మరోసారి టాలీవుడ్ లో `కాస్ట్ కటింగ్` అనే మాట ముమ్మరంగా వినిపిస్తోంది. పెరిగిపోతున్న బడ్జెట్లకు అడ్డుకట్ట వేయాలన్నది నిర్మాతలందరి ఆలోచన. ఏ రూపంలో బడ్జెట్ ని కంట్రోల్ చేయాలన్న విషయంపై నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. హీరోల పారితోషికం వాళ్లని ఎప్పుడూ బెంబేలెత్తిస్తుంటుంది. అయితే.. క్యారెక్టర్ ఆర్టిస్టులతోనూ వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ల పారితోషికాలు డిమాండ్లూ చూస్తే… నిర్మాతలకు చమట్లు పడుతున్నాయి. హీరోల్నయినా భరించగలం గానీ, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని ఏమాత్రం భరించలేం.. అంటూ.. దండాలు పెట్టేస్తున్నారు నిర్మాతలు.
ప్రకాష్ రాజ్, రావు రమేష్, సముద్రఖని, సత్యరాజ్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్… వీళ్లంతా పేరు మోసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు. ప్రస్తుతం బిజీగా ఉన్న నటీనటుల లిస్టులే వీళ్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ప్రకాష్ రాజ్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు నిత్యం డిమాండే. ప్రకాష్ రాజ్‌కి ఎంతిచ్చినా… ఫర్లేదు అనుకుంటారు నిర్మాతలు. అయితే… సెట్ కి ఆలస్యంగా రావడం, ఆరు దాటితే సెట్ నుంచి పారిపోవడం.. నిర్మాతల్ని బాగా ఇబ్బంది పెట్టే విషయం. ప్రకాష్ రాజ్ విషయంలో కంప్లైంట్ కూడా ఇదే.
రావు రమేష్ రోజువారీ పారితోషికం రూ.5 లక్షలు. అక్కడితో సరిపోదు. ఆయనకు ఓ కారు, ఆయన సిబ్బందికి మరో కారు. సిబ్బంది వేతనం రోజువారి రూ.40 వేలకు పైమాటే. రావు రమేష్‌ని అయితే భరించగలం గానీ, ఆయన సిబ్బందికి కూడా వేతనాల్ని మేం ఎక్కడి నుంచి ఇచ్చేది? అని నిర్మాతలు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. సేమ్ టూ సేమ్… సముద్రఖని విషయంలోనూ ఇంతే. సముద్రఖని రోజుకి రూ.7 నుంచి 10 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాడు. తన సిబ్బందికి రూ.50 వేలు ఇచ్చుకోవాలి. నెల రోజులు సముద్రఖని కాల్షీట్లు తీసుకొంటే కేవలం ఆయన సిబ్బందికే.. 15 లక్షలు సమర్పించుకోవాల్సివస్తోంది. నరేష్ 2 లక్షలకు వచ్చేస్తాడు. ఆయనకు చేయాల్సిన ఎగస్ట్రా ఖర్చు రోజుకి రూ.30 వేలు. శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి నటుడు కూడా… తన సిబ్బంది పారితోషికాల్ని నిర్మాతపైనే రుద్దేస్తున్నట్టు టాక్. వెన్నెల కిషోర్ రోజుకి రూ2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు.
సెట్లో.. ప్రతీ క్యారెక్టర్ ఆర్టిస్టుకీ ఓ కార్ వాన్ ఉండాల్సిందే. ఒక్కో కార్ వాన్ని ఇద్దరి పంచి.. కాస్తలో కాస్త మిగుల్చుకొందామని నిర్మాతలు భావిస్తుంటారు. కానీ… దానికీ వీళ్లెవరూ ఒప్పుకోవడం లేదు. “నా కార్ వాన్ని మరొకరితో పంచుకోను. డబుల్ డోర్ ఉంటే.. నా వల్ల కాదు. డైలాగులు చదువుకొనేటప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది“ అని ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు కంప్లైంట్ చేశాడట. ఇలా ఉంది.. వీళ్లతో వ్యవహారం. హీరోల ఇంటికి కార్లు పంపడం, కార్ వాన్లు ఇవ్వడం, హీరోల సిబ్బందిని చూసుకోవడం.. ఇదంతా ఓకే. నిర్మాతలు భరిస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలానే డిమాండ్ చేస్తే ఎలా అన్నది… నిర్మాతల బాధ. ఇదే విషయాన్ని ఓ క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర వ్యక్తం చేస్తే.. “హీరోలకైతే 70 కోట్లు 50 కోట్లు.. 30 కోట్లు.. ఇస్తారు… మాకు.. లక్షల్లో ఇవ్వడానికి ఎందుకు బాధ“ అని రివర్స్ అయ్యాడట.
పెద్ద పెద్ద సంస్థల్లో సినిమాలు చేస్తున్నప్పుడు పారితోషికం విషయంలోనూ, తమ డిమాండ్ల విషయంలోనూ కాస్త వెనకా ముందూ ఆలోచించే క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం తమ పెత్తనం చలాయిస్తారని టాక్. ఎందుకంటే.. పెద్ద సినిమాల్లో తాము ఓ పాత్ర పాత్ర మాత్రమే. కొన్ని చిన్న సినిమాలకు వాళ్లే ఆధారం. అందుకే తమ అవసరాన్ని బాగా క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. దాంతో చిన్న నిర్మాతలు క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు చెబితే లబో దిబోమంటున్నాడు. హీరోల పారితోషికాలకు కత్తెర్లు వేయడం ఇప్పుడు ఎంత అవసరమో.. క్యారెక్టర్ ఆర్టిస్టుల దూకుడుకు కళ్లెం వేయడం అంతకంటే అవసరమని నిర్మాతలు భావిస్తున్నార్ట. మరి ఈ ఆలోచనని ఎంత వరకూ అమలులోకి తీసుకొస్తారో చూడాలి.