ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీయేతర పార్టీలు… మరింత యాక్టివ్ అవుతున్నాయి. కూటమి కట్టినట్లుగా.. కట్టనట్లుగా ఉంటున్నా.. అంతా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోల్‌కతాలో 19వ తేదీన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇదొక్కటే కాదు… దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీకలిపి పదమూడు ర్యాలీలు నిర్వహిస్తామని చెబుతున్నాయి. అయితే.. అన్ని పార్టీలు కూటమిలోకి కలసు వస్తున్నాయా.. అంటే లేదనే చెప్పాలి.
యూపీలో కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వ్యూహమా..?
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ లేకుండానే మహాకూటమి ఏర్పడింది. ఎస్పీ, బీఎస్పీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. సీట్లను పంచుకున్నాయి. కొత్తగా రాష్ట్రీయ లోక్ దళ్ కూడా.. అందులో చేరింది. కానీ.. కాంగ్రెస్ పార్టీని మాత్రం కూటమిలో చేర్చుకోలేదు. కానీ… సోనియా , రాహుల్ గాంధీ నియోజకవర్గాలైనా.. రాయ్ బరేలీ, అమేథీలను.. కాంగ్రెస్ పార్టీకి వదిలేశారు. అంటే కూటమిలో లేకపోయినా.. కాంగ్రెస పార్టీకి రెండు స్థానాలు కేటాయించారు. విపక్షాలన్నీ కలిస్తే.. యూపీలో బీజేపీని ఓడించవచ్చని అందరూ నమ్ముతున్నారు. ఉపఎన్నికల్లో అదే నిరూపితమయింది కూడా. అయితే.. ఈ కూటమిలో ఎస్పీ – బీఎస్పీ మాత్రమే ఉన్నా.. బీజేపీని ఓడించగలవన్న అంచనా ఉంది. అదే సమయంలో… కాంగ్రెస్ ఉంటే.. మరిన్ని మంచి ఫలితాలొస్తాయనుకున్నారు. కానీ కాంగ్రెస్ కూటమిలో లేకపోవడం కూడా ఓ వ్యూహమేనని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు యూపీలో సంప్రదాయంగా అగ్రవర్ణాలు ఓటర్లుగా ఉన్నారు. కాంగ్రెస్ కూటమిలో ఉంటే.. ఆ ఓట్లు వివిధ కారణాలతో.. బీజేపీకి పడతాయి. అప్పుడు బీజేపీకి పడే ఓట్లు కన్సాలిడేట్ అవుతాయి. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వల్ల.. అగ్రవర్ణాల ఓట్లు చీలుతాయి. దీని వల్ల బీజేపీకి నష్టం జరుగుతుంది. ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణాల ఓటింగ్ కోల్పోయిది. అందుకే.. ఆర్థికంగా వెనుకబడిన వారి కోటాను తీసుకొచ్చారు. అందుకే… ఎస్పీ, బీఎస్పీలతో కాకుండా.. విడిగా కాంగ్రెస్ పోటీ చేయడం వల్లే లాభం అని కూటమి భావించినట్లు తెలుస్తోంది. 2019 తరవాత ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ కలిసే అవకాశం ఉంటుంది.
ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తోనే ఉంటాయా…?
ప్రాంతీయ పార్టీల రాజకీయం… పూర్తిగా… జాతీయ పార్టీలు తమ ప్రత్యర్థులుగా ఎవరు ఉన్నారన్న అంశం ఆధారంగానే రాజకీయాలు జరుపుతాయి. అంటే.. ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీనే ప్రత్యర్థి కాబట్టి.. బీజేపీనే వ్యతిరేకిస్తాయి. కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటాయి. బెంగాల్లో కూడా… మమతా బెనర్జీకి… బీజేపీనే ప్రధాన శత్రువు. ఆ పార్టీనే టార్గెట్ చేసుకుటుంది. అలా అని ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌తో జత కట్టే పరిస్థితి లేదు. అందుకే.. కోల్ కతాలో జరిగే ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరూ హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా.. 2019 ఎన్నికలకు ముందుగా.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి ఏర్పటయ్యే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్ పరిణామాలను చూస్తే.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ.. విడివిడిగా పోటీ చేసినా.. కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమీ లేదు. ఎన్నికల తర్వాత వారంతా కాంగ్రెస్ పార్టీతోనే సన్నిహితంగా మెలిగే అవకాశాలు ఉన్నాయి.
చంద్రబాబు ప్రయత్నిస్తున్న కూటమి ఎందుకు సఫలం కాదు..?
అయితే చంద్రబాబునాయుడు… కాంగ్రెస్ నాయకత్వంలో కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రయత్నాలు ఫలించే అవకాశాలు వంద శాతం లేవు. ఎందుకంటే.. దీనికి ఉత్తరప్రదేస్ పరిణామాలే కాదు.. బీహార్ పరిణామాలు కూడా ఇదే చెబుతున్నాయి. తేజస్వియాదవ్… ఎస్పీ, బీఎస్పీలను తమ కూటమిలోకి ఆహ్వానించారు. బీహార్‌లో అందరూ కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆర్జేడీ కూడా అంగీకరించడం లేదు. వచ్చే ఎన్నికల తర్వాత… కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్.. అటు కాంగ్రెస్‌కో ఇటు బీజేపీకో మద్దతివ్వాలి. అలాగే.. ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తోసన్నిహితంగా వ్యవహరిస్తున్నా.. ఎన్నికల తర్వాతే అసలైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఏ విధంగా చూసినా… కాంగ్రెస్ నేతృత్వంలో.. ఎన్నికల ముందు కూటమి ఏర్పడే అవకాశం కనిపించడం లేదు. ఏపీ , బెంగాల్, బీహార్తోసహా… అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ మైనర్ పార్టనర్. మైనర్ పార్టనర్ నేతృత్వంలో… ప్రాంతీయ పార్టీలు నడవడానికి సిద్ధంగా ఉండవు.