రాఫెల్ డీల్ వ్యవహారంలో భారీ స్కాం జరిగిందని.. కాంగ్రెస్ పార్టీ ఓ ఉద్యమం చేస్తోంది. పార్లమెంట్‌లోనూ ఇదే అంశంపై పోరాడుతోంది. జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని.. కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆందోళన చేస్తున్నాయి. జేపీసీ వేయడానికి కేంద్రం నిరాకరిస్తోంది. ఫలితంగా సభ వాయిదాలు పడుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ 1989లో బోఫోర్స్ స్కాం… తమ పార్టీ ఓడిపోవడానికి ఎలా కారణం అయిందో.. ఇప్పుడు రాఫెల్ డీల్ స్కాం… బీజేపీ ఓడిపోవడానికి అలా కారణం అవుతుందని ఆశిస్తోంది.
అవినీతి కారణంగా ప్రజలు ప్రభుత్వాల్ని ఓడిస్తారా..?
బోఫోర్స్ స్కాం అప్పట్లో రూ. వంద కోట్ల రూపాయలలోపే ఉంటుంది. ఇప్పుడు రాఫెల్ డీల్… చాలా పెద్దది. ఇప్పటికిప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారమే రూ. 35వేల కోట్లు అంటున్నారు. పూర్తి స్థాయిలో ఒప్పందాన్ని అమలు చేసేసరికి… రూ. లక్ష కోట్లకుపైగానే చెల్లించాల్సి వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. అందుకే ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. బోఫోర్స్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై.. వచ్చిన ఆరోపణల కారణంగానే రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓడిపోయింది. ప్రభుత్వాలపై వచ్చిన ఆరోపణల కారణంగా ప్రజల ఆగ్రహానికి గురై..ఓడిపోయిన, రాజీనామా చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. యూపీఏ -2 ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధానంగా.. అవినీతి ఆరోపణలే కారణం. టూజీ స్కాం, కోల్ స్కాం, కామన్వెల్త్ స్కాం… అంటూ రకరకాల స్కాములు వెలుగు చూడటంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందువల్ల ప్రభుత్వ పతనానికి కారణం అయింది. అంటే… అవినీతి… ప్రభుత్వాలు ఓడిపోవడానికి కారణం అయింది.
బీజేపీ ఎలా సమర్థించుకున్న రాఫెల్ స్కాం నిజమని ప్రజలు నమ్ముతున్నారా..?
రాఫెల్ డీల్ విషయంలో… నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎంతగా సమర్థించుకునే ప్రయత్నం చేసినా… ప్రజల్లో మాత్రం ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆ డీల్ లో బయటకు వచ్చిన సందేహాలకు ప్రభుత్వం ఒక్కటంటే.. ఒక్కదానికి సమాధానం చెప్పకపోతూడటంతో… ఈ వ్యవహారంలో.. వేల కోట్ల అవినీతి జరిగిందని… రిలయన్స్ డిఫెన్స్ ఓనర్ అనిల్ అంబానీకి లాభం చేకూర్చడానికి మోడీ అవినీతికి పాల్పడ్డారన్న భావన మాత్రం ప్రజల్లో బలంగా ఉంది. అవినీతి చేశారని ప్రజలు నమ్మితే.. ఫలితాలు.. చాలా బలంగా ఉంటాయి. బోఫోర్స్ స్కాం బయటకు రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. కానీ బోఫోర్స్ బయయటకు వచ్చిన తర్వాత 8 శాతానికిపైగా ఓట్లను కోల్పోయిది. అలాగే యూపీఏ టూ ప్రభుత్వం కూడా.. అవినీతి ఆరోపణల కారణంగా.. 15శాతానికిపైగా ఓట్లను కోల్పోయి… 2014లో దారుణమమైన పతనాన్ని చవి చూసింది. రాజీవ్ గాంధీ లాంటి ఓ క్లీన్ ఇమేజ్ ఉన్న నేత ప్రధానిగా ఉన్న ప్రభుత్వాన్ని సహించని ప్రజలు… నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని సహిస్తారా.. అనే ఓ విశ్లేషణాత్మకమైన ప్రశ్న ప్రజల్లో ఉంది.
విపక్ష పార్టీలన్నీ రాఫెల్ మీద పోరాడటం లేదా..?
అయితే బోఫోర్స్ స్కాంకు… ఇప్పుడు రాఫెల్ డీల్‌కు కొన్ని తేడాలు ఉన్నాయి. బోఫోర్స్ స్కాంను.. అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలోనే రక్షణ మంత్రిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ బయటపెట్టారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి.. ఈ విషయంపై పోరాడారు. ప్రభుత్వంలోని ఉన్న వ్యక్తే ఆరోపణలు చేయడంతో సహజంగానే ప్రజల్లో దీనిపై నమ్మకం పెరుగుతుంది. కానీ రాఫెల్ డీల్ విషయంలో.. రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య సహజంగానే ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూ ఉంటాయి. రాఫెల్ విషయంలో కూడా రాహుల్ అలాగే చేస్తున్నార్న భావన ఏర్పడటానికి అవకాశం ఉంది. అయితే.. ఆ రోజు భోపోర్స్ విషయంలో కాంగ్రెస్‌నేత పార్టీలన్నీ.. రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాయి. సామూహిక రాజీనామాల్లాంటి కార్యక్రమాలు చేపట్టారు. కానీ రాఫెల్ విషయంలో రాహుల్ గాంధీ మాత్రమే… మాట్లాడుతున్నారు. ఇతర బీజేపీయేతర పార్టీల నేతలు మాట్లాడుతున్నారు కానీ.. చాలా చిన్న స్థాయిలోనే మాట్లాడుతున్నారు. అందు వల్ల అప్పట్లో బోఫోర్స్ కు వచ్చినంత ఇంపాక్ట్ ఇప్పుడు రాఫెల్ కు వస్తుందా అన్న సందేహం ఉంది.
రాఫెల్ తో ఇతర అంశాలూ ఓటమికి ప్రభావం చూపిస్తాయి..!
అప్పట్లో బోఫోర్స్ పై ఆరోపణలు వచ్చినప్పుడు… ప్రజలు నమ్మారు. ఇప్పుడు.. నరేంద్రమోడీ విషయంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది కీలకం. నరేంద్రమోడీ పాలనలో.. ఆదానీ, అంబానీలు లక్షల కోట్లు లాభ పడ్డారన్న ప్రచారం ఉంది. కార్పొరేట్లకు భారీ ఎత్తున రుణాలు మాఫీ చేశారన్న ప్రచారం ఉంది. అయినప్పటికీ.. ఆయన తన కుటుంబ సభ్యులను మాత్రం… రాజకీయాలకు దూరంగా ఉంచారు. ఆయన కుటుంబాన్ని దగ్గరకు రానివ్వలేదన్న కారణంగా ఓ ఇమేజ్ ఉంటుంది. అయితే.. నరేంద్రమోడీ పతనానికి ఒక్క రాఫెలే కారణం కాకపోవచ్చు.. రాఫెల్ లై విపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలన్నింటినీ… 2019 ఎన్నికల వరకూ.. ప్రజల్లోకి తీసుకెళ్లి… దానితో పాటు.. ఇతర వైపల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. మోడీ పతనానికి రాఫెల్ ఒక్కటే కారణం కాకపోవచ్చు..కానీ ఇతర వైఫల్యాలు అన్నీ కలసి వచ్చి.. ప్రతిపక్షాలు పోరాడితే అది మోడీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం కావొచ్చు.