తెలంగాణలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఓ వైపు మజ్లిస్తోనూ మరో వైపు బీజేపీతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి మొదటి నుంచి అనధికారికంగా మిత్రపక్షంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారిక మిత్రపక్షంగానే వ్యవహరించింది. ఇది అప్రకటిత స్నేహం కాదు. ప్రకటితమైదే. ఇది రహస్య ఓడంబడిక కాదు. బహిరంగ మద్దతు. పరోక్షం కాదు.. ప్రత్యక్షంగానే ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చారు.
మద్దతిచ్చినా టీఆర్ఎస్కు షాకులే..!
విచిత్ర రాజకీయం ఏమిటంటే… ఓ వైపు టీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థికి మద్దతుగా ఓటు వేస్తున్న సమయంలోనే… కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధ్యం కాదు అని స్పష్టమైన ప్రకటన చేసింది. అదే కాదు బైసన్ పోలో గ్రౌండ్ తమకు ఇవ్వడం లేదని…ఎంపీలు పార్లమెంట్ లోపల ఆందోళన చేశారు. ప్రధానమంత్రిని కూడా కలిశారు. ఇతర రాష్ట్రాలు అడిగితే రక్షణశాఖ భూములు ఇచ్చి.. తెలంగాణ ప్రభుత్వం అడిగితే మాత్రం ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. కేంద్రం తమపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. నితిన్ గడ్కరీ పార్లమెంట్ వేదికగా.. పోలవరమే చివరి జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారు. పోనీ.. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకపోతే… రూ. 20 వేల కోట్ల ఆర్థిక సాయం అయినా చేయమని… టీఆర్ఎస్ కోరింది. ఆ హామీ కూడా ఇవ్వలేదు.
మద్దతిచ్చేందుకు కేసీఆర్ షరతులు ఎందుకు పెట్టలేదు..?
తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి చాలా అవసరం. అలాంటి సందర్భంలో.. తెలంగాణరాష్ట్ర సమితి.. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేలా కొన్ని షరతుల మీద మద్దతు ఇచ్చి ఉండాల్సింది. బయ్యారం స్టీల్ ప్లాంట్, వెనుకబడిన జిల్లాకు నిధులు, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్టులు.. విభజన హామీల అమలు గురించి కండిషన్స్ ఎందుకు పెట్టలేదు..?. చివరకు ఎంతో ఇష్టంగా సెక్రటేరియట్ కట్టుకుంటాం.. బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వమని.. బతిమాలుతున్నారు కానీ… అ గ్రౌండ్ ఇస్తేనే ఓటు వేస్తామని ఎందుకు షరతు పెట్టలేదు. ఇవేమీ చెప్పకుండా ఎందుకు మద్దతిచ్చారు..?
అంశాలవారీ కాదు.. బేషరతుగా ఎందుకు మద్దతు.?
అంశాలవారీగా బీజేపీకి మద్దతిస్తామని.. మొదట్లో కేసీఆర్ ప్రకటించారు. కానీ ఏ అంశాన్ని చూసుకోవడం లేదు. ఏ అంశం లేకపోయినా..నేరుగా వెళ్లి మద్దతిస్తున్నారు. తమకు రాజకీయ పరిస్థితులు, అన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నా మద్దతిస్తున్నారు. నోట్ల రద్దుకు మద్దతిచ్చారు. ఆ విషయంలో బీజేపీకి మద్దతివ్వలేదన్నారు. ఇరవై ఏళ్ల కిందటే..నోట్ల రద్దు ఆలోచన కేసీఆర్ చెప్పారని అందుకే మద్దతిచ్చారన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతిచ్చారు. దళిత అభ్యర్థిని రాష్ట్రపతిగా పెట్టాలని కేసీఆర్ నే..మోడీకి చెప్పారని..అందుకే మద్దతిచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. జీఎస్టీ వల్ల తెంలంగాణ నష్టపోతుంది చెబుతూ… మద్దతిచ్చారు. అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు.. టీడీపీ తప్ప ఎవరు పెట్టినా మద్దతిస్తామన్నారు. అన్నింటికీ ఓ కారణం చెప్పారు.. కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి ఏ అంశం లేదు. ఏ అంశం ఆధారంగా ఎన్డీఏ కూటమికి… టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది..?
ఎన్డీఏకు మద్దతివ్వడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చిన లాభమేంటి..?
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్డీఏకు మద్దతివ్వడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చిన లాభం ఏమిటి..? . తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ చెప్పిందేమిటి..?. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పారు. అలాగే బీజేపీని కౌగలించుకున్నారు. మద్దతిచ్చారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు వచ్చిన లాభం ఏమిటి..? మద్దతిచ్చినా… కూడా కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వబోమని చెప్పారు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. రాష్ట్రంలో ఎంఐఎంతో అవగాహన పెట్టుకున్నారు. దేశంలో బీజేపీతో అవగాహనకు వచ్చారు.
రాజకీయం కోసం విచిత్ర స్నహలు..!
మజ్లిస్ లక్ష్యం బీజేపీని ఓడించడమేనని… అసదుద్దీన్ పదే పదే చెబుతూంటారు. కర్ణాటకలో జేడీఎస్ కు మద్దతు పలికారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగానే వెళ్తోంది. కానీ తెలంగాణకు వచ్చే సరికి.. ఎన్డీఏతో సన్నిహితంగా మెలుగుతున్న కేసీఆర్కు మద్దతుగా ఉంటోంది. ఇదో విచిత్రమైన రాజకీయం. రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఉంటాయి. ఇక్కడ ఈ రెండు పార్టీలను స్థానిక బీజేపీ నేతలు విమర్శిస్తారు. టీఆర్ఎస్ .. ఎంఐఎంకు ఈడిగం చేస్తోందని విమర్శిస్తారు. మళ్లీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా జన చైతన్య యాత్రలు జరుపుతారు. కానీ జాతీయ స్థాయిలో బీజేపీ.. టీఆర్ఎస్తో కలసి మెలిసి పని చేస్తుంది. అందుకే ఇదో విచిత్ర రాజకీయం.