ఢిల్లీలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇద్దరూ కలసి వెళ్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్తో చర్చలు జరిపినట్లు మీడియాలో విస్త్రతంగా ప్రచారమయింది. అయితే ఈ విషయాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఆకుల సత్యనారాయణ కూడా ఖండించారు. ఇద్దరూ ఒకే కారులో వెళ్లి రావడాన్ని కూడా.. వీరు ఓ “లిఫ్ట్”గా చెప్పుకొచ్చారు. ఒకరికి ఒకరు లిఫ్ట్ ఇచ్చుకున్నట్లు చెప్పుకుంటున్నారు కానీ.. ఇది మాత్రం కచ్చితంగా లిఫ్ట్ కాదు.. లిఫ్ట్ రాజకీయమే. బీజేపీ-వైసీపీ మధ్య ఏదో ఉందని కచ్చితంగా అనుమానించాల్సిన విషయమే.
వైసీపీకి బీజేపీకి సంబంధం ఉందంటున్న టీడీపీ..!
తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో సంబంధాలు అంటగట్టేందుకు తీవ్రమైన ప్రయత్నలే చేస్తోంది. ఎందుకంటే.. వైసీపీకి బీజేపీతో సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే .. అది వైసీపీకి మైనస్ అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే చంద్రబాబు ఎవరు తనను వ్యతిరేకించినా బీజేపీకి లింక్ పెడుతున్నారు. వైసీపీ, జనసేనను కూడా అదే లింక్ పెట్టారు. కానీ వీరెవరూ.. గట్టిగా తిప్పికొట్టే పరిస్థితుల్లో లేరు. దానికి కారణాలేమైనా.. ఇది చంద్రబాబుకు అనుకూలిస్తోంది. రాజకీయం అంటే.. ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడానికి ఎలాంటి అవకాశం వచ్చినా.. పార్టీలు ఉపయోగించుకుంటాయి. చంద్రబాబు కూడా అదే చేస్తున్నారు.
బీజేపీ- వైసీపీ మధ్య సంబంధం నిజమే..!
బీజేపీ – వైసీపీ మధ్య సంబంధం ఉన్న అనుమానాలు ఎందుకు బలపడుతున్నాయనే ప్రశ్న తరచూ వస్తుంది. నిజానికి వైసీపీ – బీజేపీ మధ్య అనుబంధం ఉందన్న అనుమానం కాదు….నిజంగా సంబంధం ఉంది. అయితే అది ఎలాంటి సంబంధమో చెప్పలేము. అక్రమ సంబంధమా.. సక్రమమైనదా.. అనేదాన్ని పక్కన పెడితే.. కచ్చితంగా ఆ రెండు పార్టీల మధ్య ఓ బంధం అయితే ఉంది. ఈ బంధం ఇప్పటిది కాదు. 2014లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన తర్వాత నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం కూడా చేయకముందే… వైఎస్ జగన్ … ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో వైసీపీ నేతలు దీన్ని ఖండించలేదు. పైగా ప్రత్యేకహోదా కోసం కలిసినట్లు చెప్పుకున్నారు. ఇదొక్కటే కాదు.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. కానీ ఒక్కడా… జగన్ పార్టీ ప్రస్తావన ఉండటం లేదు. కర్ణాటకలో కానీ…ఇతర చోట్ల కానీ బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ వెళ్లలేదు. అలాగని.. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు వ్యతిరేకమని కూడా చెప్పడం లేదు. పూర్తిగా బీజేపీ సానుకూల వైఖరినే వైసీపీ ప్రదర్శిస్తోంది.
బీజేపీకి అడగకుండానే మద్దతు..!
వైసీపీ వ్యవహారశైలి మొదటి నుంచి ఇంతే ఉంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా పని చేశారు. కానీ అంతకు ముందు జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాల్లో నరేంద్రమోడీకి వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇవే కాదు.. రోజువారీ సమస్యలపైనా ఆయన ప్రధానిపై కానీ.. కేంద్రంపై కానీ ఒక్క మాట మాట్లాడటం లేదు. పెట్రో ధరల పెంపుపై దేశం మొత్తం గగ్గోలు పెడుతున్నా…మోడీని పల్లెత్తు మాట అనడానికి సాహసించడం లేదు. ఇక జగన్ దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల విషయంలోనూ స్పందించలేదు. నిజానికి దళితులు వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్. కనీసం వారి కోసం.. కూడా.. బీజేపీకి వ్యతిరేకంగా నోరు విప్పే ప్రయత్నం చేయలేదు. ఇవే కాదు.. ఈ నాలుగేళ్ల కాలంలో… బీజేపీకి వ్యతిరేకంగా.. ఒక్కటంటే.. ఒక్క నిర్ణయాన్ని వైసీపీ తీసుకోలేదు. దేశ రాజకీయాల్లో అనేక మార్పులొస్తున్నా… బీజేపీకి దగ్గరయ్యేందుకే వైసీపీ ప్రయత్నిస్తోంది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో “హోదా” షరతు ఎందుకు పెట్టలేదు..?
నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి టీడీపీ ప్రభుత్వాలను నడిపింది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. నాలుగేళ్ల తర్వాత బీజేపీకి పూర్తి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నారు. చాలా తీవ్రమైన విమర్శలతో మోదీపై మండి పడుతున్నారు. కానీ వైసీపీ మాత్రం తన సానుకూల వైఖరిని మరింత పెంచుకుంటూ పోతోంది తప్ప.. బీజేపీపై యాంటీ స్ట్రాటజీని ఫాలో కావడం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో… బీజేపీ అడగకుండానే .. వైసీపీ బేషరతు మద్దతు ప్రకటించింది. అప్పడు ప్రత్యేకహోదా ను… షరుతుగా పెట్టి ఉండొచ్చు. ఆ అవసరమే లేకుండా… ఎలాంటి షరతులు లేకుండా… ఏకపక్షంగా మద్దతు ప్రకటించేసింది. నిజానికి మిత్రపక్షాలు కూడా.. బీజేపీ అభ్యర్థుల్ని ఖరారుచే సిన తర్వాత మద్దతు తెలిపాయి. బీహార్ మిత్రపక్ష జేడీయూ అయితే.. రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ కు మద్దతు ఇవ్వలేదు. చివరకు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుకు కూడా వైసీపీ బేషరతు మద్దతు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. కారణం… వెంకయ్యను వైసీపీ బద్ద శత్రువుగా పరిగణిస్తుంది. అయినా తడుముకోకుండా వైసీపీ మద్దతు ప్రకటిచింది.
ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనని జగన్..!
అదే సమయంలో ప్రత్యేకహోదా కోసం ఏమైనా చేస్తామంటున్న వైసీపీ అధినేత.. చంద్రబాబును విమర్శిస్తున్నారు కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఒక్క మాట కూడా అనడం లేదు. మిత్రపక్ష పార్టీగా, ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా నెలల తరబడి సాధ్యం కాలేదు కానీ.. జగన్, విజయసాయిరెడ్డి… పదే పదే ప్రధాని అపాయింట్మెంట్లు పొందగలిగారు. అంటే కచ్చితంగా రెండు పార్టీల మధ్య సంబంధం ఉన్నట్లే. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయా లేదా అనేది చెప్పేలేము. నేరుగా సహకరించుకుంటాయా… పరోక్షంగా సహకరించుకుంటాయా అన్నది.. ఎన్నికల సమయంలో తేలొచ్చు.
జగన్కు ఉన్నది కేసుల భయమే..!
జగన్ బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోకపోవడానికి కారణం గత అనుభవాలే అనుకోవచ్చు. కాంగ్రెస్తో విబేధించి బయటకు వచ్చిన తరవాత తనపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు బీజేపీని కాదంటే.. ఆ కేసులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. జగన్ కు ఇదే భయం వెంటాడుతోంది. బీజేపీ ఎన్ని నీతిమంతమైన కబుర్లు చెప్పినా… టూజీ కేసులో నిందితులు బయపటడేలా వ్యవహరించడం, గాలి జనార్ధన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో పాటు.. ఇష్టం లేని లాలూను జైలుకు పంపడం.. చిదంరబం కుటుంబాన్ని వేధించడం అన్నీ సీబీఐ చేస్దోంది. కానీ అంతా బీజేపీ డైరక్షన్ లోనే. టీడీపీతో కలసి పోటీ చేసినప్పుడు బీజేపీ… జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడని ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు అదే జగన్తో సంబంధాలు కొనసాగిస్తోంది.
వైసీపీది స్వయంకృతమే..!
వైసీపీ బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతూండటంతో.. టీడీపీ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుటోంది. వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ దళితులు, మైనార్టీలు. జగన్ బీజేపీకి దగ్గరైతే.. ఆ ఓటు బ్యాంక్లో చీలిక తీసుకురావొచ్చని టీడీపీ బావిస్తోంది. టీడీపీ బూచి చూపించి.. దళిత, మైనార్టీ ఓటర్లను టీడీపీ తన వైపునకు తిప్పుకుంటోంది. బీజేపీని చంద్రబాబు టార్గెట్ చేసి… వైసీపీతో కమ్మక్కయిందని ప్రజల్లోకి తీసుకెళ్తునన్నారు. దీని వల్ల అప్పటో కాంగ్రెస్ కు ఉన్న వ్యతిరేకత ఇప్పుడు బీజేపీకి వచ్చింది. దీన్ని వైసీపీవైపు మళ్లించి.. రాజకీయంగా లబ్ది పొందే వ్యూహంలో చంద్రబాబు ఉన్నారు. వైఎస్ జగన్ చేజేతుా.. టీడీపీకి ఈ అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా… వైసీపీ – బీజేపీ ఒక్కటేనని… ఏపీలో మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. ఇదంతా జగన్ చేసుకున్న స్వయంకృతమే.