ఎన్నికల ప్రచారసభల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ పాలనలో విఫలమయిందని చెబుతూ ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని ప్రకటిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబునాయుడు కోల్కతాలో మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. వచ్చే నెల పదో తేదీనే ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల అధినేతలందరూ సమావేశం కావాలని నిర్ణయించారు. ఇద్దరు చంద్రులు కూడా.. జాతీయ రాజకీయాల్లో తమ ప్రభావం చూపించాలని పరుగులు పెడుతున్నారు.
బీజేపీతో సంబంధాలు లేవని చెప్పుకునేందుకే కేసీఆర్ తాపత్రయమా..?
నిజానికి ఇద్దరు చంద్రుల.. జాతీయ రాజకీయాల్లో తమ ప్రభావం చూపించడానికి పరుగులు పెడుతున్నాని నేను అనుకోను. తమ తమ రాష్ట్రాల్లో రాజకీయాల రీత్యా… తమ.. తమ రాజకీయ నేపధ్యాన్ని తాము నిర్మించుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్పై… బీజేపీతో అంట కాగుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా కేసీఆర్.. బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థించారు. నోట్ల రద్ద దగ్గర్నుంచి జీఎస్టీ వరకూ అన్నింటినీ… సమర్థించారు. అలాగే.. బీజేపీ.. తెలంగాణకు ఏమీ చేయకపోయినా ప్రశ్నించడం లేదు. విభజన హామీలు నెరవేర్చుకపోయినా పట్టించుకోలేదు. అంటే.. ఓ రకంగా.. టీఆర్ఎస్ బీజేపీకి అప్రకటిత మిత్రపక్షం అన్నట్లుగా… విమర్శలు వస్తున్నాయి. కారణం ఏమిటంటే.. తెలంగాణలో కేసీఆర్కు బీజేపీ ప్రత్యర్థి కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి. అందుకే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే ఏ పనీ కేసీఆర్ చేయరు. అందువల్ల.. బీజేపీకి పరోక్షంగా టీఆర్ఎస్ ఉపయోగపడుతోంది. 2019 ఎన్నికల తర్వాత.. బీజేపీతో టీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంది. కవిత లాంటి వాళ్లు కూడా.. బీజేపీ ఆహ్వానిస్తే.. కేబినెట్లో చేరడానికి మేం రెడీ అన్నారు. ఇప్పుడు… బీజేపీతో దగ్గరయితే… ముస్లిం ఓటు బ్యాంకు పోతుందన్న రాజకీయ కారణాలతోనే కేసీఆర్ ఇప్పుడు మోడీకి దూరంగా ఉన్నారు. సైద్ధాంతికంగా దూరంగా లేరు.
2019 ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో కలుస్తారా..?
బీజేపీతో అప్రకటిత మైత్రి ఉంది అన్న విమర్శ నుంచి బయట పడటానికి.. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి అనే అంశాన్ని కేసీఆర్ ముందుకు తెస్తున్నారు. గతంలో కొంత మంది నేతల్ని కలిశారు. తర్వాత నాలుగు నెలల నుంచి పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు దేశంలో కాంగ్రెస్సేతర.. బీజేపీయేతర కూటమికి ఎన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి..?. కేసీఆర్తో పాటు.. ఇంకో రెండు మూడు పార్టీల పేర్లు చెప్పగలగితే కూటమి గురించి చెప్పడం సులభం అవుతుంది. కానీ ఇప్పుడు.. ప్రాంతీయ పార్టీలన్నీ.. కాంగ్రెస్, బీజేపీలు..దేనితో ఒకదానితో కలుస్తున్నాయి. అందు వల్ల అది అంత సులభం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్న బీఎస్పీ, ఎస్పీ లాంటి పార్టీలు కూడా.. జాతీయ స్థాయి రాజకీయాలుక వచ్చే సరికి.. కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటాయి. ఒక్క సీపీఎం మాత్రమే.. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర వైఖరి తీసుకుంది. ఈ పార్టీ కూడా… మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చింది. అందువల్ల… చాలా క్లియర్గా… అర్థమయ్యే విషయం ఏమిటంటే.. రెండు జాతీయ పార్టీల నీడ లేకుండా.. వేరే పార్టీలు బయటకు రావు. ఆ విషయం తెలిసినా.. కేసీఆర్.. బీజేపీ ముద్ర నుంచి బయటపడటానికి.. జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏదో చేద్దామని కానీ.. ఏదో చేసే అవకాశం ఉందని కాని అనుకోలేం.
ఏపీ రాజకీయ సమీకరణాల కోసమే చంద్రబాబు కూటమి ప్రయత్నాలా..?
ఇక చంద్రబాబునాయుడు.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ దూరమయ్యారు. వీరిద్దరూ దూరం కావడం వల్ల కొంత మైనస్ అవుతుంది. ప్లస్ కావాలంటే.. కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది. దీనికి తోడు ఏపీకి సాయం కావాలంటే… కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సాయం కావాల్సి ఉంటుంది. బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వలేదు కనుక.. ప్రత్యేక ఇచ్చే పార్టీతో కలిసి నడుస్తున్నామని అక్కడి ఓటర్లకు చెప్పాలి. ప్రత్యేకహోదా తెచ్చేందుకు జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారు. అదీ కూడా.. కాంగ్రెస్తో కలవాల్సిన అవసరాన్ని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. డెమెక్రటిక్ కంపల్సన్ అని పదే పదే చెబుతున్నారు.. కానీ.. ఆయనది పొలిటికల్ కంపల్సన్. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో ఇప్పటికే పెట్టుకున్న పొత్తును సమర్థించుకోవడానికి… ప్రత్యేకహోదా తెస్తామని.. ప్రజలకు చెప్పుకునేందుకు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. రేపు అవకాశం వస్తే.. ఇద్దరు చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చు…కానీ ఇప్పటికైతే మాత్రం.. వారి రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే… జాతీయ రాజకీయాలపై అడుగు వేస్తున్నారు.