తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే..ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. దానికి ముందుగా టీఆర్ఎస్.. తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీలో వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రకారం … ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… వచ్చిన ఓట్లు ఆయా పార్టీలకే వస్తే ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్‌లో మాత్రమే టీఆర్ఎస్ వెనుకబడి ఉంది. మిగతా చోట్ల చాలా బలంగా టీఆర్ఎస్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తే.. పదిహేను సీట్లు వస్తాయనుకుందాం..! ఒకటి ఎంఐఎం గెల్చుకుంటుంది..! మరి పదిహేను సీట్లతో టీఆర్ఎస్ చక్రం తిప్పగలదా..?
లోక్‌సభ సీట్లు ఎన్ని వస్తాయో చెప్పడం సాధ్యమా..?
తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు వచ్చిన ఫలితాలు పార్లమెంట్లో వస్తాయన్న గ్యారంటీ లేదు. అలాగే రావన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే.. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆరు పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. అసెంబ్లీ సీట్ల దగ్గరకు వచ్చే సరికి ఆమ్ ఆద్మీ పార్టీకి క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ నుంచి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. ఆరు ఎంపీలు ఎక్కడ..? ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కడ..? అంటే.. ఇవాళ ఉంటున్న పరిస్థితి రేపు ఉంటుందని చెప్పలేము. 2019 ఎన్నికలకు వచ్చే సరికి మోడీ వర్సెస్ రాహుల్ అన్న పరిస్థితిగా మారే అవకాశం ఉంది. మూడు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. బీఎస్పీ, ఎస్పీ.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ , చత్తీస్ గఢ్‌లలో వేర్వేరుగా పోటీ చేసినా.. ఇప్పుడు కాంగ్రెస్‌కే మద్దతిస్తున్నాయి. చత్తీస్ ఘడ్లో ఏడు శాతం.. ఓట్లు బీఎస్పీ, అజిత్ జోగి పార్టీకి కలిపి 11 శాతం ఓట్లు వచ్చినా ఏమీ చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి.. టీఆర్ఎస్కు పదహారు సీట్లు వస్తాయా లేక పది అవుతుందా.. అనేది మనం ఎవరమూ చెప్పలేము.
15 సీట్లు గెల్చుకుంటే అవి కాంగ్రెస్‌కో.. బీజేపీకో అవసరం పడాలి కదా..?
టీఆర్ఎస్ ఒక వేళ పదిహేను సీట్లు గెలుచుకున్నప్పటికీ.. ఢిల్లీలో చక్రం తిప్పాలంటే.. పరిస్థితి కలిసి రావాలి. కాంగ్రెస్ పార్టీకి కానీ.. బీజేపీకి కానీ.. ఆ పదిహేను సీట్లు అవసరం పడాలి. అలాంటి నెంబర్ గేమ్ వస్తేనే.. టీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పడానికి అవకాశం ఏర్పడింది. జాతీయ పార్టీలు కూడా.. ప్రాంతీయ పార్టీలను తేలికగా తీసుకోవడం లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ ఎన్నికల్లో వారు సాధించిన విజయాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎస్పీ, బీఎస్పీ, అజిత్ జోగి పార్టీలు ఆయా రాష్ట్రాల్లో విడివిడిగా పోటీ చేశాయి. అదే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌తో కలిసి ఎస్పీ, బీఎస్పీ కలసి పోటీ చేసి ఉంటే.. ఘన విజయాలు లభించి ఉండేవి. రాజస్థాన్ లో అయితే.. కాంగ్రెస్, బీఎస్పీలకు కలిపి వచ్చిన ఓటింగ్‌తో సులువుగా 150 సీట్లు వరకూ గెలుచుకుని ఉండేవారు. అందువల్ల… కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే.. మిత్రులను కూడా కలుపుకుని వెళాల్సి ఉంటుంది. మిత్రులకు కూడా మరో దారి లేదు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసిన తర్వాత.. కలసి పోటీ చేయకుండా ఉండే నిర్ణయం తీసుకోలేరు.
నెంబర్ గేమ్ ఏర్పడితే కీలకం అయ్యే చాన్స్ ఉన్నట్లే..!!
ఇలాంటి నెంబర్ గేమ్ ఏర్పడినప్పుడు.. టీఆర్ఎస్కు వచ్చే పదిహేను సీట్లు చాలా కీలకం అవుతాయి. 2014లో మోడీకి క్లియర్ మెజార్టీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మోడీకి క్లియర్ మెజార్టీ వచ్చే అవకాశం లేదు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, కర్ణాటకల్లో విపక్షాలన్నీ కలిసిన తర్వాత చాలా సీట్లు తగ్గిపోనున్నాయి. ఇక్కడ తెలంగాణలో చూశాం.. ఐదు అసెంబ్లీ సీట్లు ఉంటే… నాలుగు కోల్పోయారు. ఒక్కటి మాత్రమే నిలబెట్టుకున్నారు. ఇక్కడ ఓ పార్లమెంట్ సీటు ఉంది. అది కూడా గెల్చుకుంటారన్న గ్యారంటీ లేదు. అంటే.. కచ్చితంగా బీజేపీకి సీట్లు తగ్గుతాయి అదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రధాన రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీ రాకపోవడం వాళ్ల అదృష్టం. ఎందుకంటే.. వాళ్లు కర్ణాటకలో జేడీఎస్‌ను కానీ.. ఇతర రాష్ట్రాల్లో ఎస్పీ, బీఎస్పీని కాని పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు మాత్రం.. మిత్రులను వదిలి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది కాంగ్రెస్‌కు లాభం చేకూర్చబోతోంది.