జమిలి ఎన్నికలకు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరోసారి బీజేపీ విధానానికి అనుకూలంగా వైసీపీ వ్యవహరించింది. అయితే అదే సమయంలో.. వైసీపీ నేత విజయసాయిరెడ్డి… తెలివిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో .. బీజేపీకి కానీ.. బీజేపీ మిత్ర పక్షాల అభ్యర్థికి కానీ మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. జమిలి ఎన్నికల విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల వైసీపీ, బీజేపీ ఒకటేనన్న విమర్శలొస్తాయన్న కారణంగా సందర్భం లేకపోయినా.. విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. ఇలా విజయసాయిరెడ్డి ఎందుకు ప్రకటించారన్నది.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయానికి అర్థమవుతుంది.
జమిలికి ఖర్చు ఎక్కువ అన్న వాదన కరెక్ట్ కాదు..!
ఇప్పటికిప్పుడు మేం జమిలీ ఎన్నికలకు మేం మద్దతిస్తున్నాం అని చెప్పారు. జమిలీ ఎన్నికలకు మద్దతివ్వడానికి దాదాపుగా బీజేపీ చెప్పిన కారణాలే చెప్పారు. ఒకటి ఖర్చు ఎక్కువ అని చెప్పారు. కాని అది వాస్తవం కాదు. భారదేశంలో లోక్ సభ ,అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ..ఎన్నికలు నిర్వహించడానికి అయ్యే ఖర్చు 8 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లన్నీ కలిపితే..30 నుంచి 35 లక్షల కోట్లు దాటిపోతుంది. ఇందులో ప్రజాస్వామ్యం కోసం ఖర్చు పెట్టేది రూ. 8వేల కోట్లు మాత్రమే. అంటే ఓటర్ కి ఏడాదికి రూ. 27 మాత్రమే. అందువల్ల ఖర్చు అనేది … జమిలీకి ఓ కారణం మాత్రమే.
జమిలి వల్ల అవినీతి ఉండదన్న వాదన విచిత్రం..!
ఇక వైసీపీ చెప్పిన రెండో కారణం ఎన్నికల్లో అవినీతి తగ్గుతోందని చెప్పడం. ఓటుకు నోటు లాంటి కేసులు రావని వైసీపీ చెబుతోంది. అసలు ఓటుకు నోటు కేసు శాసనమండలి ఎన్నికల సమయంలో వచ్చింది. ప్రతి రెండేళ్లకోసారి శాసనమండలి ఎన్నికలు జరుగుతూంటాయి. జమిలీ ఎన్నికలు ఉన్నా కూడా… శాసనమండలి ఎన్నికలు వస్తాయి. దాని స్ట్రక్చరే అంత. ఎమ్మెల్సీల ఆరేళ్ల పదవి కాలంలో.. ప్రతి రెండేళ్లకోసారి మూడో వంతు మంది సభ్యులు పదవి విరమణ చేస్తూంటారు. వారి కోసం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. శాసనమండలి ఎన్నికల్లో జరిగిన ఓటుకు నోటు కేసును పార్లమెంట్ ఎన్నికలకు కలిపి… అవినీతి తగ్గుతుందని చెబుతున్నారు. ఇది పస ఉన్న వాదన కాదు.
ఎన్నికలప్పుడే కాదు..ఎప్పుడూ అవినీతి ఉంటుంది..!
అవినీతి ఎన్నికలప్పుడే ఉంటుందా..?. వైసీపీ ఇప్పటికీ రోజూ అవినీతి జరుగుతోందని ఆరోపిస్తోంది కదా..? . ఇసుకదందాలని..మరొకటని ఏదో ఓ ఆరోపణ చేస్తూనే ఉంది కదా. అంటే అవినీతి అనేది ఐదేళ్ల పాటు ఉంటుంది . ఇప్పుడు ఏపీలో ఎన్నికలప్పుడే అవినీతి జరుగుతోందని వైసీపీ ఒప్పుకుంటుందా..?. ఎన్నికలప్పుడే అవినీతి జరుగుతోంది. మిగత అంతా అవినీతి రహిత పాలన జరుగుతోందని అంగీకరిస్తే ఓకే. వైసీపీ చెప్పిన కారణాల్లో అర్థం లేదు.
మొదటి నుంచి బీజేపీకి ఏకపక్షంగా మద్దతు ఇస్తున్న వైసీపీ..!
వైసీపీ ఇప్పుడు జమిలీ ఎన్నికల విషయంలోనే బీజేపీకి ద్దతు ఇవ్వలేదు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలకు మద్దతు ఇవ్వబోము అని చెబుతున్నారు. ఎందుకివ్వబోమంటే… ప్రత్యేకహోదా ఇవ్వబోమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు కనుక.. మద్దతు ఇవ్వబోము అని చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించడానికి ముందే… కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేకహోదా ఇవ్వలేమని ప్రకటించింది. ఇప్పుడు అఫిడవిట్ వేశారు కాబట్టి మద్దతు ఇవ్వబోమంటోంది. పార్లమెంట్ లో చేసిన అధికారిక ప్రకటన చేసినప్పుడు.. మద్దతు ఇచ్చి.. ఇప్పుడెందుకు ఇలాంటి ప్రకటన చేసింది. ..?. తన బద్దశత్రువైన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నా… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు వైసీపీ ఎలాంటి షరతులు పెట్టకుండా మద్దతు ఇచ్చింది. అసలు ఎలా మద్దతు ఇస్తుంది..?
నాలుగేళ్లలో మోడీని పల్లెత్తు మాట అనని వైసీపీ..!
ఇదే కాదు..మోడీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలో ప్రతిపక్షాలు.. అనేక అంశాల్లో పార్లమెంట్ బయట, లోపల ప్రతిపక్షాలు.. అనేక సార్లు ఆందోళనలు చేశాయి. కానీ ఎక్కడా విపక్షాల సమావేశాల్లో వైసీపీ కనిపించలేదు. లోపలా కనిపించలేదు. బయటా కనిపించలేదు. జీఎస్టీ, నోట్ల రద్దుతో పాటు.. పెట్రోల్, డీజిల్ చార్జీల పెంపుదలపైనా .. కనీస మాత్రం మాట్లాడలేదు. నిరవ్ మోదీ ఇష్యూపైనా మాట్లాడలేరు. విభజన హామీలపైనా మాట్లాడలేదు. ఇంత కాలం ఇంతగా మద్దతుగా నిలబడి.. సడన్ గా వచ్చి.. మేం ఒక్క డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతివ్వబోం అని ప్రకటిస్తున్నారు.
కేసుల భయంతోనే బీజేపీపై నోరెత్తలేకపోతున్న వైసీపీ..!
ఇప్పుడు ఒక్క జమిలి విషయంలోనే కాదు.. మొత్తంగా పరిశీలిస్తే… మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడదల్చుకోలేదు. సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్..లాలూ ప్రసాద్ యాదవ్ వెంట పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో కేసుల్లో ఎక్కడా పురోగతి లేదు. బీజేపీ నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనరు. 2019 ముందు వీరు అధికారికంగా కలిసే అవకాశం తక్కువ. ఎన్నికల తర్వాత మాత్రం కలిసే అవకాశం ఉంది. ముందుగా కలసి వెళ్లడానికి వైసీపీ ఎందుకు వెనుకాడుతోందంటే.. వైసీపీకి ఓటు బ్యాంక్ గా ఉన్న వర్గాలన్నీ… బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. అందుకే… ఇప్పటికిప్పుడు బీజేపీతో వైసీపీ కలవకపోవచ్చు. బీజేపీతో స్నేహం ఉందనే వాతావరణం ప్రజల్లోకి వెళ్లినా వైసీపీకి నష్టమే. అలా అని… బీజేపీకి వ్యతిరేకంగా… జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే.. సీబీఐ కేసులే. బీజేపీని వ్యతిరేకించి.. లాలూప్రసాద్ యాదవ్ జైలుకెళ్లారు. జగన్ కూ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయం.