కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్ల నుంచి.. కాపులకు ఐదు శాతం కోటా కల్పించాలని… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. దీనిపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ సీఎం.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలో.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించగలరా అన్న చర్చ.. అంతటా నడుస్తోంది.
కాపులకు ప్రత్యేకకోటా కల్పించాలంటే లెక్క లేనన్ని సవాళ్లు..!
పెన్షన్లు రూ. రెండు వేలు చేయడం, డ్వాక్రా సంఘాలకు రూ. పదివేలు పంపిణీ చేయడం లాంటిది కాదు… కాపులకు రిజర్వేషన్లు కల్పించడం. అది ఓ చట్టం.. దాన్ని రాజ్యాంగ పరంగా.. అమలు చేయాల్సి ఉంటుంది. పెన్షన్ల పెంపును.. ఎలా అయినా చేసుకోవచ్చు. దానికి ఎలాంటి రూల్స్ లేవు. కానీ అసలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించడం.. రాజ్యాంగబద్ధమేనా అన్న ప్రశ్న ఉంది. ముందుగా ఈ విషయంపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో తెలియదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడా.. ఆర్థిక పరంగా రిజర్వేషన్లు కల్పించాలే ప్రతిపాదన లేదు. కేంద్రం పాస్ చేసిన బిల్లులో కూడా ఎక్కడా సామాజిక కోణం ప్రస్తావన లేదు. అందుకే ఈ బిల్లును సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా… రాజ్యాంగం అంగీకరిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. జస్టిస్ చలమేశ్వర్ లాంటి వాళ్లు కూడా ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసులో.. ఆర్థిక అయోగ్యత అనేది… రిజర్వేషన్ల ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. అదే సమయంలో… ఇలా చేయడానికి ఏపీకి అధికారం ఉందా అనే మరో సందేహం. ఎస్సీ వర్గీకరణ అంతకు ముందు ఏపీ చేసింది. కానీ సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఆ అధికారం ఏపీకి లేదని స్పష్టం చేసింది. అంటే… అసలు.. కేంద్రం చేసిన చట్టాన్ని కోర్టులు అంగీకరిస్తాయా… ? … ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలో మళ్లీ సామాజిక కోణంతో.. కోటా కల్పించడాన్ని అంగీకరిస్తాయా..? అన్నవి కీలకమైన ప్రశ్నలు వస్తున్నాయి.
రాజ్యాంగాన్ని, కోర్టుల్ని ఒప్పించగలగాలి..!
రాజకీయంగా బలీయమైన వర్గం.. రిజర్వేషన్ల కోసం తమను తాము వెనుకబడిన వర్గంగా ప్రకటించుకుంటే… రిజర్వేషన్లకు అర్హత ఉండకూడదని ప్రకటించింది. కాపులకు కూడా ఈ తీర్పు వర్తించే అవకాశం ఉంది. ఇప్పుడు రాజకీయ అంశం. కాపులను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు… రిజర్వేషన్ల హామీలు ఇస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ఆదరణ పొందడానికి… చంద్రబాబు రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. వారు రాజకీయంగా బలంగాఉన్నారు కాబట్టి.. వారికి సుప్రీంకోర్టు తీర్పు వర్తించే అవకాశం ఉంది. అలాగే.. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 16(4) ప్రకారం… ప్రాతిపదిక ఉన్నప్పుడే రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు కాపులకు చాలినంత రిజర్వేషన్ లేదన్న ప్రాతిపదికను… నిరూపించగలగాలి. జనాభా ఎక్కువ ఉండటం ప్రాతిపదిక కాదు. ఆర్థికంగా వెనుకబడ్డారా.. ? విద్యా, ఉద్యోగాల్లో.. వారికి ఇతర కులాలతో పోలిస్తే.. సరైన స్థానం కల్పంచాల్సి ఉందా.. అన్న అంశానికి ప్రాతిపదిక ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమా..?
పైగా… కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు తెచ్చింది. ఇప్పుడు.. ఏ చట్టం లేకుండా.. కేవలం మంత్రి వర్గ ఆమోదం ద్వారా.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ చట్టంలో మార్పులు చేస్తే చెల్లుతుందా..?. పది కోటాలో… ఐదు శాతం ఇస్తామంటే… కాపు కార్పొరేషన్ పెట్టి… కొన్ని వేల కోట్లు కేటాయించినట్లు కాదు. ఇప్పటికి జీవో జారీ చేసినా… ఇది కచ్చితంగా… అనేక న్యాయ, రాజ్యాంగపరమైన సవాళ్లు ఉన్న అంశం. ఇది అంత తేలిక కాదు.