గత కొంత కాలంగా జరుగుతున్న స్పెక్యులేషన్ ఏమిటంటే..టీడీపీ, కాంగ్రెస్ కలవబోతున్నాయని. దీనికి మొదటి సిగ్నల్ ఏమిటంటే.. చంద్రబాబు బెంగళూరులో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లారు. అప్పుడు వేదిక మీద చంద్రబాబు రాహుల్ ను కలిశారు. అప్పుడే వైసీపీ నేతలు చంద్రబాబు కాంగ్రెస్ తో కలుస్తున్నారని విమర్శలు చేశారు. వేదిక మీద రాహుల్ కనిపిస్తే గౌరవంగా పలకరించారు తప్ప… ఇంకేమీ లేదని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. మనం కొంచెం గమనిస్తే… కేజ్రీవాల్ లాంటి .. కాంగ్రెస్ ను వ్యతిరేకించే నేతలు.. ఆ రకంగా ప్రవర్తించలేదు.
కాంగ్రెస్తో పొత్తు టీడీపీకి కలసి వస్తుందా..?
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించండని.. చాలా స్పష్టంగా టీడీపీ పిలుపునిచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా పిలుపునివ్వలేదు. టీఆర్ఎస్ మాత్రం జనతాదళ్ సెక్యులర్ కు ఓటేయమని పిలుపునిచ్చింది. కానీ టీడపీ ఫలనా పార్టీకి ఓటు వేయమని చెప్పకుండా.. బీజేపీని ఓడించమని పిలుపునిచ్చింది. అంటే కాంగ్రెస్ కైనా ఓటు వేయండి.. కానీ బీజేపీని ఓడించండి అని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లను ఇతర పార్టీలు అంటరాని పార్టీలుగా చూస్తున్నాయి. 2014లో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పై ఇప్పటికీ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉంది. 2014లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఒక్క సీటు కూడా రాలేదు. అసంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందు వల్ల టీడీపీకి అనుమానం ఏమిటంటే.. ఇంకా ప్రజల్లో కాంగ్రెస్ పై కోపం ఉందని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం కాంగ్రెస్ కు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరని అనేక సర్వేల్లో వెల్లడయింది. లోక్ సభ ఎన్నికల వరకూ కాస్తంత సుముఖత రావొచ్చు. కానీ ఓటింగ్ పెరగడం మాత్రం అనుమానమే. కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించే పరిస్థితుల్లో లేనప్పుడు.. ఆ పార్టీతో కలిస్తే.. ఎలాంటి పరిస్థితులు వస్తాయోనని టీడీపీ నేతల ఆందోళన. అందుకే 2019 ఎన్నికలకు ముందు కలకూడదనేదే ఆ పార్టీ భావన. 2019 ఎన్నికల తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది టీడీపీ.
రాహుల్ ప్రత్యేకహోదా హామీ వర్కవుట్ అవుతుందా..?
కాంగ్రెస్ విషయంలో టీడీపీకి ఓ అనుమానం..మరో ఆశ ఉన్నాయి. అనుమానం ఏమిటంటే… కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే..తమనూ తిరస్కరిస్తారనే అనుమానం. ఆశ ఏమిటంటే… గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన మద్దతు కలిసొచ్చింది. ఈ సారి కాంగ్రెస్ మద్దతు కలసి వస్తుందనే ఆశ టీడీపీలో ఉంది. ప్రభుత్వ అసంతృప్తి, వ్యతిరేకత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. టీడీపీకి కూడా ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపైన ప్రజల్లో కోపం ఉంది. పొత్తులున్న వాళ్లు వదులుకున్నా.. వ్యతిరేకత కూడా మైనస్ అవుతుంది. మరి ప్లస్ అయ్యేది ఎక్కడ..? ఈ ప్లస్ కాంగ్రెస్ తో వస్తుదా అని టీడీపీలో సమాలోచన. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదా ఇస్తానంటోంది. ప్రత్యేకహోదాపైనే తొలి సంతకం పెడతానని రాహుల్ గాంధీ చెబుతున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి ఐదారు శాతం ఓటింగ్ అయినా ఉంటుందని.. ఇది టీడీపీకి ట్రాన్స్ఫర్ అయినా కూడా.. తమకు 2019లో ప్రమాదం ఉండదని టీడీపీ ఆలోచన.
ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్తో కలిస్తే ఓకేనా..?
2014లో టీడీపీకి వైసీపీ మధ్య ఓటింగ్ తేడా రెండు శాతం మాత్రమే. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉన్నప్పుడు.. .వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. అయినా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతోనే చంద్రబాబు గెలిచారు. ఇప్పుడు ఇన్ని మైనస్ లు అవుతూంటే పరిస్థితేమిటి..?. మరి ప్లస్ ఎలా వస్తుంది. వామపక్షాలు టీడీపీతో కలవబోమంటున్నాయి. వామపక్షాలు జనసేనతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిత్రులెవరూ లేనప్పుడు.. కేవలం ప్రతిపక్ష శిబిరం అనేక రూపాల్లో చీలిపోయిందనే అంశం మినహా.. టీడీపీకి కొత్తగా కనిపిస్తున్న సానుకూలత ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ తో కలిశామని చెప్పి.. పోటీ చేస్తే ప్రజలు ఏమీ అనుకోరనే భావన టీడీపీలో ఉంది.
విభజన అంశాన్ని సజీవంగా ఉంచుతున్న చంద్రబాబు..!
నిజానికి విభజన అంశాన్ని ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచింది. రాష్ట్రాన్ని విభజించకపోతే.. చంద్రబాబునాయుడు సానుకూల పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి… అనుభవం ఉన్న నేత కావాలనుకున్నారు ప్రజలు. అలాగే.. కేంద్రం అండ ఉండాలనుకున్నారు. అదే సమయంలో బీజేపీకి దేశ వ్యాప్తంగా అనుకూల పరిస్థితి ఉంది. సమయానుకూలంగా వ్యవహరించి చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒకప్పుడు మోడీని తీవ్రంగా వ్యతిరేకించారు చంద్రబాబు. అయినా అవన్నీ మర్చిపోయి.. తెలివిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరారు. ఇవన్నీ చంద్రబాబుకు కలసి వచ్చి … చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అందుకే అప్పట్నుంచి విభజన అంశాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు
ప్రజల అభిప్రాయం మారితే చంద్రబాబు ముందడుగు..!
విభజన హోదా అంశం ప్రజల్లో రగులుతూంటేనే.. ప్రత్యేకహోదా ఇవ్వలేదన్న కోపం ప్రజల్లో ఉంటుంది. ఈ సంబంధాన్ని బాగా కనిపెట్టిందే కాబట్టే.. టీడీపీ ఇప్పటికీ విభజన అంశాన్ని రగిలిస్తూనే ఉంది. అయితే.. విభజన అంశం రగులుతున్నప్పుడు…కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఆదరిస్తరా అనే డైలమాలో టీడీపీ ఉంది. ఈ డైలమా ఎటు పోతుందో.. చెప్పలేం. 2019లో ప్రత్యేకహోదా ముఖ్యమని ప్రజలు భావిస్తే.. టీడీపీ కాంగ్రెస్ తో కలిస్తే… తప్పనిపించకపోవచ్చు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ నేరుగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది. ఇంతకు ముందుకు ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే టీడీపీ ఏమని వాదిస్తోందంటే.. మేం కాంగ్రెస్కు ఓటు వేయలేదు.. బీజేపీకి వ్యతిరేకంగా వేశామంటున్నారు.