటివేం చేయొద్దు.. ఇలాంటి సినిమా రన్ టైమ్ ఎంత ఉన్నా.. ఎవరూ ఇబ్బంది పడరు` అని దర్శకుడ్ని ఆపుతున్నారట. లేదంటే ఈ పాటకి సుందరానికి కత్తెర్లు పడిపోయేవి. అయితే ఈ రన్ టైమ్ సుందరానికి ఇబ్బంది అయ్యిందా, లేదంటే.. దాన్ని ప్రేక్షకులు పట్టించుకోరా అనేది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగితే చాలు.