తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో ధర్మపోరాట దీక్షలు, నవనిర్మాణ దీక్షల్లో.. భారతీయ జనతా పార్టీ తనపై, రాష్ట్రంపై కుట్ర చేస్తోందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ కుట్రల్లో వైసీపీ అధినేత జగన్ తో పాటు… జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా అనేక మంది భాగమయ్యారని ఆరోపిస్తున్నారు. దాదాపుగా ప్రతీ రోజూ ఈ కుట్రలపై ప్రజలకు వివరిస్తున్నారు.
ఈ కుట్ర సిద్ధాంతం వల్ల ఉపయోగం ఏమిటి..?
చంద్రబాబు పదే పదే చెబుతున్న కుట్ర సిద్ధాంతం వల్ల నిజంగానే ఉపయోగం ఉంటుందా..?. అంటే ఉండదనే చెప్పాలి. చంద్రబాబుపై అలిపిరి దాడి జరిగిన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ అప్పుడు సానుభూతి పవనాలు వీయలేదు. సింపతీ ఫ్యాక్టర్ అప్పుడు పని చేయలేదు. అప్పుడు నిజంగానే దాడి జరిగింది. కానీ ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు పదే పదే చెబుతున్న కుట్ర సిద్ధాంతం ఎంతవరకు ఉపయోగపడుతుంది..?.ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తనపై, ప్రభుత్వంపై, రాష్ట్రంపై కుట్ర జరుగుతోందని అని చెప్పారంటే… కొన్ని ఆధారాలు ఉండాలి. కానీ చంద్రబాబు ఎలాంటి ఆధారాలు లేకుండా.. ఆపరేషన్ గరుడ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిర్ధిష్టమైన ఆధారాలు చూపించాల్సిన ప్రభుత్వాధినేతే .. పదే పదే గరుడ ఆరోపణలు చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి నిస్సహాయస్థితిని తెలియజేస్తోంది.
చంద్రబాబు కుట్రలపై ఎంత చెప్పినా… ఓటర్లపై దాని ప్రభావం పెద్దగా ఉండదు. చంద్రబాబుపై కుట్ర జరుగుతోందని.. ఆయనకు అండగా ఉందామని.. తెలుగుదేశం పార్టీ ఓటర్లు మాత్రమే వస్తారుతప్ప.. తటస్థ ఓటర్లు కూడా ఎవరూ రారు. అలిపిరి దాడి లాంటి ఘటన జరినప్పుడే రాని వాళ్లు.. ఇప్పుడు వస్తారా..? ప్రభుత్వ పనితరు ఆధారంగా ఓట్లు పడతాయి కానీ.. తన మీద కుట్ర జరుగుతోందని.. ముఖ్యమంత్రి ఆరోపిస్తే.. ఓట్లు పడవు.
బీజేపీ చేస్తున్న కుట్ర ఏమిటి.. ?
చంద్రబాబు చెబుతున్నట్లుగా బీజేప చేస్తున్న కుట్ర ఏమిటనేది ఎవరికీ తెలియదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను… బీజేపీ తన వైపునకు లాక్కుని.. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తోందా..?..ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం చేస్తే… అంతకంటే బీజేపీ చేసే పిచ్చి పని ఇంకోకటి ఉండదని భావిస్తాను. ఒక వేళ అలాంటి ప్లాన్ బీజేపీ అమలు చేసినా.. ప్రజల్లో చంద్రబాబుపై సానుభూతి రాదు. ఎందుకంటే… చంద్రబాబు ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేల్ని పలువుర్ని తన పార్టీలో చేర్చుకున్నారు. బీజేపీ.. ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు కానీ.. ఒక్క తిరుపతి ఇష్యూలో మాత్రం బీజేపీ .. చంద్రబాబునాయుడుని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. అలాగని.. రోడ్ల మీదకు వచ్చి…ధర్నాలు చేయలేదు. రమణదీక్షితులకు మద్దతుగా ఆ పార్టీ నేతలు మాత్రం ప్రకటనలు చేస్తున్నారు. అంతే కానీ కుట్ర కాదు.
చంద్రబాబుపై కేంద్ర సంస్థల్ని ప్రయోగిస్తారా..?
చంద్రబాబు చేస్తున్న కుట్ర ఆరోపణల్లో… సీబీఐ, ఈడీ లాంటి వాటితో ఇబ్బంది పెట్టడం ఉందేమో అన్న సందేహం ఉంది. నిజంగా ఇలాంటి కుట్ర జరిగితే.. చంద్రబాబుకు కచ్చితంగా కలిసొస్తుంది. బీహార్ లో ఆర్జేడీ, ఏపీలో జగన్మోహన్ రెడ్డి దీనికి సాక్ష్యాలు. వీరిపై కేసులు నమోదైనా.. జైలుకు వెళ్లినా వీరికి ప్రజల్లో సానుభూతి వచ్చింది. సీబీఐ కేసులు లాంటివి నమోదు చేస్తే.. కచ్చితంగా కుట్ర చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కేంద్ర సంస్థలను ప్రయోగిస్తే… తాత్కలికంగా బీజేపీకి ఉపయోగపడినా.. దీర్ఖకాలంలో మాత్రం చంద్రబాబుకు ప్రయోజనం కలుగుతుంది. దీనిపై చంద్రబాబు ఆందోళన చెందాల్సిన పని లేదు.
అందర్నీ కుట్రలో భాగం చేయడమెందుకు..?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఓ ప్రధాన పార్టీ కాదు. ప్రధాన ప్రతిపక్షం కాదు. అలాంటప్పుడు బీజేపీపై పెద్ద ఎత్తున ఎటాక్ చేయడం ఎందుకు..?. పవన్ కల్యాణ్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అందరూ కుట్రలో భాగమనే చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిజానికి కుట్రలో భాగమైన వారందరూ విడివిడిగా పోటీ చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. చంద్రబాబుకు లాభం కలుగుతుంది. ఇవన్నీ ఆలోచించకుండా.. పదే పదే తనపై కుట్ర జరుగుతోందని.. అందరూ కలిసి తనపై కుట్ర పన్నుతున్నారని పదే పదే ఆరోపిస్తే.. వాళ్ల ఓట్లన్నీ.. కన్సాలిటేడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జనసేన, బీజేపీ ఓట్లు కలసిపోయేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. దీని వల్ల చంద్రబాబుకే నష్టం జరుగుతుంది. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో ఏముందో తెలియదు కానీ.. పదే పదే ఈ కుట్ర సిద్ధాంతం వల్లే వెయడం వల్ల చంద్రబాబుకు నష్టమే.
సీబీఐ మాజీ జేడీపై అప్పుడే విమర్శలు ఎందుకు..?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఇంత వరకూ రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయినా ఆయనను కూడా ఇందులో కలిపేస్తున్నారు. లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి.. ఒక సారి చంద్రబాబుపై విమర్శలు చేస్తే… ప్రతి విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది. లక్ష్మినారాయణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. బీజేపీకి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడలేదు. అయినా రాజకీయాల్లోకి లేని వాళ్ల గురించి ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారు..? ఏపీ రాజకీయాల్లో బీజేపీ అసలు ఓ ఫోర్సే కాదు.
ప్రత్యేకహోదాను ప్రజల్లోకి తీసుకెళ్తేనే ప్రయోజనం..!
గవర్నర్ రాజ్ భవన్ రాజకీయాలు చేసి.. పవన్ కల్యాణ్ ద్వారా కుట్ర చేస్తున్నారని ఎందుకు నమ్ముతారు. అమిత్ షా పార్టీని విలీనం చేయమంటేనే చేయలేదని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు నరసింహన్ చెబితే వింటారా..?. చంద్రబాబు అసలు ఏపీ రాజకీయాల్లో లేని బీజేపీని ఓ మహాశక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీ ప్రత్యేకహోదా హామీని అమలు చేయలేదు అనే అంశంతో ప్రజల్లోకి వెళ్లవచ్చు. ఎందుకంటే… అది ప్రజలు ఫీలవుతున్నారు. దాని మీద ప్రజల్లోకి వెళ్తే స్పందిస్తారు. ఆ ఇష్యూ వదిలేసి.. రాజకీయ కుట్రల పేరుతో రోజూ మాట్లాడితే.. ప్రజలందరూ అది ఆయన భ్రమ అనుకునే ప్రమాదం అంది. అది ఆయనకే రాజకీయంగా నష్టం చేకూరుస్తుంది.