తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ…టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఓ కొత్త వ్యూహాన్నిరూపొందించుకుంది. టీఆర్ఎస్కు ఓటేస్తే… బీజేపీకి ఓటేసినట్లే అని స్లోగన్ ను పెద్ద ఎత్తున ప్రజల్లోకితీసుకెళ్లాలని నిర్ణయించింది. కారణమేమిటంటే.. తెలంగాణలో ముస్లిం ఓటింగ్ శాతం పన్నెండు శాతం. ఎంఐఎంతో టీఆర్ఎస్ సన్నిహిత సంంబంధాలు కొనసాగిస్తోంది. దాని వల్ల ఎంఐఎం పోటీ చేయని చోట.. టీఆర్ఎస్ కు ఆ ఓటు కన్సాలిడేట్ అవుతోంది. దీన్ని నివారించడానికే .. టీఆర్ఎస్ను బీజేపీతో అంటగట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
టీఆర్ఎస్ – బీజేపీ ఒకటేనా..?
టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని నమ్మించడానికి కూడా కాంగ్రెస్‌కు కొంచెం అవకాశం ఉంది. ఎందుకంటే…కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి. ఆ పార్టీ అనుకూల కూటమిలో టీఆర్ఎస్ అసలు ఉండదు. అదే సమయంలో బీజేపీ అనుకూల కూటమిలో… చేరడానికి అంత తీవ్రమైన వ్యతిరేకత ఏమీ టీఆర్ఎస్కు ఉండదు. కానీ ముస్లిం ఓట్లు పోతాయనే భయంతోనే యాంటీ కాంగ్రెస్, యంటీ బీజేపీ విధానాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తోంది. కానీ ఇది సాధ్యం కాదని… రెండు పక్షాల్ల ఏదో ఒక దానిపై పార్టీలు చేరక తప్పనిసరి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ బలప్రదర్శన చేస్తే కేసీఆర్ మాత్రం దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పంచుకోవడం ఇష్టం లేక కేసీఆర్ వెళ్లలేదు. అందుకే టీఆర్ఎస్కు ఓటేస్తే.. ఏదో రకంగా బీజేపీకి ఓటేసినట్లే..అన్న ప్రచారాన్ని మైనార్టీల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ప్రచారానికే ముస్లింలు మారిపోతారా..?
పైకి చూస్తే బాగానే ఉంది.. కానీ వాస్తవంగా ఇది సాధ్యమవుతుందా..?. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది. ఎందుకంటే.. ఎస్సీ, ఎస్టీలు సంప్రదాయకంగా కాంగ్రస్ ఓటు బ్యాంక్. అలాగే ముస్లిం ఓటర్ల కూడా. తెలంగాణలో దాదాపుగా 30 నుంచి 35 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గెలుపోటములు నిర్ణయించే పరిస్థితిలో ఉన్నారు. ఒక్క హైదరాబద్ లోనే కాదు.. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం లాంటి నియోజకవర్గాల్లోనూ ఎక్కువ మంది ఉన్నారు. అందుకే కేసీఆర్ కూడా.. ఎంఐఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే కాకుండా.. ముస్లింల కోసం అనేక పథకాల ప్రవేశ పెట్టారు. పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు. ఈ రిజర్వేషన్లు రావడం అసాధ్యమని అందరికీ తెలుసు. కానీకేసీఆర్ ఇవ్వడానికి ప్రయత్నించామని చెప్పుకోవడానికే… తీర్మానం చేశారు. ఇవన్నీ ముస్లిం ఓటు బ్యాంక్‌ను ఆకట్టుకోవడానికే.
ముస్లింలలో తెలంగాణ వాదం లేదంటున్నకాంగ్రెస్..!
అయితే ముస్లింలను ఆకట్టుకోవడం టీఆర్ఎస్కు కూడా అంత తేలిక కాదన్నది కాంగ్రెస్ విశ్లేషణ. ఎందుకంటే..ఎంఐఎం.. మొదటి నుంచి సమైక్య రాష్ట్రానికే మద్దతు తెలిపింది. అయితే రాయల తెలంగాణ అన్నది కానీ.. ప్రత్యేక తెలంగాణకు మాత్రం సపోర్ట్ చేయలేదు. ముస్లింజనాభాలో ప్రత్యేకరాష్ట్ర వాదం దాదాపుగా లేదు. తెలంగాణ ఉద్యమంలో ముస్లింల ప్రాతినిధ్యం తక్కున అని కాంగ్రెస్ విశ్లేషణ. అందుకే.. బీజేపీని బూచిగా చూపి.. ముస్లింలను తమ వైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల్లో ఆభద్రతా భావం పెరిగింది. దీన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ అనుకుంటోంది.
సెక్యూలర్ పార్టీలకే ముస్లిం ఓట్లు..!
ఇండియాలో ముస్లిం ఓటింగ్ ఎలా ఉంటుందంటే… తెలంగాణ, అస్సాం, కేరళల్లో తప్ప.. ముస్లింపార్టీలకు.. ముస్లింలు ఓట్లు వేయడం లేదు. సెక్యూలర్ పార్టీలకే ఓట్లు వేస్తున్నారు. కారణమేమిటంటే… ముస్లిం పార్టీలు బలంగా ఉన్న చోట మినహా.. మెయిన్‌స్ట్రీమ్ పార్టీలకే ముస్లిం ఓటర్లు ఓట్లేస్తున్నారు. బీజేపీ బలంగా ఉన్న చోట… యాంటీ బీజేపీ స్ట్రాటజిక్ ఓటింగ్ జరగొచ్చు. కానీ ఏకపక్షంగా జరగదు. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా … పరిశీలిస్తే.. ముస్లిం ఓటు బ్యాంక్ అంటూ ఏమీ లేదు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి ముస్లింలు నిర్ణయం తీసుకుంటారు. ఏపీ, తెలంగాణల్లో ముస్లిం ఓట్లు ఎవరికి పడతాయనేది కన్ఫర్మ్ గా చెప్పలేము. కానీ బీజేపీని ఎవరు ఓడిస్తారని నమ్మకం కలిగితే వారికి స్ట్రాటజిక్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇది కూడా… కమ్యూనల్ పోలరైజేషన్ బాగా జరిగితేనే ఈ ఓటింగ్ జరుగుతుంది. లేకపోతే సాధ్యం కాదు.
ఎంఐఎం బలహీనపడితేనే కాంగ్రెస్‌కు చాన్స్..!
తెలంగాణలో బీజేపీ ఓ ఫోర్స్ కాదు. బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రాటజిక్ అవసరంలేదు. ఈ వ్యూహం ద్వారా ముస్లిం ఓట్లన్నింటిని గుంపగుత్తగా పొందడం అనేది సాధ్యం అయ్యే పని కాదు. అయినా కాంగ్రెస్ ఎందుకు ఈ వ్యూహం అమలు చేస్తోందో అర్థం కావడం లేదు. ముస్లిం ఓట్లన్నీ.. ఎంఐఎం బలంగా లేని చోట స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా జరగకుండా చేయడానికి కాంగ్రెస్… టీఆర్ఎస్కి ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లే అన్న ప్రచారం తీసుకొచ్చారనుకుందాం. కానీ ముస్లిం ఓట్లు పొందాలంటే… దీనికంటే మంచి ప్లాన్ ను అమలు చేసుకోవచ్చు. నిజానికి తెలంగాణ ఎంఐఎం బలహీనపడకుండా… ముస్లింలలో ప్రాబల్యం పెంచుకోవడం అనేది అసాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా వ్యూహ రచన చేసుకోవాలి కానీ… బీజేపీని బూచిగా చూపి… ముస్లింల ఓట్లు పొందాలనుకుంటే.. సాధ్యం కాదని… దేశవ్యాప్తంగా ముస్లిం ఓటర్ల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అర్థమయిపోతుంది.