బీజేపీయతర పార్టీల్లో ఏకాభిప్రాయం రావడం లేదు. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే విషంయలో ఆ పార్టీలన్నింటిదీ ఒకటే మాట. తీవ్రమైన పోరాటం చేసి.. బీజేపీని ఓడించాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాయి. అయితే అదే సమయంలో వారంతా కలసి కట్టుగా పోరాడటానికి మాత్రం మందుకు రావడం లేదు. దానికి కారణం… ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై.. వారిలో వారికి ఏకాభిప్రాయం లేకపోవడమే. తాజాగా.. కరణానిధి విగ్రహావిష్కరణలో… స్టాలిన్… కాంగ్రెస్ కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి స్టాలినేనని ప్రకటించడంతో కొత్తగా రచ్చ మొదలైంది.
ప్రాంతీయ పార్టీల నేతలకూ ప్రధాని పదవిపై ఆశలున్నాయా..?
తమిళనాడు పార్టీ డీఎంకే… కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థుల్ని ఆహ్వానించడం ఇదే మొదటి సారి కాదు. ఆయన తండ్రి కరుణానిధి 1980లో ఇందిరాగాంధీని.. 2004లో సోనియాగాంధీని ఆహ్వానించారు… అలా చేసి విజయం సాధించారు. ఇప్పుడు… ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ వస్తున్నారు … మేము ఆహ్వానిస్తున్నామని.. తండ్రి తరహాలోనే ప్రకటనలు చేశారు. ఇది చర్చనీయాంశమయింది. దీనికి కారణం.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు… సొంతంగా బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రాంతీయ పార్టీల నేతలు చాలా మంది ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, మాయావతి , చంద్రబాబు లాంటి వాళ్లు ఈ జాబితాలో ఉండొచ్చు. స్టాలిన్ కు.. ప్రధాని అవ్వాలనే ఆలోచనలు లేవు. ఆయన దృష్టి అంతా.. ముఖ్యమంత్రి పీఠంపైనే ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించినప్పటికీ… జేడీఎస్ కు అధికారాన్ని అప్పగించింది. ఆ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు చాన్స్ వస్తుందన్న నమ్మకంతో ఆయా పార్టీల నేతలు ఉన్నారు. ఇదేమి కొత్త కాదు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ హయాంలోనూ… మద్దతిచ్చారు. అందుకే ప్రాంతీయ పార్టీలు.. చిన్న పార్టీలు.. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలకు పోతున్నామని చెప్పడానికి సిద్ధంగా లేవు.
కాంగ్రెస్ బలపడటం ఆయా పార్టీలకు ఇష్టం లేదా..?
అదీ కాక… కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో మద్దతుగా నిలిచినా… రాహుల్ నాయకత్వానికి మద్దతు ఇవ్వకపోవడానికి… ఆయా పార్టీలు ఉన్న రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు కూడా ఓ కారణం. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం వారికి ఇష్టం ఇండదు. కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టి.. ఎన్నికలకు వెళ్లినా.. తమిళనాడులో డీఎంకే పై ఎలాంటి ప్రభావం చూపించదు., ఎందుకంటే.. అక్కడ కాంగ్రెస్ పార్టీ నామమాత్రం. కానీ… ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రమే అయినప్పటికీ.. కాంగ్రెస్ విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉంది. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీగా కాంగ్రెస్ కు మైనస్ ఇమేజ్ ఉంది. అలాగే… బెంగాల్లో… మమతా బెనర్జీ పూర్తి స్థాయి పట్టు సాధించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. ఇలాంటి సమయంలో.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడానికి ఆమె సిద్ధపడటం లేదు.అలాగే యూపీలో కూడా., మాయావతి, అఖిలేష్ ఇద్దరూ.. పొత్తులు పెట్టుకున్న తర్వాత యూపీ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. కాంగ్రెస్ తో పొత్తు వల్ల వారికి వచ్చే లాభం పెద్దగా లేదు.. కానీ రాహుల్ నాయకత్వాన్ని అంగీకరిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఇలాంటి కారణాల వల్ల కొన్ని ముఖ్యమైన పార్టీలు.. రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధపడటం లేదు.
రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లు పరిస్థితి మారుతోందా..?
రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లుగా వచ్చే ఎన్నికల వాతావరణం ఏర్పడితే.. ఆ రెండు పార్టీలకే ప్రాధాన్యత పెరుగుతుందన్న భావనలో.. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇదే జరిగితే తమకు నష్టం అన్న భావనలో ఉన్నాయి. ఇప్పటి వరకు.. రాహుల్ గాంధీని.. బీజేపీ మరో విధంగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది. ఎక్కడ అడుగు పెట్టినా ఓడిపోతారని చెప్పడం ప్రారంభించారు. కానీ మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. ఇప్పుడు రాహుల్‌ను బీజేపీ అలా చెప్పలేకపోతోంది. మోడీకి ధీటుగా… రాహుల్ గాంధీ కూడా.. ఎదిగారు.
ప్రధానమంత్రి అభ్యర్థిని బీజేపీయేతర పక్షాల కూటమి ప్రకటించదా..?
ఎన్నికల తర్వాతే అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా.. ప్రధానమంత్రి అభ్యర్థుల్ని ఖరారు చేసుకోవాలన్నది అన్ని పార్టీల అభిప్రాయం. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వస్తాయి… రాహుల్ ను ప్రధానిగా ఆమోదించే పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి.. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఆధారపడి ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ముందుగా ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్ కూటమిని కవ్విస్తోంది. బీజేపీ వ్యూహంలో పడిపోకుండా… వ్యవహరించాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు… బీజేపీయేతర కూటమి కట్టకపోయినా.. ఆయా రాష్ట్రాల్లో అవగాహన చేసుకుని… బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఆ తర్వాతే అధికారికంగా కూటమి గురించి చెప్పే అవకాశం ఉంది. వచ్చే లోక్ సభ ఎన్నికల కన్నా ముందు.. బీజేపీయేతర కూటమి ఏర్పడే అవకాశం లేదు. కానీ ఆయన పార్టీలు మాత్రం.. బీజేపీకి వ్యతిరేకంగా అవగాహన ఏర్పాటు చేసుకుని పోటీ చేయనున్నాయి.