థియేటర్లు తెరచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేసినా, ఎక్కడో ఓ చోట కంగారు, భయం. ఎప్పటిలా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? సినిమాలు చూస్తారా? టికెట్లు తెగుతాయా? అనే అనుమానాలు. సినిమా అన్నది ఇంటికే వస్తున్న రోజులవి. సెల్ ఫోన్ లో.. కానీ ఖర్చు లేకుండా సినిమాలు చూసేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ ప్రేక్షకులకు థియేటర్ వాతావరణాన్ని అలవాటు చేయడం అంత సులభం కాదు.
అందుకే.. నిర్మాతలు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల చిత్రసీమలోని కొంతమంది ప్రముఖ నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. థియేటర్ వాతావరణాన్ని ప్రేక్షకులకు మళ్లీ పరిచయం చేయడానికి… కొత్త వ్యూహాలు రచించారు.
`టాలీవుడ్ బొనాంజా` అనే పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి చిత్రసీమ శ్రీకారం చుట్టబోతోంది. ఆ ప్రకారం.. బీ, సీ సెంట్లలో.. కొన్ని థియేటర్లు ఎంపిక చేసి… వరుసగా పాత సినిమాల్ని ప్రదర్శిస్తారు. మగధీర, టెంపర్, బాహుబలి.. ఇలా ఒక్కో హీరోకి సంబంధించిన ఒక్కో సూపర్ హిట్ సినిమాలి విడుదల చేస్తారు. మార్నింగ్ షో, మాట్నీ, ఫస్ట్ షో.. ఇలా వరుసగా ఒక థియేటర్లోనే మూడు సినిమాలు ప్రదర్శిస్తారు. ఈ సినిమాల్ని ఫ్రీగా చూపించాలా? లేదంటే ఒకే టికెట్టుపై మూడు సినిమాలు చూపించాలా? అనేది ఇంకా ఖరారు కాలేదు. కొత్త సినిమా విడుదల చేస్తున్నప్పుడు ఎలాంటి హంగామా చేస్తారో.. అలాంటి హంగామానే థియేటర్ల దగ్గర చేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు… ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నారు. `పాత సినిమాలన్నీ మీ ముందుకు వస్తున్నాయి.. చూడండి` అంటూ టాప్ స్టార్స్ తో చెప్పించి.. ఓ ప్రత్యేకమైన వీడియోని రూపొందించే పనిలో ఉన్నారు. ఇదంతా వీలైనంత త్వరగా చేయాలన్నది ప్లాన్.
ఒకసారి ప్రేక్షకులు థియేటర్లకు అలవాటు పడితే, కరోనా లాంటివి అస్సలు పట్టించుకోరని… ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశాకే.. కొత్త సినిమాలు విడుదల చేయాలన్నది నిర్మాతల ఉద్దేశం. ఈలోపు 100 % ఆక్యుపెన్సీ కి కూడా అనుమతులు వస్తాయని భరోసాగా ఉన్నారు. ఈ క్రిస్మస్ కి బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాలు రానున్నాయి. ఈలోగా… ఈ టాలీవుడ్ బొనాంజాని చూడొచ్చు.