ఇది వరకు ఓటీటీ సంస్థకు సినిమాని అమ్ముకుంటే… `30రోజుల్లో మీ సినిమాని ప్రదర్శించుకోవడానికి అనుమతులు ఇవ్వండి` అంటూ వేడుకునేవి ఓటీటీ సంస్థలు. కొంతమంది నిర్మాతలు 30 రోజులకు పర్మిషన్లు ఇస్తే, ఇంకొంతమంది 50 రోజులకు ఇచ్చేవారు. అసలు ఓ సినిమా విడుదలైన 60 లేదా.. 90 రోజుల వరకూ సినిమాని ఓటీటీలో ప్రదర్శించకుండా చూడాలని నిర్మాతలు ఓ దశలో గట్టిగా అనుకున్నారు కూడా.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. నిర్మాతలే ఓటీటీ సంస్థలకు విన్నపాలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. థియేటర్లు లేకపోవడం వల్ల చాలా సినిమాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. మంచి రేటు వస్తే.. సినిమాని అమ్ముకుంటున్నాయి. కొన్ని సినిమాలైతే వచ్చిన కాడికి సినిమా అమ్ముకుని తృప్తి పడుతున్నాయి. అయితే.. ఓటీటీలకు సినిమాని అమ్మేటప్పుడు ఓ విన్నపం మాత్రం తప్పని సరి. `థియేటర్లు గనుక ఓపెన్ అయితే.. ఎప్పుడంటే అప్పుడు ఈ సినిమాని థియేటర్లో కూడా విడుదల చేసుకునే అనుమతి కావాలి` అని అడుగుతున్నాయి. కొన్ని ఓటీటీ సంస్థలు అందుకు ఒప్పుకుంటున్నాయి కూడా. ఉదాహరణకు నిశ్శబ్దం, వి.. లాంటి సినిమాలు ఇప్పుడు ఓటీటీ బాట పట్టాయనుకుందాం. ఓటీటీలో వీటిని ఎప్పుడు ప్రదర్శించినా సరే, థియేటర్లలో విడుదల చేసుకోవడానికీ అనుమతి ఉంటుంది. ఆ రకంగా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఓటీటీలో సినిమాని చూస్తే.. థియేటర్ల వరకూ వెళ్లడానికి ప్రేక్షకుడు ఇష్టపడడు. కాకపోతే.. నూటికి 60 శాతం ప్రేక్షకులకు ఓటీటీ వ్యవహారాలు అర్థం కావు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలోని ప్రేక్షకులకు ఇప్పటికీ సినిమా అంటే థియేటర్ కి వెళ్లాల్సిందే. థియేటర్లలో విడుదల చేసుకుంటే కనీస వసూళ్లు వచ్చినా.. అవి అదనపు ఆదాయమే అవుతుంది. అందుకే సినిమాల్ని ఓటీటీలకు అమ్ముకున్నా – థియేటర్లో విడుదల చేసే అవకాశం వస్తే వదులుకోకూడదని నిర్మాతలు భావిస్తున్నారు.