తెలంగాణ ఎన్నికలు ఓటింగ్ వరకూ వచ్చాయి. చివరి రోజుల్లో.. ప్రచార హడావుడి కన్నా సర్వేలు ఎక్కువగా వచ్చాయి. మీడియాలో సైతం హైలెట్ అయ్యాయి. ఎన్నికల నిబంధనలకు ఏదో రకమైన అర్థాలు చెబుతూ ఏదో ఓ పేరుతో ఈ సర్వేలు ప్రకటించారు. ఎన్నికలకు ముందు తమ కంటే.. తమకు అనుకూల వాతావరణం ఉందన్న అభిప్రాయాలని కల్పించడానికి పార్టీలు ఈ ప్రయత్నాలు చేశాయి. మరి ఈ సర్వేలను ప్రజలు నమ్ముతారా..? ఓటు విషయంలో వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారా..?
ఓటింగ్‌కు ముందు ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేశారా..?
వెల్లువలా వచ్చిన సర్వేలు అసలు ఎవరు చేశారు..? ఏదో ఉజ్జాయింపుగా… లెక్కలు వేసి.. మేం సర్వే చేశాం అంటే నమ్మరు. సర్వేల శాంపిల్ ఏమిటి..? సర్వేపై విశ్వసనీయత ఏమిటి..? సర్వే ఎకౌంటబులిటి ఏమిటి..? అన్న వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నేను సర్వేలో ఏం కనుగొన్నాను.. అని చెప్పే ముందు… విశ్వసనీయత కల్పించాలి. కానీ ఇప్పుడేం జరుగుతోంది.. రాజకీయ పార్టీల అనుబంధ సర్వేలు వచ్చాయి. రాజకీయ పార్టీల అనుబంధ పంచాగాలు… రాజకీయ పార్టీల అనుబంధ జ్యోతిష్యులు వచ్చారు. రాజకీయ పార్టీల అనుబంధ పురోహితులు వచ్చారు. ఆ కోణంలోనే.. ఇప్పుడు సర్వేలు చేసే వాళ్లు కూడా వచ్చారు. అందుకే.. ఇప్పుడు.. ఎవరు సరిగ్గా సర్వే చేశారో చెప్పలేదు. సామాజిక శాస్త్రంలో అధ్యయనానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి నీ శాంపిల్ సైజ్ ఎంత..?. రెండు నీవు అడిగిన వ్యక్తి సరైన సమాధానం చెప్పారా..? మూడు… సమాజంలో ఉన్న సామాజిక వర్గాలకు అనుగుణంగా అభిప్రాయం తెలుసుకున్నారా..? .. అంటే శాంపిల్ల్లో యాభై శాతం మంది మహిళలు ఉండాలి.. బీసీలు యాభై శాతం ఉండాలి. పదహారు శాతం ఎస్సీలు.. పన్నెండు శాతం ముస్లింలు, పది శాతం ఎస్టీలు ఉండాలి. ఈ ప్రమాణాలన్నీ పాటించారా..?. కానీ ఇప్పుడు ప్రకటిస్తున్న సర్వేలు.. ఎవరు చేస్తున్నారో కూడా.. ఎవరూ చెప్పడం లేదు.
సర్వేలు చేసి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం ఎలా..?
అయితే.. అన్నీ పక్కాగా.. సర్వే చేసినా… ఎన్నికలకు ముందు సర్వే ప్రకటించడం కచ్చితంగా రాజకీయ కోణంలో చేసేదే. ఎందుకంటే.. అది ఓటర్లపై ప్రభావ చూపుతుంది. అది చాలా ప్రమాదకరం. ఎవరిపనైన ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రజల ఆలోచనల్ని మనం ప్రభావితం చేయకూడదు. ప్రజల్లో ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి వారి అభిప్రాయాల్ని మార్చడానికి వాడుకుంటున్నాయి. సర్వేలు తేల్చాల్సింది.. ఎవరు గెలుస్తారని కాదు.. ఎవరు గెలుస్తారో.. ఈవీఎంలు లెక్క పెట్టిన తర్వాత తేలుతుంది. సర్వేల్లో తేలాల్సింది ఏమిటంటే.. ప్రజలకు ఏ అంశంపై స్పందిస్తున్నారు..? ఏ అంశంపై ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారు..? అన్న అంశంపై సర్వేలు చేయాలి కానీ.. ఫలితాలను తేల్చడానికి కాదు. నిరుద్యోగ సమస్య, గిట్టుబాటు ధరలు.. ఇలా ఏ సమస్య గురించి స్పందిస్తున్నారో గుర్తించడమే సర్వేల పని .
సర్వే డీటైల్స్ ఎందుకు ప్రకటించరు..?
సర్వేలు కచ్చితంగా ఓటర్లపై ప్రభావం చూపిస్తున్నారు. రాజకీయంగా నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్న వారిపై.. ఈ సర్వేలు ఎలాంటి ప్రభావం చూపవు. కానీ.. స్వింగ్ ఓటర్లపై ప్రభావం చూపిస్తాయి. రాజకీయ పార్టీల అనుబంధ పత్రికలు… చానెళ్లు ప్రకటించే సర్వేలు కన్నా .. స్వతంత్ర సంస్థలు చేసే సర్వేలు ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయి. ప్రజాభిప్రాయం… ఓ వైపు ఉన్నప్పుడు.. ఇలాంటి సర్వేలు ఏమీ చేయలేవు కానీ.. హోరాహోరీ ఉన్నప్పుడు.. ఓటర్లు నిర్ణయం తీసుకోలేనప్పుడు.. స్వింగ్ ఓటర్లను.. గెలిచే పార్టీ వైపు ఆకర్షించడానికి ఈ సర్వేలు ప్రయత్నిస్తాయి. తెలంగాణలో ఇప్పుడు ఓటర్లు ఓ నిర్ణయానికి రాలేదన్న అభిప్రాయం ఉంది. అందుకే సర్వేలు ప్రకటించడం సరైనది కాదు. ఒక వేళ ప్రకటిస్తే.. పూర్తి స్థాయి వివరాలు కూడా ప్రకటించాలి.