పౌర హక్కుల నేత మరియు ప్రొఫెసర్ హరగోపాల్ ఒక సోషల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు వారి తండ్రి అయినటువంటి రాజారెడ్డి మీద ప్రొఫెసర్ హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాజా రెడ్డి పై మర్డర్ కేసు గురించి:
ప్రొఫెసర్ హరగోపాల్, మరికొందరు పౌరహక్కుల నేతలు గతం లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పలు విషయాల మీద భేటీ అయ్యేవారు. ఆ సందర్భంగా పలు విషయాలను వైయస్సార్ తో ఆయన చర్చించేవారు. అప్పటి చర్చల్లో దొర్లిన కొన్ని సంఘటనల గురించి , కొన్ని అంశాల గురించి ప్రొఫెసర్ హరగోపాల్ ఒక సోషల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. వైయస్సార్ తండ్రి అయిన రాజారెడ్డి మీద పలు మర్డర్ కేసులు, పలు క్రిమినల్ కేసులు ఉండేవని, ఆఖరికి ఆయన కూడా అదే రీతిలో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారని చెప్పిన హరగోపాల్ తాము ఇదే విషయాన్ని ఒక సారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. అయితే రాజా రెడ్డి పై ఉన్నటువంటి హత్య కేసులు మరియు క్రిమినల్ కేసుల విషయమై స్పందిస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తన తండ్రి మీద పీపుల్స్ వార్ గ్రూప్ యొక్క ప్రభావం, వారి స్ఫూర్తి ఎక్కువగా ఉండేవని, ఆ స్ఫూర్తితోనే ఆయన కూడా పీపుల్స్ కోర్ట్ అంటూ ప్రజల మధ్యలో తీర్పులు తీర్చే వారని, ఆ సందర్భంగా ఆయన అలా ప్రజాకోర్టులో తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఆయన మీద ఇప్పుడు మీరు చూపినటువంటి మర్డర్ కేసులు ఇవన్నీ వస్తున్నాయని వైఎస్ఆర్ ప్రొఫెసర్ హరగోపాల్ కి అప్పట్లో వివరించినట్లు ఆయన తెలిపారు.
రాజశేఖర్ రెడ్డి వచ్చాక రాజకీయాల్లో డబ్బులు పంచడం పెరిగిందన్న వ్యాఖ్యలపై వైఎస్సార్ స్పందన:
ఇక వైయస్ రాజశేఖర్రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు డబ్బులు పంచటం ఎక్కువైందని ఆయనతోనే నేరుగా ప్రొఫెసర్ హరగోపాల్ మరియు ఆయన తోటి ఉన్న పౌరహక్కుల నేతలు వైఎస్ఆర్ ని ప్రశ్నించినప్పుడు వైయసార్ వీరిని, ‘ మేము డబ్బులు పంచడం ఎక్కువైందా లేక మేము వారి నుండి పీడించి డబ్బులు తీసుకోవడం ఎక్కువైందా’ అని తిరిగి ప్రశ్నించారని, దానికి తాము డబ్బులు పంచడం ఎక్కువైందని చెప్పామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. అప్పుడు వైయస్సార్ దాని గురించి స్పందిస్తూ, తమకు బైరైట్ ఎస్టేట్లో ఒక ప్రత్యేకమైన రాయి దొరికిందని ఆ రాయి పెట్రోల్ ని ఫిల్టర్ చేయడంలో ఉపయోగపడుతుందని, ఆ రాయి మనకు దొరికిన కారణంగా డబ్బు రావడం ఎక్కువైందని, తమకు వచ్చిన డబ్బు లో నుంచి ప్రజలకు కొంత తాము పంచి పెట్టామని, అందువల్లే తాము రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు డబ్బులు పంచడం ఎక్కువైంది అన్న వ్యాఖ్య మీ దాకా వచ్చిందని వైయస్ రాజశేఖర్రెడ్డి తమకు వివరించినట్లుగా హరగోపాల్ చెప్పుకొచ్చారు.
జగన్ సీఐ ని చితకబాదిన సంఘటనపై వైఎస్ఆర్ స్పందన:
ఇక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గురించి కూడా హరగోపాల్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. చాలా సంవత్సరాల కిందట జగన్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ని చితకబాదిన సంగతి ప్రొఫెసర్ హరగోపాల్ బయటపెట్టారు. అయితే తాము ఇదే విషయాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి తో ప్రస్తావించి దాని వివరాలు కనుక్కున్నామని, అయితే ఒక సీఐని జగన్ చితక కొట్టిన విషయాన్ని వైయస్సార్ తో ప్రస్తావించినప్పుడు ఆయన దానికి స్పందిస్తూ, జగన్ కి కొంతమంది అనుచరులు ఉన్నారని, అయితే ఆ అనుచరులలో ఒక అతని వద్ద లైసెన్సు లేని తుపాకీ దొరకడం వల్ల సీఐ అతనిని జైలులో పెట్టారని, కానీ 24 గంటలలో కోర్టు ముందు హాజరు పరచాలని చట్టం చెబుతుండగా ఆ సీఐ మాత్రం జగన్ అనుచరుని ఇరవై నాలుగు గంటలకు మించి నిర్బంధంలో ఉంచినందువల్ల జగన్ కి కోపం వచ్చి, చట్ట వ్యతిరేకంగా 24 గంటలకు మించి తన అనుచరుల్ని లోపల ఎలా వేస్తారు అంటూ సిఐ మీదకు వెళ్లినట్లు, అతనిని కొట్టినట్లు వైయస్సార్ వివరించారు అని ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పుకొచ్చారు
2004లో ముఖ్యమంత్రి కాకపోయుంటే వైఎస్ఆర్ ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని తలకెత్తుకుని ఉండేవారు:
అదేవిధంగా ఇంకొక సందర్భం గురించి మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్రెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళే వారని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. 1990 దశకం లోనే రాయలసీమ విమోచనా సమితి వంటి రకరకాల సంఘాలను రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారని, 2004 ఎన్నికల తరువాత గనక తాను ముఖ్యమంత్రి కాకపోయినట్లయితే ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని మొదలు పెట్టడానికి కావలసిన సరంజామా అంతా అప్పటికే సిద్ధంగా ఉండి ఉందని, ముఖ్యమంత్రి కాకపోయినట్లయితే
వైయస్సార్ తానే స్వయంగా ఆ ఉద్యమాన్ని తలెత్తుకుని దాన్ని బలంగా తీసుకుని వెళ్లి ఉండేవారని, అయితే 2004లో ముఖ్యమంత్రి కావడం వల్ల, ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అనేది చేపట్టవలసిన అవసరం రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి రాలేదని ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు.
మొత్తంమీద రాజారెడ్డి గురించి ఆయన తనయుడు వైయస్సార్ గురించి, వైయస్సార్ తనయుడు జగన్ గురించి ప్రొఫెసర్ హరగోపాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.