మిస్టర్ రూపంలో శ్రీనువైట్ల ఖాతాలోకి మరో డిజాస్టర్ చేరిపోయింది. ఈ సినిమాపై ఎవ్వరికీ ముందు నుంచి నమ్మకాల్లేవు. అయితే మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేకపోయారు. అన్నిటికి మించి నిర్మాతలు ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జిలకు ఇది వరుసగా రెండో `మెగా` దెబ్బ. ఇంతకు ముందు వచ్చిన `విన్నర్`కీ వీళ్లే నిర్మాతలు. మిస్టర్ కోసం శ్రీనువైట్ల ఏకంగా రూ.33 కోట్లు ఖర్చు పెట్టించాడట. ఈ అంకె మరీ టూమచ్. పారితోషికాల పరంగా ఎవ్వరికీ పెద్దగా ఇవ్వకపోయినా, టేకింగ్ విషయంలో రాజీ పడక పోవడం వల్ల ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టాల్సివచ్చిందట.
సినిమా విడుదలకు వారం రోజుల ముందు ఓ పాట తెరకెక్కించార్ట. అందుకోసం ఏకంగా రూ.80 లక్షలయ్యిందని సమాచారం. ఆ పాట వద్దు… అని నిర్మాతలు మొత్తుకున్నా, శ్రీనువైట్ల వినలేదట. ఓ కామెడీ సీన్ కోసం ఊర్లోఉన్న ఇళ్లని తెల్ల పెయింట్ వేయించాడట. వందల మంది జూనియర్ ఆర్టిస్టుల్ని తీసుకొచ్చాడట. అయితే ఆ సీన్ పేలలేదు. ఇలాంటి అనవసరమైన ఖర్చులు చాలా చేయించాడని, అందుకే బడ్జెట్ తడిసిమోపెడయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాతో నిర్మాతలు పూర్తిగా నష్టపోవడంతో, పరిహారం క్రింద శ్రీనువైట్ల కొంతమొత్తం వెనక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యాడని, అందుకే ఫ్లాట్ అమ్మకానికి పెట్టాడని సమాచారం.