ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కమ్యూనిస్టు నేతలు చర్చలు ప్రారంభించారు. అసలు పవన్ కల్యాణ్ బలమెంత అన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఏ ఎన్నికల్లోనూ జనసేన పార్టీని ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపలేదు. గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమి విజయానికి ఓ కారణం అయ్యారని మాత్రం చెప్పుకోగలరం. అదే సమయంలో.. ఈ విషయంపై పవన్ కల్యాణ్‌కు స్పష్టమైన అవగాహన ఉంది.
తన బలమెంతో అంచనా వేసుకోలేని స్థితిలో పవన్..!
గతంలో పవన్ కల్యాణ్ ఎప్పుడు… ఎన్నికల్లో పోటీ గురించి ప్రస్తావన వచ్చినా.. తన బలమేంటో తనకు తెలియదని.. ఎన్నికలు వచ్చినప్పుడు.. అన్ని విషయాలపై దృష్టి పెడతానని చెప్పేవారు. అది నిజమే కదా.. ఆయన బలం ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే గతంలో… తనది ఇరవై ఏళ్ల రాజకీయమని.. గెలుపోటములపై.. పెద్దగా ప్రభావం పడదని చెప్పుకొచ్చేవారు. అయితే పవన్ కల్యాణ్.. సీరియస్ రాజకీయాలు చేయడం లేదని.. ఆయనకు ఎలాంటి బలం లేదన్న కామెంట్లు వచ్చేసరికి.. ఆయన తన శ్రేణుల్లో.. ఉత్సాహం కల్పించడానికి తానే ముఖ్యమంత్రినవుతానని ప్రకటనలు చేశారు. కానీ తన రాజకీయం విషయంలో ఆయన చాలా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. తనకు రాజ్యం వస్తుంది… రాజ్యాధికారం వచ్చేస్తుందన్న అభిప్రాయంలో ఆయన లేరు. వస్తే గిస్తే.. కర్ణాటకలో కుమారస్వామికి వచ్చినట్లు అవకాశం వస్తుందని.. అంచనాతో ఉన్నారు. లైక్ మైండెడ్ కలుపుకుంటే.. కొంత ప్రయోజనం ఉంటుంది. ఆ దిశగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.
దీర్ఘకాల ప్రయోజనాల కోసమే పవన్ పొత్తులు ..!
పవన్ కల్యాణ్‌కు పొత్తుల దిశగా చాలా పరిమితంగా అవకాశాలు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీతో కలవలేరు. విభజన ఆగ్రహం ప్రజల్లో కాంగ్రెస్ పై ఉంది. కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేసే అవకాశం లేదు. కాంగ్రెస్ తో కలిస్తే…. ఓట్లు రావని టీడీపీ కూడా దూరంగా ఉంది. కాబట్టి.. కాంగ్రెస్‌తో పెట్టుకునే అవకాశం లేదు. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదు. ఇప్పుడు ఏపీ ప్రజలకు బీజేపీ విలన్. ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం అంటే… ధృతరాష్ట్ర కౌగలిలాంటి. బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే.. ధృతరాష్ట్ర కౌగిలితో భస్మమైపోతారు. అందుకే.. బీజేపీతో పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇక మిగిలింది జగన్. జగన్‌కు జూనియర్‌గా.. పవన్ స్థాయి లాంటి వ్యక్తి ఉండలేరు. సినీ ప్రపంచంలో స్టార్ గా ఉన్న పవన్ కల్యాణ్… స్టార్ గా ఉన్నారు. జగన్‌తో సర్దుకుపోలేరు. ఇక మిగిలింది టీడీపీ. పొత్తు కోసం టీడీపీ రెడీగా ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్ మాత్రం దీర్ఘకాల దృష్టితో ఆలోచిస్తున్నారు. పొత్తు పెట్టుకున ఐదో, పదో సీట్లు తెచ్చుకోవచ్చు కానీ.. గెలిచిన వారంతా.. చంద్రబాబు ఎమ్మెల్యేలుగానే ఉంటారు. ఇప్పుడు బీజేపీ తరపున గెలిచిన వారి పరిస్థితి అలాగే ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ డిపాజిట్ తెచ్చుకునే పరిస్థితి లేదు. అలాగే.. పవన్ కల్యాణ్ కూడా.. టీడీపీతో పొత్తులు పెట్టుకుంటే.. దీర్ఘకాల ప్రయోజనాలకు నష్టం. జనసేన ఎదగదు.
వామపక్షాలతో పవన్ పొత్తు ఇద్దరికీ ప్రయోజనమేనా..?
ఇక మిగిలింది కమ్యూనిస్టులు మాత్రమే. భావజాల పరంగా.. పవన్ కల్యాణ్‌తో కమ్యూనిస్టులు కలసి నడవగలరు. వారు కలిసి పోరాటాలు చేశారు. ఇద్దరూ కలిస్తే.. ఇది విన్ – విన్ సిట్యుయేషన్. ఎందుకంటే… జనసేనకు కార్యకర్తల నిర్మాణం లేదు.. కానీ కమ్యూనిస్టులకు ఉంది. వారికి పోరాట పటిమ ఉంది. కానీ జనాకర్షణ ఉన్న నాయకత్వం లేదు. జనాకర్షణ ఉన్న పవన్ కల్యాణ్… నిర్మాణం ఉన్న కమ్యూనిస్టులు కలిస్తే.. అది ఇద్దరికి ప్రయోజనం కల్పించేదే అవుతుంది. అదే సమయంలో… కమ్యూనిస్టులు భారీగా సీట్లేమీ అడగరు. 175 నియోజకవర్గాల్లో 70 చోట్ల లేదా 80 చోట్ల పోటీ చేస్తామని వారేమీ అడగరు. చాలా పరిమితంగానేసీట్లు అడుగుతారు. దాని వల్ల పవన్ కల్యాణ్‌కు ఇబ్బంది కూడా రాదు. కమ్యూనిస్టులకు కూడా వేరే మార్గం లేరు. వామపక్షాలతో పొత్తులు పెట్టుకున్న వారికి కచ్చితంగా వారి ఓటు ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఎలా చూసినా.. ఉభయులకూ.. ప్రయోజనం అందుకే.. పొలిటికల్ కెమిస్ట్రీ కనిపిస్తోంది. అలాగే టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ వల్ల.. జనసేన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కమ్యూనిస్టులతో చర్చల కారణంగా.. ఆ ప్రచారానికి పవన్ కల్యాణ్ పులిస్టాప్ పెట్టినట్లయింది.