కరోనా విలయతాండవం చేస్తోంది. దేశం మొత్తం అల్లాడుతోంది. అందరి ధ్యాస.. కరోనా పైనే. టీవీ ఆన్ చేస్తేచాలు. కరోనా గణాంకాలు భయపెట్టేస్తున్నాయి. కరోనా గురించిన సమాచారం అందించడం, జనాల్ని జాగృతం చేయడమే.. ప్రధాన అజెండా అయిపోయింది. ఈ విషయంలో టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు కూడా చొరవ చూపిస్తున్నాయి. ప్రతీ నిర్మాణ సంస్థకూ సోషల్ మీడియాలో వేదికలున్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా ద్వారా.. తమ సినిమాల సమాచారాన్ని అభిమానులకు అందిచడం ఆ వేదికల బాధ్యత. అయితే.. ఇదే వేదికపై నుంచి.. కరోనాకి సంబంధించిన సమాచారాన్ని అభిమానులకు చేరవేస్తున్నాయి నిర్మాణ సంస్థలు.
వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీస్, డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్, సురేష్ ప్రొడక్షన్స్ గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు.. కరోనాకు సంబంధించిన విలువైన సమాచారాన్ని.. అంటే ఆసుపత్రులు, అందులో బెడ్ల వివరాలు, ఆక్సిజన్ సిలిండర్లు లభ్యమయ్యే చోటు.. వీటికి సంబంధించిన వివరాల్ని.. ఎప్పటికప్పుడు అందించడంలో తలమునకలై ఉన్నాయి. కొంతమంది కథానాయికలు సైతం.. ఈ విషయంలో చొరవ చూపిస్తుండడం విశేషం. సమాచారం అందించడం అనేది ఈరోజుల్లో చాలా కీలకమైన అంశం. మీడియా సంస్థలు ఆ బాధ్యత వేసుకున్నా – సామాజిక సృహ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ముందుకు రావడం, తమకు తెలిసిన విషయాల్ని పది మందికీ చెప్పడం.. ఓ రకంగా అభినందించ దగిన విషయం. ఎప్పుడూ సినిమా పోస్టర్లు, అప్ డేట్లతో కళకళలాడే…. ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీలు.. ఇప్పుడు కరోనా గణాంకాలు, వివరాలతో… నిండిపోతున్నాయి. ఓ రకంగా.. ఇదీ సామాజిక సేవే.