భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో పడింది. రాబోయే రాజకీయ పరిణామాలను ఎదుర్కోవడానికి ఉన్న మిత్రులను కాపాడుకోవడానికి.. కొత్త మిత్రులను వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ” సంపర్క్ ఫర్ సమర్థన్ ” పేరుతో పర్యటనలు ప్రారంభించారు. ఆయనకు ఈ ప్రయత్నాల్లో భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి.
ఉన్న మిత్రులు కూడా వదిలి పెట్టేస్తున్నారు..!
బీజేపీకి పంజాబ్ మిత్రపక్షం అకాలీదళ్ ..ఎన్డీఏ నుంచి విడిపోయే ప్రశ్నే లేదని చెప్పుకొచ్చింది. గతంలో ఈ పార్టీ కూడా కాస్తంత అసంతృప్తిని బీజేపీపై వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు అకాలీదళ్‌కు ప్రత్యామ్నాయం లేదు. ఆ పార్టీ బలహీనపడుతోంది. వదులుకుంటే బీజేపీనే వదులుకోవాలి తప్ప.. అకాలీదళ్ వదులుకునే ప్రసక్తే లేదు. ఇక శివసేన మాత్రం విచిత్రంగా ప్రవర్తించింది. ముంబై వెళ్లి శివసేన అధినేత ఉద్ధవ్ ధాకరేతో .. అమిత్ షా సమావేశమయ్యారు. అయితే సమావేశానికి ముందు.. సమావేశం తర్వాత కూడా .. తమ అధికార పత్రిక సామ్నాలో.. వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీతో కలసి పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
కొత్తగా బీజేపీతో వచ్చే మిత్రులెవరూ లేరు..!
ఈ రెండు పార్టీలు మినహా.. బీజేపీతో కలసి వచ్చే మిత్రులు ఎవరూ ఇప్పుడు లేరు. ఎందుకంటే.. దేశంలో నరేంద్ర మోడీ హవా ఉన్నప్పుడు అందరూ… పొత్తులకు వచ్చారు. కానీ మోడీ హవా తగ్గుతున్నట్లు తేలగానే… అందరూ బయటకు వెళ్లిపోతున్నారు. బీజేపీకి శివసేనకు ఓ తలనొప్పిగా మారింది. అకాలీదళ్ ఉంటుందా… ఉండదా అన్న అనుమానాలున్నాయి. పాకిస్థాన్‌లో పీడీపీ వ్యవహారంపై ఇప్పుడే అంచనాకు రాలేం. ఎందుకంటే.. బీజేపీ-పీడీపీ పరస్పర విరుద్ధ భావాలున్నా పార్టీలు. బీహార్‌లో జేడీయూ నేత నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిలా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే మధ్యలో ఆర్జెడీని వదిలేసి.. బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవలి కాలంలో.. బీహార్‌లో జరిగిన ఉపఎన్నికల్లో ఆర్జేడీ వరుసగా గెలుస్తూ వస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పటికీ.. ఆర్జేడీ వైపు ఓటర్లు ఉన్నారు. లాలూ కుమారుడు పార్టీని సమర్థవంతంగా నడుపుతున్నారు. బీజేపీతో పొత్తును జేడీయూ సంప్రదాయ ఓటర్లు కూడా అంగీకరించడం లేదు. అందుకే జేడీయూ అధినేత ఉపఎన్నికల ఫలితాల తర్వాత మాట మార్చారు. నోట్ల రద్దు నుంచి అనేక అంశాలపై బీజేపీని నిందిస్తున్నారు. ఉపఎన్నికల్లో ఓటమికి బీజేపీనే కారణమంటున్నారు. బీహార్‌కు ప్రత్యేకహోదా నినాదాన్ని మళ్లీ అందుకున్నారు. అంటే ఎన్నికలకు ముందు ఏం జరిగినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అంటేనే హడల్..!
ఇప్పుడు బీజేపీకి ఎవరూ మిత్రుల్లేరు. చిన్న చిన్న పార్టీలు ఉన్నా.. వారి వల్ల బీజేపీకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బయటకు వెళ్లిపోయిన తర్వాత వైసీపీ బీజేపీకి దగ్గరయింది. కానీ ప్రత్యేకహోదా ఉద్యమం కారణంగా.. బీజేపీతో కలిస్తే.. తమకు తీవ్రనష్టం జరుగుతుందని వైసీపీ ఆలోచనలో ఉంది. అలాగే జనసేన కూడా.. అదే ఆలోచనలో ఉంది. కొత్త పార్టీలేమైనా వచ్చినా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కష్టమే. అంటే.. గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఎలా అంటరాని పార్టీనో ఇప్పుడు బీజేపీ అలా అయిపోయింది. తెలంగాణలో కూడా టీడీపీ దూరమయింది. వామపక్షాలు, టీఆర్ఎస్ సహా ఏ పార్టీ కూడా.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అసాధ్యం. బీజేపీకి పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న ఒకే ఒక్క పార్టీ టీఆర్ఎస్. కానీ ముస్లిం, దళితుల ఓట్ల సమీకరణాల కారణంగా..టీఆర్ఎస్ కూడా.. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తుకు వెళ్లడం అసాధ్యం.
కర్ణాటక, తమిళనాడుల్లోనూ మిత్రులు దొరకరు..!
ఇక కర్ణాటకలో బీజేపీకి గొప్ప అవకాశం మిస్ అయింది. ఎందుకంటే.. కర్ణాటకలో బీజేపీకి బలం ఉన్న చోట జేడీఎస్ కు , జేడీఎస్ కు బలం ఉన్న చోట బీజేపీకి బలం లేదు. అందు వల్ల రెండు పార్టీల పొత్తులకు మంచి అవకాశం ఉండేది. కానీ అక్కడ ఎన్నికల ఫలితాలు… అటూ ఇటూ కాకుండా అయిపోయాయి. అధికారం అందుకోవడానికి 8 సీట్లు మాత్రమే తక్కువయ్యాయి. దాంతో జేడీఎస్ కు సీఎం సీటు అప్పగించడానికి ఒప్పుకోలేదు. దాంతో..కాంగ్రెస్ తో జేడీఎస్ పొత్తు పెట్టేసుకుంది. వచ్చే ఎన్నికల్లోనూ వారు కలసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఇక తమిళనాడులో .. డీఎంకే కాంగ్రెస్ కూటమిలో ఉంది. ఇక అన్నాడీఎంకేను పూర్తిగా బీజేపీ నడిపిస్తోంది. కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. రజనీకాంత్‌తో పొత్తు తమకు సరిగ్గా సరిపోతుందని బీజేపీ భావిస్తోంది. కానీ రజనీకాంత్ చేస్తున్న రాజకీయం అర్థంపర్థం లేకుండా ఉంది. తూత్తుకూడి కాల్పుల ఘటనలో ఆందోళన కారులతో తప్పన్నట్లు మాట్లాడి.. రాజకీయ అవగాహన పెద్దగా లేదని బయటపెట్టుకున్నారు. కమల్ హాసన్ పూర్తిగా పొలిటికల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. కానీ ఆయన బీజేపీకి తీవ్ర వ్యతిరేకం. పార్టీ నిర్మాణంపైనా ఆయన రజనీకాంత్ పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆదే సమయంలో రజనీకాంత్ మహారాష్ట్రలో పుట్టి.. కర్ణాటకలో పెరిగి… తమిళనాడులో సూపర్ స్టార్ అయ్యారు. ఇది కూడా అయనకు ప్రతిబంధకమే. దీని వల్ల బీజేపీకి లాభమో.. నష్టమో అర్థం కాని పరిస్థితి.
సీట్లు తెచ్చే మిత్రులను వెదుక్కోవడమే అసలైన సవాల్..!
ఇప్పుడు బీజేపీకి ఎవరూ కొత్తగా మిత్రపక్షాలయ్యే అవకాశం లేదు. 2019లో బీజేపీకి వచ్చే మొదటి చాలెంజ్ మిత్రులను వెదుక్కోవడమే. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వందకుపైగా సీట్లు తగ్గిపోతాయి. ఈ సీట్లను భర్తీ చేసే మిత్రపక్షాలు ఇప్పుడు బీజేపీకి కావాలి. కానీ ఇప్పుడు అలాంటి మిత్రులెవరూ బీజేపీ దగ్గరకు వచ్చే వాళ్లు లేరు. ఎవరైనా వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో వస్తారు. అక్కడ ఒకటి, రెండు సీట్లు మినహా ప్రభావం ఉండదు. 2019లో మిత్రులే బీజేపీ ఫేట్‌ను నిర్ణయించబోతున్నారు.