వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో.. కేసీఆర్ ను ఎక్కువగా పొగుడుతున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేరుగా.. దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబునాయుడు సహజంగా… పొలిటికల్ స్ట్రాటజీలు ఇలాగే అమలు చేస్తూంటారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ని పిల్ల కాంగ్రెస్ అని… విమర్శించారు. తల్లి కాంగ్రెస్ .. పిల్ల కాంగ్రెస్ అంటూ విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తన ప్రత్యర్థులందరిపైకి మళ్లించారు. ఇప్పుడు బీజేపీపై వ్యతిరేకత ఉంది కాబట్టి… తన ప్రత్యర్థులందర్నీ బీజేపీతో కలిపి విమర్శలు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రత్యేకహోదా ఇస్తారని జగన్ నమ్ముతున్నారా..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన రాజకీయ విధానాల్ని…. వ్యూహాల్ని తన పద్దతిలో తాను అమలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత జగన్ పై ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి.. దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలి. తనకు కేసీఆర్ తో.. మోడీతో కలిపి చంద్రబాబు చేస్తున్న విమర్శలను … సమర్థంగా తిప్పికొట్టగలగాలి. నిజానికి చంద్రబాబు .. నిన్నామొన్నటి వరకూ… మోడీ, కేసీఆర్, జగన్ లతో పాటు పవన్ కల్యాణ్ ను కూడా కలిపి చెప్పేవారు. కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ ను పక్కన పెట్టి.. మిగతా ముగ్గురిని కలిపి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విమర్శలను తిప్పికొట్టగలుగుతున్నారా..? ఇటీవల జగన్ ఇచ్చిన ఇంటర్యూల్లో కేసీఆర్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు. అదేమిటంటే.. కేసీఆర్ ఏపీకి ప్రత్యేక ఇస్తానంటున్నారు.. అవసరమైతే.. ప్రత్యేకహోదా కోసం ప్రధానికి లేఖ రాస్తారనని చెప్పారు… కాబట్టి… దాన్ని మనం స్వాగతించాలి… అని చెప్పుకొచ్చారు. అందుకే కేసీఆర్ పై నమ్మకం పెట్టుకోవాలన్నట్లుగా ఆయనతో కలసి నడవాలన్నట్లుగా చెప్పుకొచ్చారు.
ప్రత్యేకహోదాపై కేసీఆర్ ఎన్ని మాటలు మార్చారో జగన్కు గుర్తు లేదా..?
ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబునాయుడు.. తన విధానాలను మార్చుకున్నారు. మొదట ప్రత్యేకహోదా కావాలన్నారు. తర్వాత ప్రత్యేకహోదా పేరు లేకుండా… ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నారు. మళ్లీ తర్వాత ప్రత్యేకహోదా కావాలన్నారు. అలాగే… ప్రత్యేకహోదా డిమాండ్ చేసిన వాళ్లను అరెస్ట్ చేయించారని.. ప్రత్యేకహోదా సంజీవని కాదని అన్నారని… వైసీపీ అధినేత విమర్శలు చేస్తున్నారు. ఇదంతా నిజమే.. మరి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్రత్యేకహోదాకు మొదటి నుంచి మద్దతిచ్చారా..? ఆయన ప్రత్యేకహోదాపై ఒకే మాట మీద ఉన్నారా..? ఏపీ ప్రజలకు మద్దతు తెలిపారా..?. మొదట్లో ఏపీకి ప్రత్యేకహోదాను సమర్థిస్తున్నట్లు మాట్లాడారు. అప్పట్లో కవిత, కేకే కూడా పార్లమెంట్ లో మాట్లాడారు. అది నిజమే . కానీ తర్వాత ఏం మాట్లాడారు.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. తెలంగాణకు ద్రోహం చేయడమేనన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. తెలంగాణ పరిశ్రమలన్నీ అక్కడకు తరలిపోతాయన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మేడ్చల్ సభలో సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటే… దాన్ని తీవ్రంగా విమర్శించారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ గడ్డ పై నుంచే.. ఏపీకి ప్రచారం చేయడం… తెలంగాణను తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు కేసీఆర్. చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారని.. జగన్ చెబుతున్నారు.. మరి కేసీఆర్ తన వైఖరి మార్చుకున్నారని జగన్ ఎందుకు చెప్పడం లేదు..?
ఫెడరల్ ఫ్రంట్లో చేరుతారో లేదా కచ్చితంగా చెబుతారా..?
మోడీకి కేసీఆర్ వ్యతిరేకం… తాను కూడా…మోడీకి వ్యతిరేకమని.. చంద్రబాబు తమను ఇద్దర్నీ కేసీఆర్ కు ముడి పెట్టి… విమర్సలు చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ … కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని దేశమంతా తిరుగుతున్నారు. ఈ ఫ్రంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా..? ? ఈ కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమిటి..? ఇలాంటి వాటన్నింటికీ జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ తనపై ఎలాంటి రాజకీయం చేసిందో.. ఇప్పుడు.. ఏపీలో అదే ప్లస్ పాయింట్ గా చంద్రబాబు మార్చుకోబోతున్నారు. అందుకే.. ఏపీలో ఆంధ్రా టీఆర్ఎస్ గా… వైసీపీని ఇప్పుడు పిలుపుస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు దీనికి మరింత బలం చేకూరేలా చేస్తోంది.