వెండి తెరా? ఓ టీ టీనా?
ప్రస్తుతం నిర్మాతల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే.
కరోనా వల్ల లాక్ డౌన్, లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడడం, వాటి వల్ల నిర్మాతలకు కోలుకోని నష్టం జరగడం తెలిసిన విషయాలే. చేతిలో సినిమా వుంది. కానీ దాన్ని ప్రదర్శించే అవకాశమే లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితి ఇది వరకెప్పుడూ చిత్రసీమకు ఎదురు కాలేదు. విడుదల కావాల్సిన సినిమాలు లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డాయి. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలీదు. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తేసినా, థియేటర్లకు అనుమతులు ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఒక వేళ థియేటర్లు కూడా తెరచుకున్నా ప్రేక్షకులకు సినిమా చూసే మూడ్ ఉంటుందో లేదో తెలీదు. ఇలా అన్నీ సమస్యలే.
ఈ యేడాది చివరి వరకూ అసలు థియేటర్లు తెరచే ప్రసక్తే లేదని కొంతమంది బడా నిర్మాతలు అంచనా వేస్తున్నారు. సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి వాళ్ల మాటల్ని బట్టి చూస్తే 2020 అనేది చిత్రసీమ మర్చిపోవడం ఖాయంలా అనిపిస్తోంది. పరిస్థితులు చక్కబడి, మళ్లీ సాధారణ స్థితి రావడానికి, సినిమా పరిశ్రమ కోలుకోవడానికి కనీసం యేడాది నుంచి యేడాదిన్నర పట్టొచ్చని అల్లు అరవింద్ చెప్పడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఇది చిన్న నిర్మాతల్ని మరీ ఇబ్బంది పెట్టే వ్యవహారమే. ఆస్తుల్ని అమ్ముకుని సినిమాలు తీస్తుంటారు. వడ్డీలు తెచ్చి పెట్టుబడి పెడుతుంటారు. ఆ వడ్డీల్ని తట్టుకోవడం చిన్న నిర్మాతలకు తలకు మించినభారం అవుతుంది. వడ్డీల్ని తట్టుకునే నిర్మాతలే ఈ కష్ట కాలంలో గట్టెక్కుతారు. మిగిలిన నిర్మాతల పని కష్టమే… అన్నది అల్లు అరవింద్ మాట. అది అక్షర సత్యం. ఇలాంటి సమయంలో ఫైనార్షియర్లు, బ్యాంకులు పెద్ద మనసు చూపించాలి. వాళ్లెంత వరకూ కనికరిస్తారన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటికైతే వడ్డీలు కొండలా పెరిగిపోతున్నాయి.
ఈ దశలో ఓటీటీ వైపు చూస్తున్నారు కొంతమంది నిర్మాతలు. ఏ నిర్మాత అయినా తమ సినిమాని థియేటర్లో ప్రదర్శించుకోవడం కోసమే తీస్తాడు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ విషయంలో హీరోలు ముందు నుంచీ అడ్డు చెబుతున్నారు. వాళ్లకు భయపడే చాలామంది నిర్మాతలు ఓటీటీ ఆలోచన విరమించుకున్నారు. కానీ ఎన్ని రోజులు థియేటర్ల కోసం ఎదురుచూస్తుంటారు. “సినిమా విడుదల ఆలస్యమయ్యే కొద్దీ పాత బడిపోయినట్టే లెక్క. ఆరు నెలలు దాటి సినిమా ఆగిపోయిందంటే దానిపై ప్రేక్షకులకు ఆసక్తి పోతుంది. అలాంటప్పుడు ఏ నిర్మాత అయినా ఏం చేయగలడు? ఈ విషయంలో హీరోలు అభ్యంతరం చెప్పినా, చివరికి నిర్మాత అంతిమ ప్రయోజనం ముఖ్యం“ అన్నది దిల్ రాజు మాట. దీన్ని బట్టి చూస్తే… ఒకవేళ హీరోలు ఓటీటీ ప్రదర్శనకు ఒప్పుకోకపోియనా… సినిమాల్ని విడుదల చేయడంలో వాళ్లు అడ్డు కోలేరన్న విషయాన్ని దిల్ రాజు బలంగా చెప్పినట్టు అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని ఓటీటీకి అమ్ముకోవడం మినహా మరో మార్గం లేదని. అల్లు అరవింద్ డంకా బనాయించి చెబుతున్నారు. భవిష్యత్తు అంతా ఓటీటీ లదే అన్నది ఆయన మాట. ఇటీవలే ఆయన ఆహా స్థాపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాలు.. ఓ నిర్మాతగా కంటే, ఓ ఓటీటీ సంస్థ యజమానిగా ఆయనకు అనుకూలంగా మారినట్టు కనిపిస్తోంది.
ఇది వరకు ఓటీటీని వ్యతిరేకించిన నిర్మాతలు ఇప్పుడు మెత్తబడుతున్న మాట వాస్తవం. కానీ.. ఓటీటీ వల్ల తమ పెట్టుబడులు తిరిగిరావు. నష్టాలు భరించాల్సిందే. ఆమేరకు నిర్మాతలు సిద్ధమైతే, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో స్వల్ప నష్టాలతో గట్టెక్కినట్టు అవుతుంది.