తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు… తెలంగాణలో ప్రచారానికి సిద్ధమయ్యారు. మరో టీడీపీని ఆంధ్రా పార్టీ అంటున్న టీఆర్ఎస్ తెలంగాణలో ఆ పార్టీకి ఏం పని అని విమర్శలు చేస్తోంది. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది టీడీపీ కాబట్టి.. తెలంగాణలో టీడీపీ ఉంటుందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అసలు తెలంగాణలో తెలుగుదేశం ఉండాలా వద్దా అన్నది 2014లోనే చర్చ వచ్చింది. నిజం చెప్పాలంటే.. అప్పుడే కీలకమైన చర్చ జరిగింది.
జాతీయ పార్టీ అయినా రాష్ట్రాల వారీగానే విధానాలు..!?
భారతదేశంలో.. అనేక రాజకీయ పార్టీలు అనేక చోట్ల ఉంటాయి. మహారాష్ట్రలో శివసేన ఉంది. శివసేన విధానం… మహారాష్ట్రలో మరాఠీయులు మాత్రమే ఉండాలనేది శివసేన వాదన. భివాండిలో ఉన్న తెలుగువారిపైన దాడులు జరిగితే పొట్ట చేత పట్టుకు.. ఆ రోజుల్లో మన రాష్ట్రానికి తిరిగి వచ్చిన పరిస్థితులు చూశాం. అలాగే.. బీహారీలు.. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షలు రాయడానికి వెళ్లిన దక్షిణాది వారిపై దాడులు చేయడం చూశాం. మరి.. శివసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతోంది. మరి ఈ ప్రశ్న బీజేపీని అడగలమా..? అలాంటి శివసేన ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది. ఎంత చిన్నదైనా పొత్తు పెట్టుకున్న పార్టీ ఉంది కదా..? మహారాష్ట్ర మరాఠాలకే అన్న పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో తెలుగువారిపై దాడులు చేసిన పార్టీతో పొత్తు పెట్టుకుని… ఏపీ, తెలంగాణలో మీరు ఎట్లా ఉంటారని… వాళ్లని అడిగితే ఆన్సర్ ఉంటుందా..? ఉండదు కదా..! అలాగే గుజరాత్ లో … యూపీ, బీహార్ల వాసులపై దాడులు జరుగుతున్నాయి. బీహార్ లో… ఉత్తరప్రదేశ్ వాసులపై దాడులు జరుగుతున్నప్పుడు.. గుజరాత్ వ్యక్తి ప్రధానిగా ఉంటే మాకు ఎలా రక్షణ ఉంటుందని ఎవరైనా అడగొచ్చా..? తప్పు కదా.. అది.
ఏ పార్టీ అయినా తమ రాష్ట్రానికే నేతల మద్దతు.. !
బీజేపీ జాతీయ పార్టీలుగా చెప్పబడే పార్టీలు… ఆయా రాష్ట్రాలను బట్టి విధానాలు మార్చుకుంటున్నాయి. ఉదాహరణకు కర్ణాకటలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కావేరి నీటిని కిందకు వదల వద్దు అంటాయి. అదే తమిళనాడులో అవే పార్టీల నేతలు వదలాలి అంటారు. అంటే.. రాష్ట్రానికో వైఖరి తీసుకుంటున్నాయన్నమాట. అలాగే కృష్ణా జలాల విషయంలో… పొరుగు రాష్ట్రాల్లోని… కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు.. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేయలేదా..? . అందువల్ల రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రయోజనాల కోసం పని చేస్తుంది కాబట్టి.. తెలంగాణలో ఆ పార్టీకి స్థానం ఎందుకన్న ప్రశ్నకు సమాధానంగా ఇవన్నీ చెప్పాను. మహాకూటమి అధికారంలోకి వస్తే.. చంద్రబాబునాయుడు కృష్ణా నీళ్లన్నింటిని తీసుకెళ్తారు…అప్పుడు ఏం చేస్తారు..? అని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి.. ఇదే ప్రశ్నలను ఇతర పార్టీలను కూడా అడగాల్సి ఉంటుంది.
దేశంలో ఎక్కువ కుటుంబ పార్టీలే..!
తెలుగుదేశం పార్టీ పై ఉన్న ప్రధానమైన విమర్శ ఏమిటంటే… కుటుంబ పార్టీ. ఆ మాటకొస్తే ఇవాళ భారతదేశంలోని చాలా పార్టీలు కుటుంబాల ఆధీనంలో ఉన్నాయి. అంటే..ఓ రకంగా ఆధునిక రాచరికంలో బతుకుతున్నాం. ఈ ఆధునిక రాచరికంలో చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత లోకేష్ … లేకపోతే.. వాళ్ల కుటుంబసభ్యులు టీడీపీలో నెంబర్ వన్ అవుతారు తప్ప… తెలంగాణకు చెందిన నేత నెంబర్ వన్ కాలేరు. ఎల్.రమణ తెలుగుదేశం పార్టీలో నెంబర్ కాగలరా..?. అలాగే టీఆర్ఎస్ కూడా. కేసీఆర్ కు వారసుడిగా కేటీఆర్ ఉంటారు తప్ప.. మరొకరు ఉండరు. అందువల్ల.. ఇది.. ఆ రాజకీయ పార్టీ స్వభావం ఇది. ఇక.. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఆంధ్రా నాయకత్వంలో ఉంటుంది.. అలాంటి నాయకత్వం ఉన్న పార్టీ కింద తెలంగాణ నేతలు ఎందుకుండాలన్న వాదన మరికొంత మంది తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి.. టీడీపీ అధినేత.. కేసీఆర్ తో పొత్తుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని చంద్రబాబేచెప్పారు. ఇలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఇలా చెప్పడం మహాకూటమిని బలహీనపర్చడమే.
టీడీపీ ఉండాలో వద్దో .. టీఆర్ఎస్ ఎలా నిర్ణయిస్తుంది..?
చంద్రబాబు ప్రచారం ప్రారంభిస్తే.. ఓ ఇబ్బంది కూడా టీడీపీకి ..మహాకూటమికి ఉంది. చంద్రబాబు ప్రచారం ప్రారంభిస్తే.. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎందుకు లేఖలు రాశారన్న అంశం తెరపైకి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నింటికి అనుమతులివ్వమని మళ్లీ లేఖలు రాస్తారా.. అన్న డిమాండ్లు వినిపిస్తాయి. ఒక వేళ ఏదైనా ఎన్నికల ప్రచారంలో మాట్లాడితే.. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే ఏపీలో.. ఏపీకి అనుకూలంగా మాట్లాడితే తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కుంటుందో… టీడీపీ తేల్చుకోవాలి. టీడీపీకి గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. లక్షల సంఖ్యలో ఓట్లు వచ్చాయి. తెలంగాణలో టీడీపీ ఉండాలా వద్దా అని నిర్ణయించేది.. టీఆర్ఎస్ కాదు..మరో పార్టీ కాదు. తెలంగాణ ప్రజలు మాత్రమే. అందువల్ల ఒక పార్టీ మనుగడను.. మరో పార్టీ డిసైడ్ చేయకూడదు.
టీడీపీ ఉండాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారు..!
తెలుగుదేశం పార్టీ.. మేం తెలంగాణలో ఓబీసీల దగ్గరకు అధికారాన్ని తీసుకొచ్చాం. మండల వ్యవస్థను పెట్టాం. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేశాం. ఆ మాటకొస్తే.. కేసీఆర్ టీడీపీలో పుట్టి పెరిగారు. తన కుమారుడికి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో టీడీపీ వ్యూహకర్త కేసీఆర్. 2009లో పొత్తు పెట్టుకున్నప్పుడు.. మేం తెలంగాణ వ్యతిరేక పార్టీ కాదా..? అని టీడీపీ నేతల సంధిస్తున్న ప్రశ్నలకు టీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదు. సమాధానం చెప్పినా అది సంతృప్తికరం కాదు. తెలుగుదేశానికి తెలంగాణలో స్థానం ఉండాలో లేదో… ప్రజలు నిర్ణయిస్తారు. 2014లో స్థానం ఉందని ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టే.. టీడీపీ ఉంది. వద్దు అనుకుంటే.. ఆ తీర్పును 2018లో ఇస్తారు. స్థానం లేదు అనుకుంటే టీడీపీ పోటీ చేయడం మానేస్తుంది. అంతే కాని.. తెలంగాణలో టీడీపీ ఉండాలా వద్దా అని నిర్ణయించేది టీఆర్ఎస్సో.. కేసీఆర్నో కాదు..!