సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీకి ప్రయోజనం కల్పించడానికి మోడీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అసలు ముందస్తు ఎన్నికలంటూ జరిగితే లాభం ఏ పార్టీకి ఉంటుంది..?. ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రకారం.. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి. రాజకీయ సంక్షోభాలు వచ్చి ప్రభుత్వాలు పడిపోతే అది వేరే విషయం. కానీ మెజార్టీ ఉన్నప్పటికీ.. కేవలం ఎన్నికల కోసమే.. ముందస్తుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు పోవడం… ప్రజాతీర్పును వమ్ము చేయడమే.
ముందస్తు ఎన్నికలు అసాధారణమేమీ కాదు..!
అయితే భారత రాజకీయాల్లో ఇది అసాధారణమేమీ కాదు. అధికార పార్టీలు మూడు నెలలు, ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా వెళ్లినప్పుడల్లా గెలుస్తారా అంటే… చెప్పలేదం. మనకు వాజ్‌పేయి ప్రభుత్వం ముందస్తున్న ఎన్నికలకు వెళ్లారు కానీ ఓడిపోయారు. చంద్రబాబు కూడా…అలిపిరి ఘటన తర్వాత సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ గెలుపొందలేదు. ఏడాది చివరి చివరిలో జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తో బీజేపీ ముఖాముఖి తలపడుతోంది. ఇందులో కాంగ్రెస్ గెలిస్తే… తర్వాత ఐదు నెలల్లోపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందనే వాదన ఉంది. కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తుందని బీజేపీ భావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వలపై వ్యతిరేకతను మోడీ ఇమేజ్‌తో అధిగమిస్తారా..?
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌కు కూడా ఎన్నికలు జరిగితే.. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత.. పార్లమెంట్ ఎన్నికలపైనా పడుతుంది. ఎందుంటే.. భారతదేశ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే… పార్లమెంట్‌కు, అసెంబ్లీలకు.. ఒకే సారి ఎన్నికలు జరిగినప్పుడు.. 77 శాతం ఒకే పార్టీ గెలుపొందింది. అంటే.. పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికలకు జరిగితే.. ఒకే పార్టీకి ఓటేశారు తప్ప.. పార్లమెంట్‌కి ఒకరికి.. అసెంబ్లీకి మరొకరికి ఓటేయలేదని అర్థం. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్న సమీకరణాలేమిటంటే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకత ఉంది. కానీ మోడీ పాలనపై అనుకూలత ఉంది. అందుకే.. మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటే పార్లమెంట్ కు ఎన్నికలు జరిపితే… మోడీ సానుకూలత వల్ల ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించవచ్చనేది ఆ పార్టీ ఆలోచన.
అనుకూలతే కాదు..వ్యతిరేకత కూడా ఉంటుంది..!
కానీ డామిట్.. కథ అడ్డం తిరిగితే.. అప్పుడేం జరుగుతుంది…?. ఒక అందమైన యువతి … గొప్ప తత్వవేత్త అయిన జార్జ్ బెర్నార్డ్ షా వద్దకు వచ్చి ..”మనిద్దరం పెళ్లి చేసుకుందాం.. నా అందం..నీ తెలివితో మంచి పిల్లలు పుడతారు అన్నదట”. దానికి బెర్నార్డ్ షా..”నా అందం.. నీ తెలివి ఉన్న పిల్లలు పుడితే పరిస్థితేమిటని” ప్రశ్నించాడట. బెర్నాడ్ షా లాజిక్ ప్రకారం.. చూస్తే.. బీజేపీ కేంద్రం సానుకూలత చూసుకుని.. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్తే… ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్న వ్యతిరేకత ప్రభావాన్ని కేంద్ర కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మోడీని సమర్థించేవారు… ఏం చెబుతారంటే.. మోడీ సానుకూలత.. రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతను బీట్ చేస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ముందస్తు ఎన్నికలను వ్యతిరేకించేవారు… రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకత ప్రభావం.. కేంద్రంపై పడి.. మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు ఎన్నికలు జరిపినా బీజేపీకి సమస్యలుంటాయి..!
బీజేపీలో ముందస్తు ఎన్నికలను సమర్థించేవాళ్లు … విపక్షం ఏకమవకముందే ఎన్నికలు జరపాలంటున్నారు. ఇది కొంత వరకు నిజమే. కానీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.కర్ణాటకలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుంది. కానీ మేలో ఎన్నికలంటే… అప్పటికి పరిస్థితులు మారొచ్చు. అందువల్ల… విపక్షం… ఏకమవడానికి అవకాశం ఉంటుంది… విచ్చిన్నం అవడానికి కూడా అవకాశం ఉంటుంది. దీని వల్ల ముందస్తు ఎన్నికలు ఈ కారణం వల్ల లాభదాయం అవుతుందా లేదా అన్నది చెప్పలేము.
వ్యతిరేకత పెరగడమేనా.. తగ్గొచ్చుకదా..!
మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందని మరో కారణం. ఉపఎన్నికల ఫలితాల్లో ఈ వ్యతిరేకత బయటపడింది. పెట్రోల్ ధరలు, దేశంలోని ఇతర సమస్యల వల్ల మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతూ పోతోంది. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే కొంత వరకూ.. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడవచ్చని ముందస్తును సమర్థించేవారు వాదిస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఇప్పుడున్న వ్యతిరేకతను బట్టే పలితాలు వస్తాయి. మేలో ఎన్నికలు జరిగితే.. ఆలోపు.. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ప్రభుత్వం వ్యతిరేకితను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతను కారణాలుగా పెట్టుకుని ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడం వల్ల గ్యారంటీగా ఉపయోగం ఉండకపోవచ్చు.
ముందస్తుకు వెళ్తే లాభం కలుగుతుందన్న గ్యారెంటీ లేదు..!
అంటే ముందస్తు ఎన్నికల వల్ల అధికారంలో ఉన్న వారికి లాభం… ప్రతిపక్షంలో ఉన్న వారికి నష్టం అని ఎక్కడా సిద్ధాంతీకరించలేదు. రాజకీయ పార్టీలు అనేక లెక్కలు వేసుకుని ముందస్తు ఎన్నికలపై నిర్ణయాలు తీసుకుంటాయి. ఏ లెక్కలను.. తీసుకుంటాయన్నది ఆసక్తికరం. ఎంత ఓటింగ్ జరిగిందనేదానిపై… కూడా.. విశ్లేషణలు చేస్తూంటారు. భారీగా ఓటింగ్ జరిగితే.. ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి ఓట్లేశారని విశ్లేషిస్తూంటారు. కానీ.. పోలింగ్ శాతాన్ని బట్టి.. అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ గెలుస్తుందనే రూలింగ్ ఎక్కడా లేదు. అంతా ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు.. అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. భారత ఓటర్ల మూడ్ ను అంచనా వేయడం అంత సులభం కాదు. పాశ్చాత్య దేశాల్లోలా భారత్ లో ఎన్నికల తీరు ఉండదు. భారత్ అంటే.. భిన్నత్వంలో ఏకత్వం..కులాలు, మతాలు, ప్రాంతాలు సహా ఎన్నో అంశాలు రాజకీయ అంశాలపై ప్రభావితం చూపిస్తూంటాయి.
ముందస్తు ఎవరికి లాభమో ఎవరూ చెప్పలేరు..?
దీన్ని బట్టి నిర్దిష్టమైన కచ్చితమైన నిర్ణయానికి రావడం అంత సులభమైన పని లేదు. దీనిపై రకరకాల విశ్లేషణలే కానీ.. కచ్చితంగా ఇలా జరుగుతుందనే… మ్యాథమెటికల్ రియాక్షన్ కానీ.. కెమికల్ రియాక్షన్ లేదు. సోడియం క్లోరైడ్, నైట్రిక్ యాసిడ్ కలిపితే..సోడియం నైట్రేట్ ఉత్పత్తి అవుతుందనే.. కెమికల్ రియాక్షన్ కానీ.. మ్యాథమెటికల్ యాక్షన్ కానీ ఉండదు. ఇది రాజకీయాలు అంతే.. ఫలితాలు ఎలా ఉంటుందో ఎవరూ అంచన వేయలేరు. అందుకే ముందస్తు ఎన్నికలు వెళ్తే..ఎవరికి లాభం ఉంటుందో ఎవరూ చెప్పలేదు.