తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం.. రకరకాల ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వీటన్నింటినీ సమీకరించి చూస్తే.. హంగ్ వచ్చే వాతావరణాన్ని తోసిపుచ్చలేము. టీఆర్ఎస్ , కూటమి ప్రధాన పార్టీలుగా నిలబడినా.. ఎంఐఎం, బీజేపీ, స్వతంత్రులు అందరూ కలిసి దాదాపుగా ఇరవై స్థానాలు గెలుచుకుంటారన్న అంచనాలు ఉన్నాయి. ఇలాంటి హంగ్ ఏర్పడితే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం .. ఎక్కువగా కేసీఆర్‌కే ఉంది. ఈ విషయంలో ఆయనకు అడ్వాంటేజ్ ఉంది.
50 సీట్లు వస్తే కేసీఆర్ అధికారాన్ని అందుకుంటారా..?
హంగ్ వచ్చినప్పుడు.. ఏ ఏ పార్టీలు కలవగలవన్నది ఇక్కడ ముఖ్యం. కర్ణాటకలో హంగ్ ఏర్పడి.. జేడీఎస్ కాంగ్రెస్‌తో కలవగలిగింది. బీజేపీ కలవలేకపోయింది. తెలంగాణ రాజకీయాలకు వచ్చినప్పుడు.. ఎంఐఎం పై అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఏడు ఉన్నాయి. ఈ సారి ఎనిమిది రావొచ్చని కొంత మంది అంటున్నారు. ఎంఐఎం మొదటి నుంచి టీఆర్ఎస్కే మద్దతు ప్రకటిస్తోంది. టీఆర్ఎస్కు 52 నుంచి 54 వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. ఇక బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించదు. ఏమైనా ఉంటే న్యూట్రల్ గా ఉటుంది. ఏది ఉన్నా… ఏది లేకపోయినా.. బీజేపీ, మజ్లిస్‌లు.. ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా అయినా… ఒకరు ప్రత్యక్షంగా .. మరొకరు పరోక్షంగా అయినా.. కేసీఆర్‌కు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఇండిపెండెంట్లు కూడా కలసి వస్తారు. ఎందుకంటే.. స్వతంత్రులు.. ఎవరి ప్రభుత్వం ఏర్పడితే వారితో కలసి వెళ్తారు.
కేంద్రంలో ప్రభుత్వం మారితే పరిస్థితి ఎలా ఉంటుంది..?
అయితే హంగ్ వస్తే.. పరిస్థితి ఎప్పటిలా ఉంటుందని చెప్పలేము. రేపు ఢిల్లీలో ప్రభుత్వం మారితే పరిస్థితులు తారుమారవుతాయి. ఏ పార్టీలో ఏ ముసలం అయినా పుట్టొచ్చు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. బీజేపీలో.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌లో ఈ ముసలం పుట్టొచ్చు. హంగ్‌లో కూడా.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది కీలకంగా మారుతుంది. పైగా నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణ ఉన్న పదిహేడు సీట్లు.. అటు కాంగ్రెస్ .. ఇటు బీజేపీలకు కీలకం. అలా జరగాలంటే.. ఇక్కడ అధికారంలో ఉండాలి.. లేకపోతే.. అధికార భాగస్వామ్యంలో అయినా ఉండాలి. అందుకే.. తమకు ఎక్కువ సీట్లు వచ్చినా… ఇతర పార్టీలకు… లేదా.. ఇతర పార్టీలను చీల్చుకుని వచ్చిన వారికి.. మద్దతు ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కర్ణాటకలో బీజేపీ అలాంటి ప్రయత్నాలు చేసిందని విన్నాం. అందుకే హంగ్ అంటూ… పరిణామాలు ఏ రూపమైన తీసుకోవచ్చు. కానీ అడ్వాంటేజ్ మాత్రం టీఆర్ఎస్కు ఉంటుంది.
కర్ణాటక తరహాలో హరీష్ సీఎం అయినా ఆశ్చర్యం లేదా..?
ఎంఐఎం, బీజేపీలు.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కలసికట్టుగా మద్దతిస్తాయా…? అన్నది చాలా మందికి ఉన్న సందేహం. ఆ పార్టీలు కలసి మద్దతు ఇవ్వవు కానీ.. వేర్వేరుగా వేర్వేరు విధానాల్లో మద్దతుగా నిలుస్తాయి. ఎంఐఎం మద్దతుగా నిలిచి.. బీజేపీ న్యూట్రల్ అంటూ.. ఓటింగ్‌ను బహిష్కరించినా… టీఆర్ఎస్కు మద్దతు పలికినట్లే. రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు. అలా కాకపోయినా.. బీజేపీ, ఎంఐఎం ఇద్దరూ పరోక్షంగా టీఆర్ఎస్కు సపోర్ట్ చేయవచ్చు. రెండూ ఓటింగ్ కు దూరమైనా… రెండూ పరోక్షంగా మద్దతు పలికినట్లే అవుతుంది. కర్ణాటకలో జరిగినట్లుగా… తెలంగాణలో కూడా.. అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా లేదా అనేది.. ఆయా రాజకీయ పార్టీలకు లభించే ఓట్ల మీద ఆధార పడి ఉంటుంది. గతంలో మహాకూటమి నేతలు… తెలంగాణలో హంగ్ వస్తే.. హరీష్ రావు ముఖ్యమంత్రి … అవుతారంటూ.. మహాకూటమికి చెందిన కొంత మంది నేతలు ప్రకటించారు. రాజకీయాల్లో ఏ పనికైనా.. ఎవరైనా సిద్ధం. కాంగ్రెస్ పార్టీకి అధికారం కన్నా.. 2019 లోక్ సభ ఎన్నికలు కీలకం. 2014 ఎన్నికల కన్నా.. కాంగ్రెస్ పార్టీ ఈ సారి మరింత బలంగా పోటీ ఇచ్చింది.
కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసినా ఆశ్చర్యం ఉండదా..?
ప్రస్తుతం.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలంగా మారుతోంది. మోడీ హవా తగ్గుతోంది. గతంతో పోలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరగడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ… అధికారం చేపట్టాలనే లక్ష్యాన్ని హంగ్ వస్తే.. నెరవేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. రేపు మరీ పరిస్థితి మారిపోయి.. ఢిల్లీ రాజకీయాల్లో.. కాంగ్రెస్ కు.. టీఆర్ఎస్ మద్దతిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. రాజకీయాల్లో అసాధ్యమైనది ఏదీ లేదు. కశ్మీర్లో .. ఇలాంటివి చాలా చూశాం. ప్రధాన ప్రత్యర్థులైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు రాజకీయాల్లో అధికారం అనేది అన్ని పార్టీలకూ ముఖ్యం… ఎవరితో కలుస్తున్నామనేది కాదు. అందుకే తెలంగాణలో హంగ్ వస్తే.. ఏమైనా జరగొచ్చు.