2016 అక్టోబర్‌లో భారతదేశ ఆర్మీ.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో శిక్షణ పొందుతున్న, చొరబాటుకు సిద్ధమవుతున్న ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సరిహద్దు దాటి.. మన సైనికులు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ఈ దాడులు చేశారు. వీటిని సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు హఠాత్తుగా ఆన్లైన్లో వైరల్ అయిపోయాయి. ఎలా బయటకు వచ్చాయో తెలియదు. కానీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిని బయట పెట్టిన మీడియా సంస్థలు మాత్రం… తనకు ఉన్న సోర్స్‌ల ద్వారా సంపాదించామని చెప్పుకుంటున్నాయి. రాజకీయ లబ్ది కోసం… వీటిని విడుదల చేశారని… కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్‌కు సాక్ష్యాలేమిటి అని అడిగారు కదా.. మీరే క్షమాపణలు చెప్పాలని బీజేపీ అంటోంది. ఈ వీడియోల వెనుక ఉన్న అసలు వివాదం ఏమిటి..?
సర్జికల్ స్ట్రైక్స్ పై ఎన్నో అనుమానాలు..!
భారతదేశ సైనికులు.. పాకిస్థాన్ ముష్కరులపై సరిహద్దు దాటి వెళ్లి మరీ దాడులు చేశారు. పలువరుని మట్టుబెట్టారు. 2016 అక్టోబర్‌లో ఈ సర్జికల్ దాడుల గురించి ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు దీన్నో ఘన విజయంగా ప్రచారం చేసుకున్నారు. బీజేపీ తీరు చూసి.. చాలా మంది అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్థాన్ కూడా.. తమ దేశంలో భారత్ సైనికులు ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ జరుపలేదని స్పష్టం చేశారు. అయితే… తమ ప్రజల ముందు పరువు పోతుందన్న ఉద్దేశంతో పాకిస్థాన్ ప్రభుత్వం, ఆర్మీ ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. కానీ మన దేశంలో కూడా.. చాలా మందిలో ఈ సందేహం ఉంది. ఆరెస్సెస్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే.. అరుణ్ శౌరీ లాంటి బీజేపీ నేతలు.. కూడా సర్జికల్ స్ట్రైక్స్ పై అనుమానం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని కానీ.. జరపాల్సిన అవసరం లేదని కానీ నేను చెప్పను. ఎందుకంటే మన దగ్గర ఆధారాలు లేకుండా ఇలాంటి వాటిపై ప్రత్యేకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేము.
అప్పట్లో వీడియోలు ఎందుకు రిలీజ్ చేయలేదు..?
సర్జికల్ స్ట్రైక్స్ అసలు జరగలేని పాకిస్థాన్ చెప్పినప్పుడు ఆధారాలు బయటపెట్టి ఉంటే పాకిస్థాన్ చెంప చెళ్లుమనేది. పాకిస్థాన్ అధికారికంగా దాడులు చేయలేదని చెప్పేసింది.. అనేక మంది మాజీ ఆర్మీ అధికారులు కూడా.. సర్జికల్ దాడులు జరగలేదన్నట్లు మాట్లాడారు. అయినా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలను అప్పుడు విడుదల చేయలేదు. ఇప్పుడు కూడా విడుదల చేయలేదు. అధికారికంగా బయటకు వచ్చేశాయి. అప్పట్లో ఎందుకు సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తే.. అతి జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా.. బీజేపీ వర్గాలు తేల్చి చెప్పాయి. దేశభద్రతతో ఆటలాడలేమన్నట్లుగా వ్యవహరించారు. సర్జికల్ దాడులు రహస్యంగానే చేశారు.. చేసిన తర్వాత రహస్యంగా ఉంచలేదు. పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చారు. అంతర్జాతీయ మీడియాకూ చెప్పారు. అంత బహిర్గతం చేసినప్పుడు వీడియోలు మాత్రమే ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. అప్పుడే పాకిస్థాన్ ఈ సర్జికల్ స్ట్రైక్స్ ను ఖండించింది కాబట్టి.. ఆధారాలను బయటపెట్టి ఉండాల్సింది. ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందో ఇప్పుడు భారత ప్రభుత్వమే చెప్పాలి.
రక్షణశాఖ అధీనంలో ఉండే వీడియోలకు రక్షణ లేదా..?
సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించిన వీడియోలు.. దేశభద్రతకు సంబంధించినవి. ఓ రకంగా ఇవి రక్షణ శాఖ అధీనంలో ఉండే.. జాతీయ భద్రకకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్. కానీ ఇప్పుడు ఈ వీడియోలు అనధికారికంగా బయటకు వచ్చాయి. అత్యంత రహస్యంగా ఉండాల్సిన వీడియోలు ఎలా బయటకువచ్చాయి. కేంద్రం అనుమతి లేకుండా.. అదీ రక్షణ శాఖ ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా ఎలా బయటకువచ్చాయి..?. తాము అధికారికంగా విడుదల చేయలేదని.. ప్రభుత్వం, ఆర్మీ చెబుతోంది. కేంద్రానికి సంబంధం లేకుండా వస్తే ఎందుకు విచారణకు ఆదేశించలేదు. అసలు ఎలా బయటకు వచ్చిందో..తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు..?
రాజకీయాల కోసం.. రాజకీయ ప్రత్యర్థుల్ని కార్నర్ చేయడానికి.. రక్షణశాఖకు చెందిన అత్యంత కీలకమైన .. దేశ భద్రతకు సంబంధించిన వీడియోలను బయపెట్టడం అత్యంత ప్రమాదకర సంకేతం. దీనికి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి.
సర్జికల్ స్ట్రైక్స్ వల్ల సాధించిందేమిటి..?
అసలు సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేశారు. కశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని.. దాన్ని సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దాదాపుగా అంతమొందించామని ప్రభుత్వం ప్రకటించింది. పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిపినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం.. ఇక ఈ దెబ్బతో.. ఉగ్రవాదం ఉండదని చెప్పుకొచ్చింది. కానీ అప్పుడు.. ఇప్పుడూ ఏం జరిగింది. రెండు సందర్భాల్లోనూ ఉగ్రవాదం మరింత పెరిగింతి తప్ప కంట్రోల్ కాలేదు. కశ్మీర్లో ప్రభుత్వం నుంచి వైదొలుగుతూ… బీజేపీ నేత రామ్‌మాధవ్ అక్కడి పరిస్థితిని వివరించారు. పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవారం పెరిగిందని.. హింస ఏ మాత్రం తగ్గుముఖం పట్టలేదని.. పాకిస్థాన్ వైపు నుంచి చొరబాట్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఇవన్నీ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాతేగా… జరిగింది. అంటే సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ప్రభుత్వ అంచనాలు తప్పయినట్లేగా..? ఈ వైఫల్యం బాధ్యత ఎవరిది..?
సైన్యాన్ని రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడమా..?
సర్జికల్ స్ట్రైక్స్ జరపాలా వద్దా అన్నది… ఆయా పరిస్థితులను బట్టి ఆర్మీ, ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. జరపకూడదని ఎక్కడా లేదు. కానీ దీన్ని రాజకీయానికి వాడుకోవడమే తప్పు. ఆర్మీ… దేశ రక్షణకు సంబంధించిన వ్యవస్థ. ఈ వ్యవస్థను.. కూడా.. రాజకీయాలకు వాడుకోవడం … కరెక్ట్ కాదు. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించిన వీడియోలకు రక్షణ లేకుండా పోయింది. ఇది ఎవరి వైఫల్యం..?. ఇందులో ఆర్మీ తప్పేమీ లేదు. వారి విధులలను వారు సమర్థంగా నిర్వహిస్తారు. అందులో ప్రశ్నించడానికేమీ లేదు. కానీ వారి విధుల్లో… నిర్ణయాల్లో రాజకీయాల కోసం ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడాన్ని… ఆర్మీని రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడాన్ని మాత్రం కచ్చితంగా ప్రశ్నించాల్సిందే. కానీ బీజేపీ మొదటి నుంచి.. దేశ రక్షణకు సంబంధించిన విషయాలను రాజకీయాలకు వాడుకుంటోంది. గతంలో అటల్ బీహారీ వాజ్ పేయ… త్రివిధదళాధిపతులను.. ప్రచారానికి వాడుకున్నారు. అప్పట్లో పెద్ద గొడవైంది. ఇప్పుడు బీజేపీ.. సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలను ఇందుకు ఉపయోగించుకుంటోంది.