ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు.. ఫామ్ -7 వివాదం నడుస్తోంది. లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించాలని ఈ ఫామ్-7 దరఖాస్తులు వచ్చాయి. వీటిని తామే చేస్తున్నామని… ఆలస్యంగా అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంగీకరించారు. అయితే ఈ పామ్-7 అన్నీ ఫేక్ అని తేలుతూండటంతో.. ఎక్కడికక్కడ క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. అదే సమయంలో… దీనిపై రాజకీయ దుమారం ప్రారంభమైంది. తెలంగాణలోలా ప్రజల ఓట్లను తీసేసి..వైసీపీ గెలవాలనుకుంటోందని..టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ తప్పేమీ లేదని వాదిస్తోంది.
దొంగ ఓట్లపై ఫామ్-7 దరఖాస్తులు తప్పు కాదు..!
తమ ప్రాంతంలో నివసిస్తున్న వారు.. ఎవరికైనా దొంగ ఓటు ఉంది అని అనుమానం వస్తే.. ఆ ఓటును తొలగించాలని ఫామ్ -7 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ఇల్లు ఉన్న వారే కాదు.. అక్కడ నివసించని వారిపై .. చనిపోయిన వారిపై.. ఇలా రకరకాల రూపాల్లో ఓటర్ కాదు అని అనుకున్నవారిపై..ఈ ఫామ్ -7 ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అయితే.. ఈ ఫామ్-7ను దరఖాస్తు చేసినంతనే ఓట్లు తీసివేయరు. ఎన్నికల సంఘం ఈ దరఖాస్తుల మీద విచారణ జరుపుతుంది. దరఖాస్తు మంచి ఉద్దేశంతో చేశారా..? దురుద్దేశపూర్వకంగా చేసారా అన్నదానిపై విచారించి.. చర్య తీసుకుంటుంది. ఇది సహజంగా జరిగే పరిణామం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది వేరు. లక్షల సంఖ్యలో ఫామ్-7లు వచ్చాయి. దొంగ ఓటుపై ఫిర్యాదు చేయమని ఎవరూ అనడం లేదు. కానీ.. ఎందుకని.. ఇన్ని లక్షల సంఖ్యలో ఒక్కసారే వస్తాయి. ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేస్తేనే ఇలా వస్తాయి.
నిజమైన ఓటర్లను తొలగించే ప్రయత్నం చేయడం నేరమే..!
నిబంధనల ప్రకారం.. ఎవరైనా తనకు తెలిసిన దొంగ ఓటు ఉంటే.. ఫిర్యాదు చేయాలి. అంతే కానీ.. బల్క్‌గా అన్ని ఓట్లనూ టార్గెట్ చేయకూడదు. ఓటర్లను చేర్పించే విషయంలోనూ… ఇదే పక్రియ ఉంటుంది. ఎవరైనా తనకు ఓటు కావాలని దరఖాస్తు చేసుకోవాలి కానీ… ఇతరుల పేర్లు పెట్టాలని బల్క్‌గా.. దరఖాస్తులు సొంతానికి ఇవ్వకూడదు. ఫామ్-7 విషయంలోనూ అంతే. ఎవరైనా.. తమ కుటుంబ సభ్యుల ఓటు గురించి లేదా… తెలిసిన వ్యక్తుల గురించి ఈ ఫామ్ -7 పెట్టుకుంటారు. కానీ ఏపీలో జరిగింది వేరు. అంతా.. ఓ ప్రణాళికాబద్దంగా జరిగినట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈ అప్లికేషన్ల జాడపట్టుకుని ఆందోళన ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి ఈ దరఖాస్తులు చేయించినట్లు ఆరోపిస్తోంది. టీడీపీ బలమైన ఆరోపణలు చేస్తున్న సమయంలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా.. అంగీకరించారు. అవును.. తామే ఫామ్-7లు ఇచ్చామని ప్రకటించుకున్నారు. తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లను చేర్పించించి కాబట్టే… తాము తొలగిచడానికి ఫామ్-7లు ఇచ్చామని.. నేరుగా అంగీకరింంచారు.
కుట్రపూరితంగా చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవాలి…!
ఫామ్-7లపై లక్షల దరఖాస్తులు ఇచ్చామని.. అందులో తప్పేముందని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అవి దొంగ ఓట్లు అంటున్నారు. నిజంగానే.. వైసీపీ తరపున బల్క్‌గా వెళ్లిన ఫామ్-7 దరఖాస్తుల్లో… కనీసం అరవై, డెబ్భై శాతం అయినా.. దొంగ ఓట్లు ఉంటే… ఆయన మంచి పనే చేసినట్లు చెప్పుకోవాలి. అవి దొంగ ఓట్లు కాకుండా.., నిజంగా ఉన్న వారి ఓట్లను.. తొలగించడానికి కుట్ర పూరితంగా ఈ దరఖాస్తులు చేస్తే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఎన్నికల కమిషన్ దీనిపై పూర్తి స్థాయిలో విచారించాలి. బల్క్‌గా దరఖాస్తులు వచ్చినా.. అవి నిజంగానే దొంగ అయితే.. ఆహ్వానించాల్సిందే. కానీ నిజమైన ఓటర్లను తొలగించే కుట్ర అయితే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో.. తామే చేశామని..జగన్మోహన్ రెడ్డి నేరుగా అంగీకరించారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆ దరఖాస్తులన్నింటినీ… క్షణ్ణంగా పరిశీలించి… లోపాలు లేని.., ఓటర్ల జాబితాను సిద్దం చేయాల్సి ఉంది.