భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ రకంగా చిన్న సైజు కలకలం రేపుతున్నారు. ఓటమికి బాధ్యతలు తీసుకోవాలని అధినాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో… కొన్ని కొన్ని సిద్ధాంతపరమైన విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ఇవన్నీ పరోక్షంగానే ఉంటున్నారు. అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్న భావన కూడా వ్యక్తమవుతోంది.
మోడీ, షాలపై నేరుగా గడ్కరీ విమర్శలు ఎందుకు..?
నితిన్ గడ్కరీ భారతీయ జనతా పార్టీలో ఓ సామాన్యమైన లీడర్ కాదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి.. పబ్లిసిటీ తెచ్చుకోవాలనుకునే నాయకుడు కాదు. ఆయన ఆరెస్సెస్‌కు అత్యంత సన్నిహతమైన నేత. ఆయన అనాలోచితంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరు. ఆయన ఆరెస్సెస్ సిద్దాంతాలకు, బీజేపీకి నమ్మకమైన నేత. ఆయన ఇటీవలి కాలంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయకపోతే… అధ్యక్షుడితే తప్పు అన్నారు. అలాగే గెలిచినప్పుడు.. తమ ఘనత అని భుజాలు చరుచుకుని.. ఓడిపోయినప్పుడూ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో… కృత్రిమమైన మార్కెటింగ్.. ఎల్లప్పుడూ ఫలితాలనివ్వదని చెప్పుకొచ్చారు. అంటే..మోడీ కృత్రికమమైన మార్కెటింగ్ చేసుకుంటున్నారని ఆయన చెప్పినట్లయింది. ఈ విషయంలో.. గతంలో బీజేపీకి చేదు అనుభవాలున్నాయి. వాజ్‌పేయి హయాంలో.. ఇండియా షైనింగ్ పేరుతో క్యాంపెయినింగ్ చేశారు. అంత గొప్పగా.. ఇండియా షైన్ కాకపోయినా ఆ ప్రచారం చేశారు. మొత్తానికి బీజేపీ షైనింగ్ పోగొట్టారు ఓటర్లు.
మోడీ నినాదాలతో ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారా..?
మోడీ కూడా.. చాలా నినాదాలు ఇచ్చారు. స్వచ్ఛ్ భారత్ అన్నారు. అది నినాదానికి పరిమితమయింది. మేక్ ఇన్ ఇండియా అని అన్నారు. దాని వల్ల ఏమివచ్చిదో ఎవరికీ తెలియదు. బేటీ బచావో.. భేటీ పడావో అన్నారు. దానికి బడ్జెట్లో కేటాయించి రూ. 43 కోట్లు మాత్రమే. ఖర్చు చేసింది.. రూ. ఐదు కోట్లు. అంటే.. ఎంత దారుణంగా ఉందో కదా..! ఈ మాత్రం దానికే.. భేటీ బచావో.. భేటీ పడావో.. అనే నినాదం ఎందుకు. ఇంత పెద్ద దేశంలో.. ఆడపిల్లలకు కాపాడటానికి రూ. 5కోట్లు ఖర్చు పెడతారా..? అలాగే.. డిమానిటైజేషన్ సమయంలో ఏం చెప్పారు..? ఏం జరిగింది..? ఇలా కృత్రిమమైన నినాదాలతో మోడీ తాత్కలికంగా మాత్రమే లాభాలు సంపాదించగలరు. దీర్ఘకాలంగా సాధ్యం కాదు. అందుకే కృత్రిమమైన మార్కెటింగ్ ఉపయోగడం ఉండదన్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పుడు.. అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి నేతలు బహిరంగంగానే చెప్పారు. పార్టీ విధానాలను సమీక్షించుకోవాలని సూచించారు.
మోడీ, షాలపై బీజేపీలో అసంతృప్తి బయటకు వస్తోందా..?
ఎల్ కే అద్వానీ.. మొదటి నుంచి నరేంద్రమోడీపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ప్రధాని పదవి లాక్కున్నారనే అసంతృప్తి కావొచ్చు.. మోడీ తనకు సరైన గౌరవాన్ని ఇవ్వడం లేదన్న కారణం కావొచ్చు. కానీ నితిన్ గడ్కరీకి ఆ సమస్య లేదు. నితిన్ గడ్కరీ.. మోడీ మంత్రివర్గంలో కీలక మంత్రి. ఆరెస్సెస్‌కు సన్నిహితుడు. ఆరెస్సెస్‌కు అద్వానీకి మధ్య కొంత గ్యాప్ ఉండేది. కానీ గడ్కరీకి.. ఆరెస్సెస్‌కు మధ్య అలాంటి గ్యాప్ కూడా లేదు. అయినా గడ్కరీ… ఎందుకిలా వ్యాఖ్యలు చేస్తున్నారని అందరిలో వస్తున్న సందేహం. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలను.. రెండు రకాలుగా చూడొచ్చు. అందులో మొదటిది… నరేంద్రమోడీ, అమిత్ షాల నాయకత్వ తీరుపై.. అసంతృప్తి గురైన నేతలు.. ఇలా తిరుగుబాటు చేయడం ప్రారంభించడం కావొచ్చు. రెండోది… ఆరెస్సెస్నే.. మోడీ, షా తీరుపై…ఇలా నేతల్ని ఎగదోస్తోందా..? అనేవే… ఆ రెండు కారణాలు.
ఆరెస్సెస్ ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేసిందా..?
ఎందుకంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వందకుపైగా సీట్లు తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా వచ్చే సీట్లు ఎక్కడా లేవు. బీజేపీకి సొంతంగా మెజార్టీ వచ్చే చాన్స్ లేదు కనుక .. మరింత… సానుకూలమైన నేత ముందు పెట్టడానికి… మిత్రపక్షాలకు మోదీ కాకుండా.., ఇతర నేతలను వారికి చూపించడానికి ఆరెస్సెస్.. నితిన్ గడ్కరీకి.. ఇమేజ్ ను నిర్మించడానికి.,. ఓ కృత్రిమమైన వాతావరణాన్ని ఆరెస్సెస్ ఏర్పాటు చేస్తోందన్న అభిప్రాయం ఉంది. మోడీని ప్రశ్నించే నేత మా పార్టీలో.. ఉన్నారని… మిత్రపక్షాలకు ఒప్పించే ప్రయత్నం చేస్తుందన్నమాట. అంటే… బీజేపీలో నాయకత్వంపై అసంతృప్తి అయినా ఏర్పడి ఉండాలి.. లేదా.. ఆరెస్సెస్ నే వ్యూహాత్మకంగా.. మోడీకి ప్రత్యామ్నాయ నేతను… మిత్రులకు ఓ చాయిస్‌ను… ఇవ్వడానికి ముందుకు తోసి ఉండాలి.