2019 దగ్గర పడుతున్న కొద్దీ ఆర్థిక రంగం.. నరేంద్రమోదీని వణికిస్తోంది. ముఖ్యంగా డాలర్ విలువ రూపాయితో పోలిస్తే.. పెరుగుతోంది. ఇది కచ్చితంగా నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఓ సవాల్ గా మారనుంది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోరూ రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 5.3 శాతం తగ్గింది. ఇంకా రూపాయి పతనం అవుతుంది అంటున్నారు. రూపాయి పతనం అయితే అనేక పరిణామాలు ఎదురవుతాయి. రూపాయి పతనం వల్ల ధరలు ప్రభావితం అయ్యే వస్తుసేవలు చాలా ఉంటాయి. చమురే తీసుకుంటే..మనం ఎనభై శాతానికిపైగా దిగుమతుల మీద ఆధారపడతాం. రూపాయి విలువ పతనం అయితే..చమురు ధర ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇవే కాదు..ఇంకా చాలా వస్తువులుంటాయి. త్వరలో డాలర్ విలువ రూ.70 వరకూ చేరొచ్చంటున్నారు.
అమెరికాకు వెళ్లిపోతున్న డాలర్లు..!
వాస్తవానికి నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రమేయం లేకుండా.. ఆర్థిక రంగంలో కొన్ని అంశాలు కలసి వచ్చాయి. వాటిలో డాలర్ బలహీనంగా ఉండటం కూడా ఒకటి. మోడీ అధికారం చేపట్టిన రెండు, మూడేళ్ల వరకు రూపాయి బలంగా ఉంది. దీనికి మోడీ ప్రభుత్వ విధానాల కన్నా..అంతర్జాతీయ పరిణామాలే కారణం. ఇప్పుడు రూపాయి పతనానికి కూడా.. అంతర్జాతీయ పరిణామాలే కారణం. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటే.. డాలర్ ప్రపంచం అంతా తిరుగుతుంది. అమెరికాలో అర్థిక వ్యవస్థ బలపడి.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే.. డాలర్లన్నీ అమెరికా దగ్గరకు వస్తూంటాయి. అందుకే రూపాయి పతనం కావడమనేది పెద్ద సవాల్ గా ఉంటుంది. రూపాయి బలహీనపడటం వల్ల స్టాక్ మార్కెట్లలోకి వచ్చే విదేశీ పెట్టుబడులు కూడా రివర్స్ అవుతున్నాయి. మొదటి…ఒకటి, రెండేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా వచ్చాయి. విదేశీ పెట్టుబడుల స్వభావం ఏమిటంటే.. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ బాగా ఉంటే.. ఈ డాలర్లు అమెరికాలోనే ఉంటాయి బయటకు రావు. ఇప్పుడు అమెరికాలో ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతోంది. అందుకే డాలర్లు మళ్లీ అమెరికాకు తీసుకెళ్తున్నారు పెట్టుబడిదారులు. ఈ ఏడాది ఐదు నెలల్లోనే 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇండియాను వదిలి వెళ్లిపోయాయి. మోడీ ఎన్ని దేశాలు తిరిగినా..అంతర్జాతీయ పరిణామాలు బాగోలేకపోతే పెట్టుబడులు రావు. ఒక్క మే నెలలోనే 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులను విదేశీ పెట్టుబడి దారులు భారత్ నుంచి ఉపసంహరించుకున్నారు. ఈ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న కొద్దీ డాలర్ పై ఒత్తిడి పెరుగుతుంది. మరింతగా రూపాయి పతనానికి కారణం అవుతుంది.
రూపాయి పతనమైతే కష్టాలే..!
రూపాయి పతనం అయితే దేశీయంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం ఉంటుంది. ఎలా అంటే.. మన పెట్రోలియం ఉత్పత్తులు 80 శాతం దిగుమతులే. రూపాయి పతనం అవ్వడం వల్ల.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. వీటి ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. చమురు దిగుమతులకు మనం డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఓ వైపు విదేశీ పెట్టుబడులు వెనక్కి పోయి డాలర్లు తగ్గిపోతున్నాయి. మరో వైపు చమురు ధరలు పెరిగి డాలర్లలో ఎక్కువ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. రూపాయి పతనం వల్ల కూడా డాలర్లు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి.
పెరుగుతున్న కరెంట్ అకౌండ్ డెఫిషిట్..!
రోజువారీ విదేశీమారక ద్రవ్యం ఎంత సంపాదిస్తున్నాం.. ఎంత ఖర్చు పెడుతున్నామన్నది కూడా ముఖ్యమే. ఈ రెండింటి మధ్య గ్యాప్ కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అంటారు. ఇది యూపీఏ హయాంలో త్రీ పర్సంట్ దాటి.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి కారణం అయింది. ఇది మోడీ వచ్చాక బాగా తగ్గింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ఇది రెండు శాతంగా ఉంది. రూపాయి పతనం అవుతూ ఉంటే.. ఇది ఇలాగే ఉండటం అవసరం. ఇది మూడు శాతానికి మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. చమురు ధర పది డాలర్లు పెరిగితే.. 0.6 శాతం జీడీపీ తగ్గిపోతుంది. అంటే చమురు ధరలు పెరిగితే.. దేశ స్థూల జాతీయోత్పత్తి కూడా తగ్గుతుంది.
తిరగబడుతున్న మోడీ జాతకం..
అంటే ఏ అంశాలయితే.. 2014లో మోడీకి కలసి వచ్చాయో.. అంటే రూపీ బలపడటం. చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు రావడం అన్నీ కలసి వచ్చాయి. ఇప్పుడు ఇవే అంశాలు మోడీకి ప్రతికూలంగా మారుతున్నాయి. యూపీఏ 2పై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కూడా ఇవే అంశాలు కారణం. ఇప్పుడు మోడీకి ఇవి సవాల్ గా మారాయి. మోడీకి ప్రతిపక్షాల ఐక్యత ఒక్కటే సవాల్ కాదు. ఆర్థిక వ్యవస్థ వెనుకబాటు కూడా..మోడీకి అసలైన గండాన్ని తెచ్చి పెట్టింది.