సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మను రెండో సారి హడావుడిగా తొలగించడంపై మరో సారి రచ్చ జరుగుతోంది. మనస్థాపానికి గురైన అలోక్ వర్మ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే సమయంలో మీడియా.. ఈ వ్యవహారం మొత్తాన్ని సీబీఐ వర్సెస్ సీబీఐ అన్నట్లుగా చెప్పుకొస్తోంది. నిజానికి.. ఇది సీబీఐ వర్సెస్ సీబీఐ కాదు. సీబీఐ వర్సెస్ ప్రధానమంత్రి కార్యాలయం. సీబీఐ కి.. ప్రధానమంత్రి కార్యాలయానికి మధ్య జరుగుతున్న ఓ రచ్చగానే దీన్ని పరిగణించాలి.
ప్రధానమంత్రికి నైతిక విలువలు ఉండవా..?
సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మను తొలగించడానికి కారణం రాకేష్ ఆస్థానా. ఈ రాకేష్ ఆస్థానా గుజరాత్ కు చెందిన ఐపీఎస్ అధికారి. మోడీకి అత్యంత సన్నిహితునిగా పేరు పడ్డారు. అదే సమయంలో గుజరాత్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి అధికారిని మోడీ తీసుకొచ్చి సీబీఐ స్పెషల్ డైరక్టర్‌గా నియమించారు. ఆ తర్వాత అలోక్ వర్మ, ఆస్థానా మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఆ సమయంలో… చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కు … అలోక్ వర్మపై.. రాకేష్ ఆస్థానా ఫిర్యాదు చేశారు. నిజానికి అప్పటికే.. రాకేష్ ఆస్థానాపై.. సీబీఐ విచారణ కూడా ప్రారంభించింది. రాకేష్ ఆస్థానా పీఎంవో… తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా.. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ థోవల్ ఈ వ్యవహారాలన్నీ చక్క బెడుతున్నారు. అలోక్ వర్మ.. దర్యాప్తు చేస్తున్న కేసుల్లో ఓ కేసు.. పీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికారిపై ఉంది. ఆ అధికారి బొగ్గు గనుల కేటాయంపులో దర్యాప్తును ఎదుర్కొంటున్నారు కూడా. అంటే.. ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఓ వ్యక్తి పై సీబీఐ విచారణ జరుగుతూంటే.. అదే పీఎంవో… సీబీఐ డైరక్టర్‌పై ఎలా చర్యలు తీసుకుంటుంది..?
పీఎంవోపై దర్యాప్తు చేస్తున్న అధికారిని ప్రధాని ఎలా తప్పిస్తారు..?
అదే సమయంలో రాఫెల్ డీల్‌కు సంబంధించిన విచారణను.. అలోక్ వర్మ ప్రారంభించబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ రాఫెల్ డీల్‌ను కుదుర్చుకుంది.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అలోక్ వర్మ విచారణ ప్రారంభిస్తే.. మొట్టమొదటగా.. ప్రశ్నించేది నరేంద్రమోడీనే. అదే సమయంలో… పీఎంవోలోని కీలక అధికారిపై.. బొగ్గు గనుల కేటాయింపు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న కమిటీ.. అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడ న్యాయమా..?. నేరుగా పీఎంవోపైనే ఆరోపణలు ఉన్నాయి. సీవీసీపై ఆరోపణలు ఉన్నాయి. కొత్త సీబీఐ డైరక్టర్ పైనా ఆరోపణలు ఉన్నాయి. ఇంత గందరగోళంలోనూ… ప్రధానమంత్రి కార్యాలయం ఎందుకు.. ఇంత హడావుడి పడింది. అసలు అలా నిర్ణయం తీసుకోవడం నైతికతేనా..?
సుప్రీంకోర్టు జడ్జి చూపించిన నైతికత కూడా ప్రధాని చూపలేరా..?
ఉదాహరణకు.. మూడు రోజుల కిందట.. అయోధ్య విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ ధర్మాసనంలో .. జస్టిస్ ఉదయ్ లలిత్ కూడా ఉన్నారు. ఆయన అయోధ్య కేసులో .. ఒకప్పుడు నిందితునిగా ఉన్న కల్యాణ్ సింగ్ తరపున వాదించారు. అప్పుడెప్పుడో అలా వాదించిన లాయర్ .. ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎలా ఉంటారని.. న్యాయవాది ప్రశ్నించగానే ఆయన ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. మరి… ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వైఖరి తీసుకుంటే… పీఎంవోపై వేరుగా విచారణ జరుపుతున్న సీబీఐ డైరక్టర్ పై.. ప్రధాని ఎందుకు ఇలా ఆలోచించలేకపోయారు. నైతికతకు సంబంధించిన అంశం అది. తనకు సంబంధించిన రాఫెల్ డీల్ పైన.. తన కార్యాలయంలోని.. ఓ ఉన్నతాధికారిపై విచారణ జరుగుతున్నప్పుడు… ప్రధాని… నైతికంగా ప్రవర్తించి ఉండాల్సింది. పైగా.. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. నెలాఖరులో ఆయన రిటైర్ అవుతారు. ఉన్న పళంగా సీబీఐ డైరక్టర్ పదవి నుంచి ఆయనను తప్పించుకపోయినా పోయేదేమీ లేదు.
లోక్‌పాల్ బిల్లు నాలుగున్నరేళ్లయినా ఎందుకు అమలు చేయలేదు..?
సీబీఐ డైరక్టర్ లాంటి పోస్టుల నియామాకాలు.. సంబంధించి ప్రధానమంత్రి అధ్యక్షతన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేత కలిసి.. కమిటీ ఉంటుంది. పీఎం లేకపోతే.. ఈ కమిటీ ఉండదు కదా.. అనే సందేహం రావొచ్చు. అందుకే.. ఇలాంటి.. అత్యున్నత స్థాయి అధికారులపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరపడానికి లోక్ పాల్ అనే వ్యవస్థ ఉండాలని ప్రతిపాదించారు. అన్నాహజారే ఉద్యమం చేసినప్పుడు.. ఈ లోక్ పాల్ బిల్లును… కేంద్రం ఆమోదించింది. భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని సమర్థించింది. 2014 ముందు అందరూ మాట్లాడారు. తర్వాత ఎవరూ మాట్లాడటం లేదు. సీవీసీపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎవరు దర్యాప్తు చేస్తారు..? రాకేష్ ఆస్థానా అనే అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా విచారణ జరపకుండానే అలోక్ వర్మపై వేటు వేశారు. ఇది ఒక్కటే కాదు.. ఈడీ, ఆర్బీఐ, సీబీఐ డైరక్టర్ అందర్నీ మోడీనే నియమించారు. వారికి ఉపయోగపడినంత కాలం భరించారు. ఉపయోగపడనప్పుడు.. బయటకు నెట్టేస్తారు. అందుకే.. ఇప్పుడు జరుగుతోంది.. సీబీఐ వర్సెస్ పీఎంవో.