భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు ఇచ్చింది. వాటికి కొన్ని పరిమితులు కూడా పెట్టింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 (1)A ప్రతి పౌరునికి భావప్రకటనా స్వేచ్చ ఇచ్చింది. అదే సమయంలో ఆర్టికల్ 19 (2 ) సహేతుక ఆంక్షలను కూడా పెట్టింది. కత్తి మహేష్ కు నగర బహిష్కరణ శిక్ష విధించడానికి లా అండ్ ఆర్డర్ సమస్య కారణమని పోలీసులు చెప్పారు. దీన్ని కోర్టులు ఎంత వరకూ ఒప్పుకుంటాయన్నది సందేహమే.
పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ ఒకటి కాదు..!
కోర్టులు చాలా సార్లు చెప్పిందేమిటంటే… పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ ఒకటి కాదు. సహేతుక ఆంక్షల పేరిట.. వ్యక్తులపై ఇష్టారాజ్యంగా ఆంక్షలు విధించరాదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పదే పదే చెప్పింది. పోలీసులు చెప్పే కారణాలు.. సహేతుకం అనే పరీక్షకు నిలబడాలని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అంటే పబ్లిక్ ఆర్డర్ వేరు.. లా అండ్ ఆర్డర్ వేరు. చాలా మంది పోలీస్ ఆఫీసర్లకు కూడా ఈ విషయం తెలియదు. ఏదైనా ఓ చిన్న ఘర్షణ జరిగినా.. కొట్టుకున్నా..తన్నుకున్నా అది లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుంది. సమాజంలో పెద్ద ఎత్తున ఓ ఉద్వేగపూరితమైన వాతావరణం .. అల్లకల్లోలం అయ్యేటటువంటి పరిస్థితి వస్తే.. దాన్ని పబ్లిక్ ఆర్డర్ కు డిస్టర్బెన్స్ అంటారు. కత్తి మహేష్ విషయంలో డీజీపీ కూడా లా అండ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేస్తున్నందునే నగర బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ విషయానికే…నగర బహిష్కరణ విధించవచ్చా..?. పబ్లిక్ ఆర్డర్ సమస్య తీసుకు వస్తే.. చర్య తీసుకోవచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ అని చెప్పారు కాబట్టి.. కత్తి మహేష్ కోర్టుకు వెళ్లవచ్చు.
కత్తి మహేష్ వ్యాఖ్యలు కచ్చితంగా తప్పే..!
నా అభిప్రాయం ప్రకారం కత్తి మహేష్ అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది రాముడి భక్తుల మనోభావాలు దెబ్బతీయాల్సిన అవసరం లేదు. మతాన్ని రాజకీయంగా వాడుకోవడాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు.. కానీ వారి భావాల్ని కించపరచడం తప్పు. కత్తి మహేష్ వ్యాఖ్యల్ని నేను అంగీకరించడం లేదు… కానీ నగర బహిష్కరణ… చెప్పకుండా హైదరాబాద్ వస్తే మూడేళ్ల జైలు శిక్ష లాంటివి అనాగరిక రియాక్షన్ లాగే కనిపిస్తోంది. ఆ స్థాయిలో రియాక్షన్ అవసరమా..?.
అక్బరుద్దీన్, ఆర్జీవీ, రాజాసింగ్లపై ఎందుకు చర్యలు తీసుకోరు..?
రాజ్యం, ప్రభుత్వం, వ్యవస్థ.. అందరి పట్ల ఒకలాగే వ్యవహరించాలి. కత్తి మహేష్ రాముడిపై అన్నందుకే ఇంత తీవ్రమైన శిక్ష వేశారు..మరి అక్బరుద్దీన్ ఓవైసీ.. నిర్మల్, ఆదిలాబాద్ లలో… హిందూ దేవుళ్లపైనా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏం చేశాడో చెప్పలేము కానీ.. చాలా కచ్చితంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజున కూడా టీవీ చానళ్లలో చర్చలు జరిగాయి. అయినా అక్బరుద్దీన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు..?. ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య రహస్య బాంధవ్యం ఉంది కాబట్టే.. ఏమీ అనడం లేదనే అనుమానం వస్తుంది కదా..!. రామ్ గోపాల్ వర్మ ఎన్నోసార్లు హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా..!. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఎన్నో సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. వారిపై ఏ చర్యలు తీసుకోలేదు. కత్తి మహేష్ విషయంలో ఇంత తీవ్రంగా స్పందించిన రాజ్యం, వ్యవస్థ.. అక్బరుద్దీన్, ఆర్జీవీ, రాజాసింగ్ విషయంలో ఎందుకు నిర్లిప్తంగా ఉంది..?
ప్రశ్నించాలి.. కానీ కించ పరచకూడదు..!
మతాన్ని, మత భావాలను కించ పరచకూడదు. మతోన్మాదంపై పోరాడాలి. మతం పేరిట అంటరానితనం ఉంది. అలాంటి వాటిని కచ్చితంగా ప్రశ్నించాలి. మతం పేరిట అణగారిన కులాల అణచి వేత ఉంది. కచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించవచ్చు కదా అని అవమానించే రీతిలో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. మతాన్ని సంస్కరించే రీతిలో.. మతానికి, ఆధునిక సమాజ విలువలకు మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు.. ఆధునిక సమాజ విలుల్ని కాపాడేందుకు.. మతాన్ని కూడా సంస్కరించేందుకు.. ప్రశ్నించడంలో తప్పు లేదు. ప్రశ్నించకుండా ఆధునిక సమాజం ముందుకు పోదు.
మతాన్ని అంతం చేస్తామనుకోవడం మూర్ఖత్వం..!
మత భావాల్ని కించ పరచడం వల్ల, తృణీకరించడం వల్ల..మరో వర్గంలో అతివాదాన్ని పెంచినట్లవుతుంది. అది మంచిది కాదు. మతాన్ని ప్రశ్నించడం పేరిట మత భావాల్ని అవమానిస్తాం.. కోట్ల ప్రజలను ఆరాధించే దేవుళ్లను కించ పరుస్తామనడం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి చేసే వ్యాఖ్యలతోనే.. వ్యవహారాలతోనే హిందూ నాగరికత చెడ్డదైపోదు. హిందూ మతం అంత బలహీనమైనది కాదు. చరిత్రలో అనేక మంది మహానుభావులు కూడా మతాన్ని ప్రశ్నించారు. అయితే వారంతా.. మతాన్ని సంస్కరరించేలా..మతాన్ని ఆధునిక సమాజ విలువలు పెంచేలా సంస్కరించేలా ప్రశ్నించారు. ఆ విధంగా..అన్ని మతాలనూ ప్రశ్నించాలి. అందుకే..మతాన్ని, మత విశ్వాశాల్ని కించ పరచకండి. కానీ ఆ మత విశ్వాసాలు, నమ్మకాలు మూఢ నమ్మకాలైనప్పుడు.. అవి ఆధునిక సమాజానికి.. ఆభ్యంతరకమైనప్పుడు..వాటిని ప్రశ్నించండి.. ఆ ప్రశ్నలు మతాన్ని కించ పరిచేలా కాకుండా..సంస్కరించేలా ఉండాలి.అంతే కానీ..అ మతాన్ని లేకుండా చేస్తామనుకోవడం మూర్ఖత్వం. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు.